Fact Check: ఏపీలోనే వెలుగులు | AP is using renewable energy sources | Sakshi
Sakshi News home page

Fact Check: ఏపీలోనే వెలుగులు

Published Fri, Feb 9 2024 5:41 AM | Last Updated on Fri, Feb 9 2024 5:50 AM

AP is using renewable energy sources - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ప్లాంటు కట్టేశామని స్ట్రక్చర్‌ పూర్తయినట్లు చూపిస్తే సరిపోదు. లోపల అనేక టర్బైన్లు, ఇతర యంత్రాలు అమర్చాలి. ఈ మాత్రం జ్ఞానం కూడా లేని రామోజీ..వాస్తవాలను వక్రీకరించి గత పదేళ్లుగా విద్యుత్‌ సంస్థలు చేస్తున్న కృషిని తక్కువ చేస్తూ వాటి మనోబలాన్ని  దెబ్బతీ­సే­లా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు.

ఏపీ మొత్తం విద్యుత్‌ డిమాండులో ఏపీజెన్‌కో 45 నుంచి 50  శా­తం వరకూ సమకూర్చుతుండగా, తెలంగాణలో జెన్‌­కో, సింగరేణి ప్లాంట్లు అన్నీ కలిపి రాష్ట్ర డిమాండులో 37 నుంచి 38  శాతం విద్యుత్‌ మాత్రమే ఇవ్వ­గలుగుతున్నాయి. నిజాలు ఇలా ఉండగా ‘తెలంగా­ణలో మిరుమిట్లు..ఏపీలో కునికి­పాట్లు’ శీర్షికన ఈనా­డు రాసిన ఆ అభూతకల్పనల కథనాన్ని విద్యు­త్‌ సంస్థలు ఖండిస్తూ వివరాలు వెల్లడించాయి. 

ఆరోపణ: పొరుగు రాష్ట్రంతో పోటీ పడలేక పోయింది
వాస్తవం: విభజన నాటికి రాష్ట్రంలో రోజుకు సరాసరి 20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉండేది. అది అప్పటి  రోజువారీ విద్యుత్‌ వినియోగంలో దాదాపు 18 శాతం. విభజన చట్టంలో ఆస్తులు భౌగోళికంగా, అప్పులు జనాభా నిష్పత్తిలో, విద్యుత్‌ ఒప్పందాలు అప్పటికున్న లోడ్‌ ప్రకారం విభజించారు. రాష్ట్ర విభజన తేదీ నాటికే  హైదరాబాద్‌  వల్ల తెలంగాణలో విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉండేది. అలాగే ఆంధ్ర రాష్ట్రంతో  పోలిస్తే తెలంగాణ జనాభా తక్కువ కావడంతో అక్కడ తలసరి విద్యుత్‌ వినియోగం ఎక్కువ.

అందుకే దాదాపు 2017 వరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలు తెలంగాణ సంస్థలకు విద్యుత్‌ అందించాయి. దానికి సంబంధించి దాదాపు రూ.7400 కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. అంతటి విద్యుత్‌ కొరతను అధిగమించి మనకు భౌగోళికంగా అను­కూలంగా ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుని, కావలసిన ధర్మల్‌ విద్యుత్‌ ను కూడా అభివృద్ధి చేసుకుని మన రాష్ట్రం విద్యుత్‌ రంగంలో అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. 

ఆరోపణ: తెలంగాణలో వ్యూహాత్మత అడుగులు.. ఏపీలో తడబాటు
వాస్తవం:  పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో మన రాష్ట్రంలో దాదాపు 9 వేల మెగావాట్ల  విద్యుత్‌ కేంద్రాలు స్థాపించారు. కృష్ణపట్నంలో 2400 మెగావాట్ల  ధర్మల్‌ కేంద్రం, విజయవాడలో 800 మెగావాట్ల కేంద్రం అందుబాటులోకి వచ్చాయి. పోలవరంలో  960 మెగావాట్ల  జల విద్యుత్‌ కేంద్రం కూడా శరవేగంగా నిర్మాణమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో  సింగరేణి గనుల ద్వారా అక్కడి ధర్మల్‌  కేంద్రాలకు కావలసినంత  బొగ్గు దొరుకుతోంది.

మనం సుదూర ప్రాంతాల నుంచి, అంటే మహానది  బొగ్గు క్షేత్రాలు– తాల్చేర్‌ ఒరిస్సా, సింగరేణి బొగ్గు  గనుల నుంచి  సేకరించవలసి వస్తోంది. మన రాష్ట్ర  విద్యుత్‌ సంస్థలు కూడా వేరే రాష్ట్రాలలోని  విద్యుత్‌ సంస్థలతో ముందస్తుగా  విద్యుత్‌ బ్యాంకింగ్‌  విధానం.. అంటే  మనకు అవసరం వున్నప్పుడు  వాళ్ళు  విద్యుత్‌ ఇచ్చేలా, మనకు మిగులు వున్నప్పుడు  వారికీ తిరిగి విద్యుత్‌ అందించేలా ఒప్పందాలు  చేసుకుంటున్నాయి. దీనికి  విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతి కూడా  ఇస్తోంది.  
                                  
ఆరోపణ: ఎక్స్చేంజీల పైనే ఏపీ ఆధారం
వాస్తవం: ప్రస్తుత  ఆర్ధిక  సంవత్సరంలో  విద్యుత్‌ ఎక్సే్చంజీలపై  ఆధారపడకుండా  ముందుగానే  సెప్టెంబర్‌ నెలలో తగిన ప్రణాళికతో చర్యలు తీసుకుని  జూన్‌  నెల వరకు పోటీ  బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా  అత్యంత  పారదర్శకంగా  విద్యుత్‌ అమ్మకందార్లను ఎంచుకుని ద్వైపాక్షిక  ఒప్పందాలు  కుదుర్చుకున్నాయి. దానివల్ల  ప్రస్తుత నెలలో  ఏ విధమైన అంతరాయాలు  లేకుండా  విద్యుత్‌ సరఫరా అవుతోంది. 

ఆరోపణ:  రాత్రిపూట రైతులు పొలంబాట పడుతున్నారు
వాస్తవం: రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. నిజానికి ఇది గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు విద్యుత్‌ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్‌ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా  రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.  వ్యవసాయ విద్యుత్‌ సరఫరా కోసం ఒక ప్రత్యేక  సంస్థను కూడా ఏర్పాటు చేశారు.

ఆరోపణ: అక్కడ విద్యుత్‌ ప్లాంట్లకు ప్రణాళిక..ఇక్కడ ఆపసోపాలు
వాస్తవం:  కేవలం ఏడాది వ్యవధిలో కృష్ణ­పట్నంలో 800 మెగావాట్ల మూడో యూనిట్, డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్‌ను ఏపీ అందుబాటులోకి తెచ్చింది. 2019 నాటికి కృష్ణపట్నంలో 60  శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. డాక్టర్‌ ఎన్టీటీపీఎస్‌లో ఎనిమిదో యూనిట్‌ నిర్మాణ పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఏపీజెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.

లోయర్‌ సీలేరులో మరో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణ పనులను ఏపీజెన్‌కో శరవేగంగా జరిపిస్తోంది. పీక్‌ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజి ప్లాంటు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకుని ముందుకెళుతోంది.

పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజి ప్లాంట్లు నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement