బొగ్గు ఉత్పత్తిలో ఏపీఎండీసీ కీలక ముందడుగు | APMDC Key Step Forward In Coal Production | Sakshi
Sakshi News home page

బొగ్గు ఉత్పత్తిలో ఏపీఎండీసీ కీలక ముందడుగు

Published Fri, Mar 11 2022 7:08 PM | Last Updated on Fri, Mar 11 2022 7:13 PM

APMDC Key Step Forward In Coal Production - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపీ ఎండీసీ) మరో మైలురాయిని అధిగమించింది. జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియాల సరసన ఇతర రాష్ట్రాల్లో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మూడో ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపును సాధించింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్న ఏపీఎండీసీ మార్చి 10వ తేదీ నుంచి ఈ గనిలో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది.  2007లోనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గుగని ఏపీఎండీసీకి కేటాయించినా, వివిధ కారణాల వల్ల మైనింగ్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభం కాలేదు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సుల్యారీ కోల్ మైన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న ఆటంకాలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వపరంగా ఏపీ ఎండీసీకి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంతో గత ఏడాది ఆగస్టు నెలలో సుల్యారీలో బొగ్గు వెలికితీత పనులకు శ్రీకారం చుట్టారు. ఓవర్ బర్డెన్ పనులు పూర్తి చేసుకుని తాజాగా వాణిజ్య సరళి బొగ్గు ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఏపీఎండీసీ తన విస్తరణలో కీలక ముందుడుగుగా వేసింది.

సీఎం వైఎస్‌ జగన్ చొరవతోనే ఈ విజయం: మంత్రి పెద్దిరెడ్డి
సీఎం వైఎస్‌ జగన్ విజన్ వల్లే ఏపీఎండీసీ ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా తన మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యాన్ని సాధించిందని రాష్ట్ర భూగర్భ గనులు, పీఆర్అండ్‌ఆర్డీ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2007లోనే ఏపీ ఎండీసీ మధ్యప్రదేశ్ లో సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్నప్పటికీ 2019 వరకు ఒక్క అడుగు కూడా బొగ్గు ఉత్పత్తి విషయంలో ముందుకు పడలేదని అన్నారు.

సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్‌ను ఒక సవాల్‌గా తీసుకుని అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. నేడు సుల్యారీలో వాణిజ్యసరళిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడానికి సీఎం చేసిన కృషి కారణమని, ఈ సందర్బంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మైనింగ్ కార్యక్రమాలకు పరిమితమైన ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పెద్దపెద్ద సంస్థలతో పోటీగా బొగ్గు ఉత్పత్తి రంగంలో నిలబడటం, నిర్ధేశిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ విసి అండ్‌ ఎండీ విజి వెంకటరెడ్డి, ఇతర అధికారులు, కార్మికులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు, ప్రభుత్వ రంగ సంస్థల నైపూణ్యాలను పెంచుకుంటూ జాతీయ స్థాయిలో తమ కార్యక్రమాలను విస్తరింప చేసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహాన్ని పూర్తిస్థాయిలో అందిస్తోందన్నారు.

జార్ఘండ్ లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌ను సైతం 2021లో ఏపీఎండీసీ పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి బిడ్డింగ్‌ లో దక్కించుకుందన్నారు. అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్ ను ఈ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేసేందుకు ఎపిఎండిసి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఉక్కు కర్మాగారాల్లో వినియోగించే ఈ కోకింగ్ కోల్ ను ఏపీఎండీసీ ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల మన రాష్ట్ర అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి కోకింగ్ కోల్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గుగనులతో పాటు ఇరత మేజర్ మినరల్స్ విషయంలోనూ సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా మైనింగ్ కార్యక్రమాలను నిర్వహింపచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. 

బొగ్గు ఉత్పత్తి ద్వారా ఏటా రూ.1200 కోట్లు ఆదాయం..
మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గని నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తుందని సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తెలిపారు. రూ.2వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీఎండీసీ ఈ బొగ్గుగనిలో ఉత్పత్తి ప్రారంభించిందని, సాలీనా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం ఈ బొగ్గు గని ద్వారా లభిస్తుందన్నారు. మొత్తం 110 మిలియన్ టన్నులు బొగ్గు నిల్వలు ఈ గని పరిధిలో ఉన్నాయని, కనీసం 22 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పతి జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్ణయించిన 5 మిలియన్ టన్నులను మించి అదనంగా మరో రెండు మిలియన టన్నుల బొగ్గును కూడా ప్రతిఏటా వెలికితీసే అవకాశం ఉందని, ఈ మేరకు సంస్థ సామర్థ్యంను కూడా పెంచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ నెల 10 తేదీ నుంచి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామని, ఈ బొగ్గులో 25 శాతం సూక్ష్మా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లకు కేటాయిస్తామని, మిగిలింది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విక్రయిస్తామని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ లకు బొగ్గు విక్రయాలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన ఎం-జంక్షన్ ద్వారా ఈ-ఆక్షన్ కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి సాధనలో పనిచేసిన సంస్థ ఉద్యోగులు, కార్మికులను అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement