APSRTC Diesel Cess Increased In AP, New Bus Ticket Prices From Today - Sakshi
Sakshi News home page

New Bus Ticket Prices In AP: ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ పెంపు

Published Fri, Jul 1 2022 4:21 AM | Last Updated on Fri, Jul 1 2022 9:47 AM

APSRTC diesel cess hike Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: డీజిల్‌ ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై డీజిల్‌ సెస్సు పెంచింది. పెరిగిన డీజిల్‌ ధరలతో ఆర్టీసీపై రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. దీంతో అనివార్యంగా డీజిల్‌ సెస్సు పెంచుతున్నట్టు ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన డీజిల్‌ సెస్సు శుక్రవారం నుంచి అమలులోకి రానుంది.

కనీస దూరం ప్రయాణానికి డీజిల్‌ సెస్‌ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్‌ సెస్‌ పెంచారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్‌ సెస్‌ పెంచలేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్‌ ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ తక్కువ పెంచింది. తెలంగాణలో అన్ని ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల బస్‌ పాస్‌లపై డీజిల్‌ సెస్‌ను రెండోసారి జూన్‌ 9న పెంచిన విషయం తెలిసిందే.  

బల్క్‌ డీజిల్‌ ధర లీటర్‌ రూ.131 
2019 డిసెంబర్‌లో డీజిల్‌ ధర మార్కెట్‌లో లీటరు రూ.67 ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి రూ.107కి చేరుకుంది. అంటే లీటరుకు రూ.40 చొప్పున పెరిగింది. దీంతో నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు అనివార్యంగా ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ 13 నుంచి విధిస్తోంది. ప్రస్తుతం బల్క్‌ డీజిల్‌ ధర లీటర్‌ రూ.131కి చేరుకోవడంతో ఆర్టీసీ నిత్యం అదనంగా రూ.2.50 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. బస్సుల నిర్వహణ, స్పేర్‌ పార్ట్‌ల ధరలు కూడా పెరగడంతో ఆర్థిక భారం అధికమైంది. దీన్ని కొంతవరకైనా భర్తీ చేసే ఉద్దేశంతో డీజిల్‌ సెస్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  


కనీస దూరానికి పెంపులేదు 
ప్రయాణించే దూరాన్ని బట్టి కి.మీ. ప్రాతిపదికన డీజిల్‌ సెస్‌ పెంచారు. కనీస దూరానికి డీజిల్‌ సెస్‌ పెంచలేదు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో 30 కి.మీ, అల్ట్రా డీలక్స్‌ బస్సుల్లో 20 కి.మీ, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 55 కి.మీ, ఏసీ సర్వీసుల్లో 35 కి.మీ, అమరావతి సర్వీసుల్లో 55 కి.మీ వరకు ప్రస్తుతం డీజిల్‌ సెస్సు పెంచలేదు. అంతకుమించి ప్రయాణించే కి.మీ. ప్రాతిపదికన డీజిల్‌ సెస్సు పెంచారు. విద్యార్థుల బస్‌ పాస్‌ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి.

సహృదయంతో సహకరించాలి
డీజిల్‌ ధరలు అమాంతం పెరుగుతుండటంతో ఆర్టీసీపై నష్టాల భారం రోజురోజుకు పెరుగుతోంది. అనివార్యంగా ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ పెంచాల్సి వచ్చింది. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. ఆర్టీసీలో సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలందిస్తాం. 
– ఎ.మల్లికార్జున రెడ్డి, (ఆర్టీసీ చైర్మన్‌), సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement