ఇంటింటికీ రక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష | ap govt is also paying transportation expenses at rate of Rs 500 per person | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ రక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష

Published Tue, Mar 5 2024 6:07 AM | Last Updated on Tue, Mar 5 2024 6:09 AM

ap govt is also paying transportation expenses at rate of Rs 500 per person - Sakshi

తొలి దశలో 86,713 మందికి చికిత్సలు అవసరమని గుర్తింపు 

ఇప్పటివరకు 84,982 మందికి చికిత్సలు, ఆపరేషన్లు పూర్తి 

ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తున్న ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యల్ని ప్రభుత్వం గుర్తించింది. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా చికిత్సలు చేయించి సాంత్వన చేకూరుస్తోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సురక్ష క్యాంపుల్లో గుర్తించి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్సలు చేయించడంతోపాటు బాధితులపై రవాణా ఖర్చుల భారం కూడా పడకుండా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. చికిత్సల అనంతరం కూడా బాధితులకు బాసటగా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాధితులను చేయిపట్టి సీఎం జగన్‌ ముందుకు నడిపిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తున్నారు.  

విజయవంతంగా 2.O
ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖ 6,710 శిబిరాలు నిర్వహించగా.. ఒక్కోచోట సగటున 359 చొప్పున 24,11,785 మంది వైద్య సేవలు పొందారు. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, హెచ్‌బీ, యూరిన్, మలేరియా, డెంగీ సహా ఇతర 32.64 లక్షల స్పాట్‌ టెస్ట్‌లను శిబిరాల వద్ద నిర్వహించారు. రెండో దశలో భాగంగా శిబిరాల వద్దకు వచ్చిన ప్రజల్లో 8,179 మందికి తదుపరి వైద్య సేవలు అవసరం ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించి ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు. వీరిలో ఇప్పటికే 2,030 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు అందుకున్నారు. ఇక 2.13 లక్షల మందికి కంటి స్క్రీనింగ్‌ చేపట్టగా.. 60 వేల మందికి మందులతో నయమయ్యే సమస్యలను గుర్తించి అక్కడికక్కడే మందులు అందించారు. మరో 1.50 లక్షల మందికి అద్దాలను, 2,090 మందికి కేటరాక్ట్‌ సర్జరీలను సూచించారు.  

98 శాతం మందికి చికిత్సలు పూర్తి 
గత ఏడాది ఆరోగ్య సురక్ష తొలి దశ కార్యక్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా శిబిరాలు నిర్వహించింది. వీటిలో 60.27 లక్షల మంది అవుట్‌ పేషెంట్‌ సేవలు పొందారు. వీరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని వైద్యులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు. వారందరికీ చికిత్సలు చేయించేలా వైద్య శాఖ పర్యవేక్షించింది. వీరిలో ఇప్పటివరకూ 98 శాతం అంటే.. 84,982 మందికి ప్రభుత్వమే చికిత్సలు చేయించింది.

చిన్న పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంటేషన్, పుట్టుకతో గుండెలో రంధ్రాలు, ఇతర సమస్యలతోపాటు, పెద్దల్లో న్యూరో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, వంటి ఇతర సమస్యలకు ఉచిత చికిత్సలు అందించారు. చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, పశి్చమ గోదావరి జిల్లాల్లో వంద శాతం మందికి చికిత్సలు చేయించారు. మొత్తం రోగుల్లో 1,731 మందికి చికిత్సలు అందించేలా వైద్య శాఖ పర్యవేక్షిస్తోంది. కాగా.. తొలి దశలో కంటి సమస్యలతో బాధపడుతున్న 80,155 మందికి కేటరాక్ట్‌ సర్జరీలు అవసరమని వైద్యులు సూచించగా.. 41633 మందికి ఇప్పటికే సర్జరీలు పూర్తి అయ్యాయి. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించగా.. 5.63 లక్షల మందికి పంపిణీ పూర్తయింది.

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామానికి చెందిన రైతు అనిల్‌ దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమార్తె మధుప్రియ గ్రహణం మొర్రితో పుట్టడంతో వెంటనే తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో మధుప్రియ గుండెకు రంధ్రం కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది. పాప పెద్దయ్యాక గానీ ఆపరేషన్‌ చేయడానికి వీలుండదని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం మధుప్రియకు మూడేళ్లు నిండాయి. పాప గుండెకు ఆపరేషన్‌ చేయించాలనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం మొదలు పెట్టింది. 

ఇందులో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి సర్వేలో మధుప్రియ సమస్యను తల్లిదండ్రులు తెలియజేశారు. దీంతో వైద్య శిబిరానికి హాజరవ్వమని చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకు వెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడి నుంచి మధుప్రియను తిరుపతిలోని చిన్న పిల్లల హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్‌ పూర్తయింది. బాలిక పూర్తిగా కోలుకుంది. మధుప్రియ తరహాలోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఆరోగ్య సురక్ష వరంగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement