TTD: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం The annual Jyestabhishekam will be observed from June 19 to 21 in Tirumala temple | Sakshi
Sakshi News home page

TTD: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

Published Wed, Jun 19 2024 8:10 AM | Last Updated on Wed, Jun 19 2024 8:13 AM

The annual Jyestabhishekam will be observed from June 19 to 21 in Tirumala temple

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20   గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 75,125 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.

31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.41  కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది.

అభిషేకాలు, పంచామృత స్న‌ప‌న‌ తిరుమంజ‌నాల కార‌ణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ‌ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తులు అరిగిపోకుండా జాగ్రత్త‌లు తీసుకునేందుకు వైఖాన‌సాగ‌మోక్తంగా నిర్వ‌హించే ఉత్స‌వ‌మే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్స‌వం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గ‌ల‌ కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని ‘అభిధేయ‌క అభిషేకం’ అని కూడా అంటారు.

మొదటిరోజు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మ‌వార్ల‌కు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.

రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు.

జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement