-
మిస్ పర్ఫెక్ట్
లవ్లీ ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఒక పెద్ద పని. పాశ్చాత్యుల్లో ప్రపోజ్ చేయడం ఎంత వెరైటీగా ఉంటే అమ్మాయి అంత మెచ్చుకుంటుంది. అందుకే అమెరికాలోని కెంటకీకి చెందిన విలియమ్స్ జీజే జెరార్డ్ తన గర్ల్ ఫ్రెండ్ జెనా ఎలాంగ్‌కు వినూత్నంగా పెళ్లి ప్రతిపాదన ఎలా చేయాలని తెగ ఆరాటపడ్డాడు. ‘లవ్ యాక్చువల్లీ’ అనే హాలీవుడ్ సినిమాలోని ఒక సీన్లో హీరోయిన్‌కి యూనివర్సిటీలోని బ్రాస్ బాండ్‌తో స్వాగతం పలికి, వేలాది మంది క్లాప్స్ కొడుతుండగా, తన ప్రేమ సందేశాలను ఒక్కొక్కటిగా ప్లకార్డుల రూపంలో చూపిస్తాడు హీరో. ఆమె దానికి ఇంప్రెస్ అయి ఫ్లాటైపోతుంది. మన విలియం జెరార్డ్ కూడా కెంటకీ విశ్వవిద్యాలయం స్టూడెంట్లతో అదే సీన్ రిపీట్ చేశాడు. జెనా అనే తన గర్ల్ ఫ్రెండ్‌కు ఇలాగే స్వాగతం పలికి, మ్యూజిక్ మోగించి, ప్లకార్డు సందేశాలు చూపించాడు. చివరి ప్లకార్డు ‘యూ ఆర్ పర్ ఫెక్ట్ ఫర్ మీ’. అప్పటివరకు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయిన జెనా ఒక్కసారిగా ముందుకు వచ్చి విలియమ్స్ పెళ్లి ప్రతిపాదన అంగీకరిస్తూ నుదిటిపై ముద్దు పెట్టుకుంది. (అచ్చు ‘లవ్ యాక్చువల్లీ’ సినిమాలో లాగానే). -
ఒక ప్రేమలేఖ... ఓ గులాబీ పువ్వు!
అమ్మాయికైనా అబ్బాయికైనా తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే, ‘ఐ లవ్ యు’ అని మొదట ప్రపోజ్ చేసిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోలేరు. నయనతారకు అలా జీవితాంతం గుర్తుండిపోయే అబ్బాయి ఒకడు ఉన్నాడు. ఈ బ్యూటీ కో-ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుకున్నారు. అందుకని అబ్బాయిలందరితో స్నేహంగా ఉండేవారు. ఆ విషయం నయనతార చెబుతూ - ‘‘అమ్మాయిలతో ఎలా స్నేహంగా ఉండేదాన్నో అబ్బాయిలతో కూడా అలానే ఉండేదాన్ని. ఒకే ఒక్క అబ్బాయి తప్ప మిగతావాళ్లందరూ నాతో అలానే ఉండేవాళ్లు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. నేను క్లాస్ గదిలోకి వచ్చేసరికే నా డెస్క్ కింద ఒక ప్రేమలేఖ, ఓ గులాబీ పువ్వు ఉండేవి. ఆ లేఖలో సంతకం ఉండేది కాదు. దాంతో ఎవరు రాశారో తెలియక తికమకపడేదాన్ని. చాలా భయం వేసేది. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్‌కి ఈ విషయం చెప్పాను. రోజుల తరబడి లవ్ లెటర్, పువ్వు దర్శనిమవ్వడంతో మా అమ్మకు చెప్పాను. స్కూల్‌కి వచ్చి మా అమ్మ కంప్లైంట్ చేశాక ఆ అబ్బాయి ఎవరో తెలిసింది. అతను ఏడో తరగతి అబ్బాయి. ప్రిన్సిపాల్ మేడమ్ పిలిచి, బాగా చీవాట్లు పెట్టారు. అసలా వయసు అబ్బాయికి ప్రేమ అంటే ఏంటో ఏం తెలుస్తుంది? ఆ విషయం ఇప్పుడు తల్చుకున్నా నాకు వింతగా ఉంటుంది’’ అని తెలిపారు. -
మా రాంబాబు గాడి ‘భశుం’ కాపురం!
నవ్వింత మా రాంబాబుగాడికి కాస్త స్టైల్‌గా, హీరోలా, షాన్ ఔర్ షౌకత్‌తో జీవించాలని కోరిక. అదేం చిత్రమోగానీ... వాడేదైనా సినిమాటిగ్గా చేయబోతే చాలు... అది డ్రమటిగ్గా ఫెయిలవుతుంటుంది. బాపూగారి ఫేమస్ కార్టూన్ ఒకటుంది. ‘భశుం’ కార్డ్ పడ్డ తర్వాత ‘ఇంత అవక తవక కంగాళీ చిత్రం చూళ్లేదండీ’ అనుకుంటూ ప్రేక్షకులు హాల్లోంచి బయటకొస్తూ ఉంటారు. ఆ ‘భశుం’ కార్డు పడటానికి ముందు జరిగిందంతా మా రాంబాబుగాడి సినిమాయేనని వాడి అనుమానం. భావుకుల భాషలో చెప్పాలంటే... ఒక ఆహ్లాద భానూదయ తొలికాంతుల వేళ. చలిగిలిగింతలు పెట్టే లేత పవనాల హేల. ధారగా కురుస్తున్న తుషారబిందువుల మాల! అయితే... మా రాంబాబుగాడి భాషలో క్రూడ్‌గా చెప్పాలంటే మంచు కురుస్తూ, చలి గజ్జున వణికిస్తున్న సమయంలో ఆ మంచుగాల్లో లారీల పొగ కాలుష్యం కాస్తా కాక్‌టెయిల్‌లా కలసిన టైము. నెత్తి మీద ముసుగేసుకున్నట్లుగా ఉండే ట్రాక్ సూట్‌తో (పై ముసుగును హుడ్ అంటారట) సినిమా హీరోలా జాగింగ్‌కు బయల్దేరాడు మన రాంబాబు. తల చుట్టూ ఉన్న హుడ్డులోని గుడ్లు తేలేశాడు. ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అలర్జీతో ఆయాసంలో మునిగి ఆసుపత్రిలో తేలాడు. ప్రతివాడూ ప్రత్యూష పవనాలు బాగుంటాయంటాడు. కానీ ఇదేంట్రా... మనకు ఆ అందాలేమీ కనపడలేదు సరికదా... అనారోగ్యం మిగిలి, మందులు మింగాల్సి వచ్చింది అంటూ బాధపడ్డాడు. వాడి జాతకమే అంత. పరుగులోనే కాదు... పాణిగ్రహణంలోనూ అదే జరిగింది. పేరులోనే ‘గ్రహణం’ అనే మాట ఉన్న తర్వాత అలా జరగకుండా ఎలా ఉంటుంది? అందునా రాంబాబుకీ?! ఈ లోకంలో ఎవడైనా సరే... తన ప్రియురాలిని ప్రేమిస్తే... అదృష్టవంతుడైతే ఓకే అంటుంది. కాకపోతే కుదర్దు అనేస్తుంది. అదేమిటోగానీ... మన రాంబాబుగాడు ఎలాంటి ప్రపోజలూ పంపకముందే ఓ అమ్మాయి అతడి దగ్గరకు వచ్చి... ‘‘సారీ రాంబాబూ... కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను నిన్ను ప్రేమించడం కుదర్దు. నా అశక్తతకు నన్ను మన్నించు’’ అనేసింది. అప్పట్నుంచి మనవాడికి అమ్మాయిలంటే చెడ్డ మంట. నేను ప్రపోజ్ చేస్తే నువ్వీమాట అనడం ఓ పద్ధతి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఇదేమిటంటూ మండిపడ్డాడు మనవాడు. ఇది జరిగాక ఓ ముగ్గురు నలుగురు అమ్మాయిలు మనవాడికి తమ ప్రేమ ప్రపోజల్స్ పంపారు. కానీ అమ్మాయిలంటే ఉన్న మంట కొద్దీ మనవాడు వాళ్లందర్నీ కసికసిగా రిజెక్ట్ చేసేశాడు. ఈ లోపుగా మరో అమ్మాయి (ఈమె ఐదోది) నుంచి కూడా లవ్ ప్రపోజల్ వచ్చింది. అదేం మూడ్‌లో ఉన్నాడోగానీ... ఈసారి ఓకే చెప్పాడు. మనవాడు ఓకే చెప్పినప్పట్నుంచీ ఆ అమ్మాయి అన్యమనస్కంగా మారిపోయింది. చిరాకూ పరాకులతో చిర్రుబుర్రులాడింది. ఈ అల్లకల్లోలాల మధ్యనే వాళ్ల పెళ్లయిపోయింది. పెళ్లయితే అయ్యింది గానీ... దంపతుల మధ్య రోజూ గిల్లికజ్జాలే. ఏదో ఒక విషయంపై అగ్గిఫైరింగులే. ప్రేమపెళ్లే కదా ఇలా ఎందుకు జరుగుతోందని బంధువర్గమంతా ఆశ్చర్యపడ్డారు. ఎట్టకేలకు చాలా అనునయించి విషయం రాబట్టాడు మన రాంబాబు. సదరు ప్రేమిక చెప్పిన జవాబేమిటంటే... ‘‘ఆ రోజుల్లో మీరు రిజెక్ట్ చేసిన నలుగురు అమ్మాయిలకూ మంచి సంబంధాలు వచ్చాయి. ఒకరికి ఐఏఎస్ సెలక్టయినవాడితో పెళ్లి కాగా... మరొక అమ్మాయికి ఫారిన్ సంబంధం కుదిరింది. ఇంకో అమ్మాయికి ఐఆర్ఎస్తో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో రాష్ట్రస్థాయి అధికారి! దాంతో మన వీధిలోని అమ్మాయిల్లో ఒక రూమర్ పాకింది. మీకు ప్రపోజ్ చేసి, మీతో రిజెక్ట్ చేయించుకుంటే చాలు... ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుందనే గుసగుసలు బయల్దేరాయి. ఈ సెంటిమెంట్ టాక్‌తో నేనూ ప్రభావితమై... ఎలాగూ రిజెక్ట్ చేయకపోతారా అని మీకు ప్రపోజ్ చేశాను. మీరు అవునన్నారు కాబట్టి నేను కాదనలేను. నేనే ప్రపోజ్ చేసినా, మీ మీద మనసు లేదు కాబట్టి అవుననలేను. అందుకే మన కాపురం ఇలా ఏడ్చింది’’ అంటూ విషయం బయట పెట్టింది. ఎంత సినిమాటిగ్గా జీవించాలనుకుంటాడో అంత డ్రమటిగ్గా మారిపోవడం వాడి జీవిత ప్రత్యేకత. ఈలోపు రాంబాబు గాడికీ కాస్త గౌరవప్రదమైన ఉద్యోగమే వచ్చి, దాంట్లో చేరిపోయాడు. అది జరిగాక కాస్త కౌన్సెలింగ్ ఇవ్వడంలో దిట్టలైన కొందరు మహిళామణులు బయల్దేరి... ‘రాంబాబు గాడికి ప్రపోజ్ చేస్తే, మంచి సంబంధం కుదురుతుందనే సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. నీ అదృష్టం బాగుంది కాబట్టే వాడికి మంచి జాబ్ వచ్చింది. లేదంటే వాడిలాంటి రెటమతం గాడికి అలాంటి ఉద్యోగమా?’’ అంటూ వాడి భార్యామణిని అందరూ సమాధానపరచారు. దాంతో తన రాతా బాగుండబట్టే రాంబాబుకు జాబు దక్కిందనీ, దాంతో తన అదృష్టమూ చక్కబడిందనే తృప్తితో కలహం సద్దుమణిగించి, కాపురం మొదలుపెట్టింది వాడి సతీమణి. ఇవన్నీ వాడికీ తెలుసుకాబట్టే... ఎప్పుడైనా పెళ్లాంతో కాస్త గొడవ మొదలవ్వగానే... ‘భశుం’ అంటూ బయటికి జారిపోయి, సద్దుమణిగాక ఇంట్లోకి దూరిపోయి... ఇలా ఇంట్లోకీ, బయటకీ షటిల్ సర్వీసు చేస్తుంటాడు. - యాసీన్ -
ఆ బాధ నన్నెప్పటికీ వదలదేమో!
అవి నేను జూనియర్ కాలేజీలో చదివే రోజులు... నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే రెండో సంవత్సరం చదువుతోన్న ఓ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే చెప్పేద్దామనుకునేంతలో నా స్నేహితురాలు సంధ్య నా దగ్గరకు వచ్చింది. నన్ను ఇష్టపడుతోన్న అబ్బాయికి సంధ్య చుట్టం. అందుకే తన దగ్గర నేను ఆ అబ్బాయి గురించి మాట్లాడేదాన్ని కాదు. కానీ ఆ రోజు తనే నా దగ్గర తన గురించి ప్రస్తావించింది. ‘తను నీకు ప్రపోజ్ చేసిన విషయం నాకు తెలుసు, కానీ ఒప్పుకోవద్దు, తనకు చిన్నప్పుడే పెళ్లయిపోయింది’ అని చెప్పింది. నేను షాకైపోయాను. అలా ఎలా జరిగిందని ప్రశ్నించాను. చిన్నప్పుడే కొన్ని పరిస్థితుల్లో ఆ అబ్బాయికి తన మరదలితో పెళ్లి జరిగిందట. పిల్లలు పెద్దయ్యేవరకూ కావాలని దూరంగా పెట్టారట పెద్దలు... అంటూ జరిగినదంతా చెప్పింది సంధ్య. నాకు మతి పోయింది... విషయం తెలిశాక కూడా అడుగు వేయడం తప్పు కాబట్టి నా మనసులో నుంచి వెంటనే ఆ ఆలోచన తీసేశాను. ఆ రోజు నుంచీ అతడి వైపు చూసేదాన్ని కాదు. అతడు మాట్లాడాలని ప్రయత్నించినా స్పందించేదాన్నీ కాదు. అది తెలిసీ తెలియని వయసు కావడం వల్ల తనని త్వరగానే మర్చిపోయాను. కానీ తను మాత్రం నన్ను మర్చిపోలేదు. దాదాపు నా డిగ్రీ పూర్తయ్యేవరకూ కూడా నా వెంట పడుతూనే ఉండేవాడు. నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉండేవాడు. కానీ ఏ ఒక్కరోజూ నేను తనకి అవకాశం ఇవ్వలేదు. డిగ్రీ పూర్తవ్వగానే నాన్నగారు చూసిన వ్యక్తితో తాళి కట్టించుకుని, కాపురానికి వెళ్లిపోయాను. ఆ తర్వాత రెండు నెలలకు సంధ్య నుంచి ఫోన్ వచ్చింది. నా గొంతు వినగానే చాలాసేపు ఏడుస్తూనే ఉంది. తర్వాత చెప్పింది... ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని. నివ్వెరపోయాను. నేనేదో అనబోతుండగా ‘క్షమించు రాధా... ఇదంతా నావల్లే జరిగింది’ అంది సంధ్య. అలా ఎందుకందో తెలిశాక నేను మామూలుగా షాకవ్వలేదు. ఆ అబ్బాయికి చిన్నప్పుడు పెళ్లి కాలేదట. అదంతా అబద్ధమట. తనకు అతనంటే ఇష్టమట. అతనికి నేనంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరినీ కలవనివ్వకుండా చేసేందుకే అలా చేశానని చెప్పింది. మౌనంగా ఫోన్ పెట్టేశాను. అపరాధభావం దహించివేసింది. సంధ్య చెప్పిన ఒక్క మాటతో అతన్ని దూరంగా నెట్టేశాను. ఒక్కసారైనా అతడికి మాట్లాడే అవకాశం ఇచ్చివుంటే బాగుండేది. నా మౌనం అతడి మనసును కాల్చేసి ఉంటుంది. నా పెళ్లి అతడి మనసును ముక్కలు చేసుంటుంది. అందుకే ప్రాణాలు తీసుకున్నాడు. పాతికేళ్లు గడచిపోయినా ఈ విషయం నన్ను వేధిస్తూనే ఉంటుంది. అతను నాకు ప్రపోజ్ చేయడం, సంధ్య నాకు ఫోన్ చేయడం గుర్తుకొస్తూ, నన్ను అశాంతికి గురి చేస్తుంటాయి. - లక్ష్మీకళ్యాణి, నూజివీడు -
ప్రపోజ్ చేయాలంటే ప్రిపేర్ కావాలి!
ఒక అమ్మాయిని మెప్పించడమంటే పదిమంది బాసులను మెప్పించడంతో సమానం. చక్కగా పనిచేసి, బుద్ధిగా మాట వింటే బాస్‌కు చాలు. కానీ అమ్మాయికి అలాకాదు, అబ్బాయి అష్టవిధ అవతారాలు ఎత్తాలి, నవరసాలు పోషించాలి, లాలించాలి, పాలించాలి, మెప్పించాలి... ఆ తర్వాత గాని ఏదీ ఒప్పుకోరు. ప్రేమలో పడిన యువకుల ప్రేమకథకు... ప్రపోజ్ చేసే సీన్ ఇంటర్వెల్ వంటిది. అంటే ఒకమ్మాయిని పడేయడం అన్నది తర్వాత అసలు ప్రపోజ్ చేయడానికి ప్రిపేర్ కావాలంటేనే అంత సమయం పడుతుంది. దానికి ఎంత ప్రిపరేషన్ ఉండాలి, ఎంత సృజనాత్మకత ఉండాలి... ఎంత సౌమ్యత ఉండాలి. ఇవన్నీ ఒక్క ప్రేమలో పడినోడికే సాధ్యం. అవేవీ మిస్ కాకుండా, ప్రేయసి హర్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మీరు ప్రపోజ్ చేస్తున్న విషయం ఆమెకు ఇష్టం లేని వారికి తెలియకూడదు. అమ్మాయికి అది అందరికీ తెలియడం ఇష్టం ఉందు. ఒకే మనిషి ఎపుడూ ఒకేలా ఉండరు. ఆ రోజు కాస్త ఖర్చయినా పర్లేదు... జుట్టు నుంచి షూ దాకా ఎక్కడా రాజీ పడకుండా ఒంటిని బ్రాండ్లతో నింపేయండి. మరీ అతి కాకుండా సింపుల్‌గా, సూపర్‌గా ఉండేలా చూసుకోండి. దీనికి ఇంటర్నెట్ హెల్ప్ తీసుకోండి. {పపోజ్ చేయడానికి పిక్నిక్ స్పాట్, సముద్ర తీరం, ఇతరుల డిస్టర్బెన్స్ లేని విశాలమైన, కాస్త ఖరీదైన హాయిగొలిపే రెస్టారెంట్, మల్టీ నేషనల్ కేఫ్ (ఇది ఉదయం పూటే) మంచి ప్రదేశాలు. మీ ప్రేమ ప్రతిపాదనకు స్పందన మరోలా ఉన్నా ఇద్దరూ అల్లరి కాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాలు మంచివి. ఇరుకైన వాటికి వెళ్లకండి. ముద్దుగా ఉండి, కొంచెం ఖరీదైన బహుమతి తీసుకెళ్లండి. అంగీకరిస్తే ప్రేమను అంగీకరించినందుకు ఇవ్వండి, అంగీకరించకపోతే మిమ్మల్ని గాయపరిచినందుకు ఈ బహుమతితో క్షమాపణ చెప్పండి. ఇది పునరాలోచన చేసేలే చేయొచ్చు కదా. బహుమతి జేబులో పెట్టుకుని వెళ్లేంత చిన్న సైజులో ఉంటే బెటర్. ఆ రోజు మాట్లాడే విషయాలు మాత్రం ఎంతో ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్లా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు ప్రపోజ్ చేసే సమయానికి మీరు ఆమెను ఇష్టపడుతున్నట్లు ఆమెకు తెలిసి ఉండాలి. అయితే, అది ప్రేమా, క్రేజా అన్న స్పష్టత ఉండక్కర్లేదు.