-
పేగుల్లోని బ్యాక్టీరియాతో మధుమేహ నియంత్రణ
పేగుల్లోని బ్యాక్టీరియాపై శాస్త్రవేత్తల దృష్టి ఎక్కువవుతున్న కొద్దీ.. వీటి ద్వారా మనకు కలుగుతున్న ప్రయోజనాల చిట్టా పెరిగిపోతోంది. తాజాగా కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు కొందరు పేగుల్లోని బ్యాక్టీరియా.. రక్తంలోని గ్లూకోజ్ మోతాదును నియంత్రిస్తున్నట్లు పరిశోధన పూర్వకంగా గుర్తించారు. పేగుల్లో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బ్యాక్టీరియా మనకు మేలు చేస్తున్నట్లు వెల్లడించారు. సంతోషంగా ఉండే ఫీలింగ్ ఇచ్చే సెరటోనిన్ జీవక్రియల్లోనూ కీలకపాత్ర పోషిస్తుంటుంది. శరీరంలో ఉత్పత్తయ్యే మొత్తం సెరటోనిన్‌లో 90 శాతం పేగుల్లోనే ఉండటం గమనార్హం. ఊబకాయుల రక్తంలో సెరటోనిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. పేగుల్లో దీని ఉత్పత్తిని బ్యాక్టీరియా నియంత్రిస్తుందన్న అంచనాతో జంతువులపై పరిశోధనలు మొదలుపెట్టారు. బ్యాక్టీరియా వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే సెరటోనిన్ ఉత్పత్తిలోనూ మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్పులు రక్తంలో గ్లూకోజ్ నిర్వహణపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. రక్తం, పేగుల్లో సెరటోనిన్ ఎంత ఎక్కువగా ఉంటే.. గ్లూకోజ్ నిర్వహణ అంత అధ్వానంగా ఉన్నట్లు స్పష్టమైంది. వెంట్రుకలకు కరెంట్ షాక్ వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇబ్బంది పడుతున్న వారందరికీ ఓ శుభవార్త. వెంట్రుకలు వేగంగా పెరిగేందుకు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నయంత్రాన్ని తయారు చేశారు. స్వల్పస్థాయి కరెంటు షాక్‌లు ఇవ్వడం (దీన్నే ఎలక్ట్రోట్రైకోజెనిసిస్ అంటారు) ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందుకు అవసరమైన యంత్రాలు భారీ సైజులో ఉంటాయి. విద్యుత్ అవసరాలూ ఎక్కువే. ఇప్పుడా యంత్రాన్ని ఓ టోపీలో ఇమిడ్చేయడం ఈ కొత్త పరికరం విశేషం. అంతేకాదు.. శరీర కదలికలను విద్యుత్‌గా మార్చుకోగలగడం ఇంకో ముఖ్యమైన విషయం. శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రేరేపించేందుకు కరెంటు షాకులు ఉపయోగపడతాయి. అయితే ఇందుకు తగ్గ పరికరాలు మాత్రం అందుబాటులో లేవని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త షుడాంగ్ వాంగ్ తెలిపారు. వెంట్రుకల తయారీ పరికరం తనంతటతానే సూక్ష్మస్థాయి విద్యుత్‌ను తయారు చేసుకుంటుందని వివరించారు. ఇప్పటికే బట్టతల వచ్చిన వారికి ఈ యంత్రం పెద్దగా ఉపయోగపడకపోవచ్చనేది శాస్త్రవేత్తల మాట.! పరిశోధన వివరాలు ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
హెల్మెట్‌తో వెంట్రుకలు రాలుతాయా?
వాహనం నడిపే సమయంలో నేను ఎప్పుడూ హెల్మెట్ వాడుతుంటాను. అయితే ఇటీవలే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. కాస్త బట్టతలలా ఉంది. ఇలా నా వెంట్రుకలు రాలడానికి హెల్మెటే కారణమా? దీనికి చికిత్స సూచించగలరు. – ఎన్. ఆదిత్య, నెల్లూరు మీరు చెబుతున్నట్లుగా హెల్మెట్ వాడటానికీ జట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. పైగా హెల్మెట్ వల్ల తలకు, జుట్టుకు రక్షణ కలుగుతుంది. మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు బయోటిన్ ఫెనస్టెరైడ్, మినాక్సిడిల్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి. అరచేతుల్లో చెమటలు... పరిష్కారం చెప్పండి నా వయసు 25. నా సమస్య ఏమిటంటే... నా అరచేతులు, అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పడుతున్నాయి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఏదైనా రాసుకునే సమయంలో, ఎవరైనా చూస్తుంటే ఈ సమస్య మరీ ఎక్కువైపోయి నా చేతులు, కాళ్లు తడిసిపోతున్నాయి. ఫ్రెండ్స్‌తో కూడా సరిగా కలవలేకపోతున్నాను. చాలా ఇబ్బందిపడుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – శ్రీనివాస చక్రవర్తి, చిత్తూరు మీరు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో పామోప్లాంటార్ హైపర్ హిడరోసిస్ అంటారు. ఇది ఒక నరాలకు సంబంధించిన సమస్య. యాంగై్జటీ వల్ల మీకు ఈ సమస్య వస్తోంది. యాంగై్జటీ పెరిగినప్పుడు చెమట పట్టే ప్రక్రియ పెరుగుతుంది. దీనికి చికిత్స ఇలా... 1. బోట్యులినమ్ టాక్సైడ్ అనే ఇంజెక్షన్ ద్వారా దీన్ని కొద్దిమేరకు శాశ్వతంగా (సెమీ పర్మనెంట్)గా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియను ఇటీవల విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఈ ప్రక్రియ అనుసరించాక 4–6 నెలల్లో చెమటలు పట్టడం అదుపులోకి వస్తుంది. 2. దీనికి ఐయన్టోఫొరెసిస్ వంటి మరికొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవంత మంచి ఫలితాలు ఇవ్వవు. మీరు ఒకసారి అనుభవజ్ఞులైన డర్మటాలజిస్ట్‌ను కలవండి. ఈ ఎరుపు, నలుపు రంగు మచ్చలు తగ్గేదెలా? నా వయసు 48 ఏళ్లు. నా తొడలపై ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. చెమటలు పట్టినప్పుడు వాటిలో చాలా దురద ఉంటుంది. అవి క్రమంగా సైజు పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. నేనెన్నో మందులు వాడాను. కానీ ప్రయోజనం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మురళి, కొత్తగూడెం మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్–100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 2–3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. మంచి స్కిన్ వైటెనింగ్ క్రీమ్స్ సూచించండి నేను ఈ మధ్య ముఖం తెల్లబడటానికి ఒక బ్రాండ్‌కు చెందిన స్కిన్ వైటెనింగ్ క్రీమ్ ఉపయోగిస్తున్నాను. ముఖంలో మార్పు వచ్చింది కానీ... ముఖంపై మొటిమలతో నల్లమచ్చలు వస్తున్నాయి. ఇలా ఈ క్రీమ్ వాడటం మంచిదేనా? తెల్లబడటానికి సైడ్ ఎఫెక్ట్స్‌లేని మంచి క్రీమ్స్ ఏవైనా ఉంటే చెప్పగలరు. – తేజ, విజయవాడ మీ ముఖం రంగు తెల్లబడటానికి మీరు వాడిన కాంబినేషన్లో బహుశా మాడిఫైడ్ క్లిగ్‌మెన్స్ రెజిమెన్ ఉండి ఉండవచ్చు. అందులో కార్టికోస్టెరాయిడ్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఆ క్రీమ్‌ను కొన్ని వారాలపాటు వాడినప్పుడు అది మొటిమలు వచ్చేందుకు దోహదం చేసి ఉంటుంది. దీన్ని ‘స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ ఆక్నే’ అంటారు. ఇది ముఖంపై అంతటా వ్యాపించి బ్లీచ్ చేసిన గుర్తులను ముఖంపై వచ్చేలా చేస్తుంది. కాబట్టి మీరు ఈ క్రీమ్‌ను వాడటం మానేయండి. దీనికి బదులు మీరు ఆర్బ్యుటిన్, లికోరెస్ లేదా కోజిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడండి. అవి నల్లమచ్చలను తొలగిస్తాయి. ఇక మీ మొటిమలు తగ్గడానికి రాత్రివేళల్లో క్లిండమైసిన్, అడాపలీన్ కాంబినేషన్ ఉన్న క్రీమ్‌ను రాసుకోండి. దాంతో మీ సమస్య తగ్గుతుంది. చుండ్రు సమస్య బాధిస్తోంది... ఏం చేయాలి? నా వయసు 27 ఏళ్లు. చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. ప్రతి వారం రెండుసార్లు తలస్నానం చేస్తాను. ఈ సమస్య తగ్గడానికి వారానికి మూడు సార్లు గానీ, రోజు విడిచి రోజుగానీ తలస్నానం చేస్తే జుట్టుకు ఏదైనా హాని జరుగుతుందా? దయచేసి వివరించండి. – సాయిప్రసన్న, నిజామాబాద్ మీరు వివరించిన అంశాలను బట్టి మీరు మాడు మీద సబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ మాడు మీద ఉండే సీబమ్ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల మీరు పేర్కొంటున్న సమస్య వస్తుంది. మీరు జడ్‌పీటీఓ, కెటాకోనజాల్ ఉండే షాంపూను వాడండి. మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు. ఇక నోటి ద్వారా తీసుకోవాల్సిన ఐటాకొనజోల్ టాబ్లెట్లను ఉదయం రెండు, రాత్రి రెండు చొప్పున రెండు రోజుల పాటు వాడాలి. ఈ మోతాదును స్టాట్ డోసిండ్ అంటారు. అంటే ఇది మీ సమస్యకు తక్షణం పనిచేసే మోతాదు అన్నమాట. అప్పటికీ సమస్య తగ్గకపోతే నోటి ద్వారా తీసుకునే ఐసోట్రెటినాయిన్ అనే మందును వాడవచ్చు. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ ఈమధ్యే నేను వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కదా. వ్యాయామం ఆపేయాలా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - నవీన్ కుమార్, పిడుగురాళ్ల వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలు నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించండి బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. -డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నేను ఈమధ్య టీఎస్‌హెచ్ పరీక్ష చేయించుకున్నాను. థైరాయిడ్ ఉందని అన్నారు. గత ఆర్నెల్లుగా నా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. ఇది హార్మోన్ లోపం వల్ల వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉందా? - అనిత, ఖమ్మం మన తలలో దాదాపు లక్షా ఇరవై వేల నుంచి లక్షా యాభై వేల వెంట్రుకలు ఉంటాయి. ఒక వెంట్రుక ఒక నెలలో దాదాపు ఒక సెంటీమీటరు పెరుగుతుంది. రోజూ 40 నుంచి 50 వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి. జుట్టు రాలడం సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. దానిలో హార్మోన్ లోపాలు, థైరాయిడ్ సమస్య, రక్తహీనత, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, ఆందోళన, నిద్రలేమి వంటివి దీనికి కొన్ని కారణాలు. కొన్ని రకాల మందులు వాడటం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం జట్టు రాలడానికి కారణమయ్యే ఇంకొన్ని అంశాలు. జుట్టు రాలడానికి ఇంకా సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, మోతాదుకు మించి క్లోరిన్ ఉండే ఈత కొలనుల్లో ఈతకొట్టడం వంటివీ కారణమవుతాయి. జుట్టుకు రంగు వేసుకునే విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి ఈ హెయిర్ డైలు సరిపడవు. వాటి నుంచి అలర్జీ వస్తుంది. అందుకే వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. డాండ్రఫ్ (చుండ్రు), ఎగ్జిమా, అలొపేషియా సమస్యలూ కారణమవుతాయి. జుట్టు సమస్యలు తీరాలంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఒంటిని సరైన గాడిలో పెట్టాలి. శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసం కూడా పెంపొందించుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందులో కేవలం జుట్టు రాలడం అనే అంశాన్నే కాకుండా దీనికి కారణాలైన థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఆర్నికా, జబొరాండి, వింకమైనర్తో తయారు చేసిన నూనెలు, మంచి షాంపూలు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. హోమియో ఔషధాలైన యాసిడ్ ఫ్లోర్, నేట్రమ్మూర్, ఫాస్ఫరస్, వింకామైనర్, ఆలోస్ లాంటి మందులు వాడితే సమస్య తగ్గుతుంది. అయితే ఆ మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. -డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ మా నాన్నను వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లు ఇక బతకరనీ బంధువులు అంటున్నారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - వీరభద్రరావు, చిట్యాల వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఇక బతకరనేది చాలామందిలో ఉండే అపోహ. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ మీద పెడతారు. దాంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెంటిలేటర్ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం, కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్ పాకే సెప్సిస్ వంటి కండిషన్లలో వెంటిలేటర్ పెడుతుంటారు. ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్ తీయడం కష్టం కావచ్చు. సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్‌ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. అయితే వైద్యపరమైన అంశాలలో మన దగ్గర తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. మీరు ఏదైనా సందేహం కలిగినప్పుడు నేరుగా మీకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సంప్రదించండి. అంతేగానీ ఎలాంటి అపోహలను నమ్మకండి. -డాక్టర్ ఎస్.ఎ. రఫీ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
జుట్టు రాలిపోతోంది, ఏమయినా చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35. నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ఈ మధ్య వెంట్రుకలు బాగా రాలిపోతుంటే డాక్టర్‌ను సంప్రదించాను. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. దీనికి హోమియోలో ఏమయినా చికిత్స ఉందా? - అనిల్‌కుమార్, హైదరాబాద్ జుట్టు రాలే సమస్యను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి స్త్రీలలో జుట్టు రాలడం, పురుషుల్లో జుట్టు రాలడం, పేను కొరకడం, జుట్టు మొత్తం ఊడిపోవడం. పురుషుల్లో జుట్టు రాలడం: కొందరు పురుషుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీనివల్ల ముఖం మీద, నుదురు భాగంలో ఉండే జుట్టు సరిహద్దు క్రమంగా పలచబడి వెనక్కు వెళుతుంది. వీరిలో ఏదో ఒక ప్రాంతంలో పూర్తిగా జుట్టు ఊడిపోయి, తిరిగి అభివృద్ధి చెందదు. దీన్ని బట్టతల అంటారు. ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. స్త్రీలలో జుట్టు రాలడం: స్త్రీలలో ముఖ్యంగా తలస్నానం చేసిన తర్వాత దువ్వుకొనేటప్పుడు ఎక్కువగా చిక్కుబడిపోయి జుట్టు ఊడుతుంది. స్త్రీలలో జుట్టు రాలడానికి హార్మోన్ సమస్యలు, థైరాయిడ్, నెలసరి సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన కారణం. పేనుకొరుకుడు: దీనిని అలోపేసియా అంటారు. కొందరిలో తలలో లేక మీసం, గడ్డంలో జుట్టు వృత్తాకారంలో ఊడిపోవడం జరుగుతుంది. దీనికి మానసిక ఒత్తిడి ఒక కారణమైతే శరీర రక్షణ వ్యవస్థ జుట్టు మీదకు దాడి చేసి కుదుళ్లను దెబ్బతీయడం మరోకారణం. జుట్టు మొత్తం ఊడిపోవడం: టోటల్ అలోపెసియస్: కొద్దిమందిలో తలపై ఉండే జుట్టు మొత్తం కనుబొమలు, కనురెప్పలతో సహా ఊడిపోవడం జరుగుతుంది. దీనికి మానసిక ఒత్తిడి, ఆటో ఇమ్యూనిజం కొంతవరకు కారణం కావచ్చు. కారణాలు: పోషకాహార లోపం, గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత, అధిక ఒత్తిడి, ఐరన్ లోపం, దీర్ఘకాలిక వ్యాధులు, స్త్రీలలో బిడ్డ పుట్టిన తర్వాత మూడు నెలలకు జుట్టు రాలడం ఎక్కువ కావచ్చు. కొన్ని రకాల మందుల ప్రభావం, ఇన్ఫెక్షన్లు, పిల్లల నెత్తిపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు. నిర్ధారణ: సీబీపీ, టిఎస్హెచ్, హార్మోన్ పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్ శాతం, కొవ్వుశాతం నిర్థారించే పరీక్షల ద్వారా. జాగ్రత్తలు: కృత్రిమంగా తయారయే హెయిర్‌డైలు, కృత్రిమ రంగులను జుట్టుకు ఉపయోగించవద్దు. మంచి షాంపూతో వెంట్రుకలను శుభ్రం చేసుకుని, తడి లేకుండా తుడుచుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, క్యాల్షియం, ఐరన్ ప్రొటీన్లు, అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. హోమియో చికిత్స: హోమియో చికిత్స విధానంలో జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు మంచి మందులున్నాయి. ముందే కనిపెట్టి, తగిన మందులు వాడితే ఉపయోగం ఉంటుంది. పూర్తిగా బట్టతల అయిన తర్వాత ఇంక హెయిర్ట్రాన్స్ప్లాంటేషనే శరణ్యం. జన్యులోపాలు, హార్మోన్ల సమస్యలను సరిచేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. దీనికి యాసిడ్ ఫ్లోర్, ఆలోస్, నెటమొర్, యూస్పిలిగో, ఫాస్పరస్ మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 15 ఏళ్లు. గత ఏడాది క్రికెట్ ఆడుతుండగా అతడి కుడి మోకాలిలో నొప్పి వచ్చింది. తర్వాత అది తగ్గినా మోకాలిలో కొన్నిసార్లు వాపు వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాం. ఎక్స్-రే తీయించాం. కానీ అది నార్మల్ అని వచ్చింది. రెండు వారాల తర్వాత ఎమ్మారై కూడా చేయించాం. అందులో కార్టిలేజ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. అది తగ్గదనీ, ఆ తర్వాత ఆర్థరైటిస్‌కు దారి తీస్తుందని డాక్టర్ చెబుతున్నారు. రెండో మోకాలిలోనూ నొప్పి వస్తోంది. ఈ వయసులోనే ఇలా ఉంటే, భవిష్యత్తులో అతడి పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - సురేశ్‌బాబు, బాపట్ల పిల్లలు ఆడుకునే సమయంలో జరిగే దురదృష్టకరమైన సంఘటనలు ఇవి. ఎమ్మారైలో కనిపించిన రిపోర్టులను బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ అబ్బాయికి వచ్చిన సమస్యను వైద్యపరిభాషలో ‘ఆస్టియో కాండ్రైటిస్ డిసెకాన్స్’ అంటారు. కంటికి కనిపించనంత చిన్న గాయాల వల్ల కార్టిలేజ్‌కు రక్తసరఫరాలో వచ్చే లోపాలతో ఈ సమస్య వస్తుంటుంది. మరీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఒక మోకాలికి ఈ సమస్య వస్తే 20 శాతం మందిలో రెండో మోకాలికీ ఇదే సమస్య రావచ్చు. అయితే ఈ విషయంలో రోగులకు శుభవార్త ఏమిటంటే... గతంలోలా దీనికి చికిత్స లేని పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం వల్ల తగిన చికిత్స చేసి ఈ ‘ఆస్టియోకాండ్రైటిస్ డిసెకాన్స్’ సమస్యను నయం చేయవచ్చు. ఆర్థ్రోస్కోప్ (కీ-హోల్ సర్జరీ) ప్రక్రియ ద్వారా ఎముకకు ఆగిపోయిన రక్తప్రసరణను పునరుద్ధరించవచ్చు. దాంతో ఎముకలో కార్టిలేజ్ (చిగురు ఎముక/మృదులాస్థి) మళ్లీ పెరిగి, మోకాలు ముందులాగే ఉండేలా చూడవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే... ఈ చికిత్స అయ్యేవరకూ అతడు ఆటలాడకుండా, పరుగెత్తకుండా చూడాలి. మీరు ఆందోళన చెందకుండా ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. మూడేళ్లుగా హైబీపీ ఉంది. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రొటీన్‌గా టెస్ట్ చేయించుకుంటే క్రియాటినిన్ 6 అనీ, యూరియా 120 అని రిపోర్టు వచ్చింది. నా కిడ్నీలు పనిచేయడం లేదని చెప్పారు. ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఇలా ఉండవచ్చా? - కుమారస్వామి, గూడూరు మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది. రెండు కిడ్నీలు పనితీరు 50 శాతం తగ్గినప్పటికీ లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. కొంతమందిలో కిడ్నీ పనితీరు 15 శాతానికి పడిపోయినప్పుడు కూడా ఏ ఇబ్బందులూ కనిపించకపోవచ్చు. కానీ కేవలం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే విషయం బయటపడుతుంది. అందుకే ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ రిస్క్ ఉంటుందో (బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీలో ఇన్ఫెక్షన్, ఫ్యామిలీలో కిడ్నీ వ్యాధులు) వారు ప్రతి ఏడాదీ కిడ్నీ పనితీరు ఎలా ఉందో పరీక్షలు చేయించుకొని తెలుసుకోవాలి. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌ను ముందుగానే కనుగొంటే ఆ తర్వాత వచ్చే దుష్ర్పభావాలను ముందునుంచే నివారించడానికి అవకాశం ఉంటుంది. నాకు 38 ఏళ్లు. ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకొన్నాను. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - రాఘవరావు, మార్కాపురం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఇచ్చే మందులు క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. చాలామంది పేషెంట్స్ కిడ్నీ బాగా పనిచేస్తుంది కదా అనుకొని మందులు వాడరు. ఇలా చేయడం వల్ల కిడ్నీ రిజెక్ట్ అవుతుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జలుబుగాని, జ్వరంగాని, ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఏ ఇతర మందులు వాడరాదు. అప్పటికప్పుడు ఒండిన ఆహారం తీసుకోవాలి. మంచినీరు కాచి, చల్లార్చినవి వాడాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్లను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పొడిబారిన జుట్టుకు...
ప్రశ్న - పరిష్కారం నాకు జుట్టురాలడం, చుండ్రు సమస్యలు ఉన్నాయి. చలికాలం కావడంతో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. హెర్బల్ షాంపూలు, నూనెలు వాడినా ఫలితం లేదు. ఈ సమస్యల నివారణకు మంచి సలహా చెప్పగలరు. - వి.ఆర్.మాధురి, ఇ-మెయిల్ మానసిక ఒత్తిడి, విటమిన్లు, మినరల్స్, ఐరన్ శరీరానికి తగినంత అందకపోవడం, కాలుష్యం, వంశపారంపర్యం, నిద్రలేమి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, అనారోగ్యం.. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు ఇలా అనేక కారణాలు ఉంటాయి. మీరు నెలలో రెండు సార్లు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఉసిరి, శికాకాయ, ఎండిన నిమ్మ ఆకులను కలిపి తయారుచేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. చలికాలమైనా సరే కొబ్బరి నీళ్లు తరచూ తాగుతూ ఉండండి. అలాగే రోజూ రెండు బాదంపప్పులు తింటూ ఉండండి. వెంట్రుకలు రాలడం, పొడిబారడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. నా తల వెంట్రుకలు చాలా బిరుసుగా ఉంటాయి. వారానికి ఒకసారి నూనె రాసుకుంటాను. డ్రై నెస్ పోవడానికి ఎన్నిషాంపూలు మార్చినా ఫలితం కనపించడం లేదు. ఏం చేస్తే నా జుట్టు సిల్కీగా అవుతుంది? - విక్కి, ఇ-మెయిల్ చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. మీరు వారానికి రెండు సార్లు పెరుగుతో జుట్టు కుదుళ్లకు మాడుకు మసాజ్ చేయండి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచండి. అలాగే షాంపూతో తలంటుకున్న తర్వాత, తడి జుట్టుకు తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించండి. అయితే, కండిషనర్‌ని నేరుగా మాడుకు పట్టించవద్దు. బయటకు వెళ్లేటప్పుడు తలను క్యాప్‌తో కవర్ చేయండి. గుడ్లు, నట్స్, పాల ఉత్పత్తులలో ప్రొటీన్లు అధికం. వీటిని రోజూ తీసుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు సిల్కీగా అవుతుంది. నా వయసు 19. నా పై పెదవి మీద వెంట్రుకలు వస్తున్నాయి. నలుపుగా కూడా ఉంటోంది. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోంది. పరిష్కారం చెప్పగలరు. - ఈషా, ఇ-మెయిల్ ఆడవారిలో పై పెదవి మీద వెంట్రుకలు రావడం అనేది హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల జరుగుతుంది. దీనికి థ్రెడింగ్, వ్యాక్సింగ్ మేలైనవి. నలుపు కూడా ఉంది కాబట్టి టొమాటో గుజ్జును పై పెదవి మీద రాసి, ఆరనివ్వండి. తర్వాత శుభ్రపరుచుకోండి. టొమాటోలోని సహజ సిద్ధమైన బ్లీచింగ్ నలుపును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పద్ధతిని పాటించవచ్చు. - గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్ -
యవ్వనంగా... విగ్గు
వయసు తక్కువగా కనిపించాలంటే నల్లగా నిగనిగలాడే తలకట్టు ఉండాలి. కానీ, సాధారణంగా వయసు పై బడినవారికి వెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం ఎక్కువ. ఈ వయసులో ఆరోగ్యసమస్యల కారణంగా అందరికీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వీలు పడదు. కానీ, వయసు తక్కువగా కనిపించాలని ఉంటుంది. వీరికి సరైన ఎంపిక ‘విగ్!’ ఒకప్పుడు విగ్ పెట్టుకోవాలంటే అసహజంగా అనిపించి వద్దనుకునే వారు. అలా విగ్గులు సినిమా తారలకు మాత్రమే పరిమితమయ్యేవి. నేడు.. జుట్టుకు, విగ్గుకు అస్సలు తేడా తెలియడం లేదు. ‘విగ్’ల తయారీలో సహజమైన మెటీరియల్స్‌ను వాడుతున్నాం. అసలైన కేశాలే అనిపించేలా కొన్ని రకాల మెటీరియల్‌ను విదేశాల నుంచి తెప్పిస్తుంటాం. వయసు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా కొంచెం తెల్లజుట్టు ఉండేలా కూడా విగ్స్ తయారుచేస్తున్నాం. వీటిలోనూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. తల మొత్తంతో పాటు, ప్రత్యేకంగా బట్టతలను మాత్రమే కవర్ చేసేలా విగ్స్ తయారుచేస్తున్నాం. ఇవి 2/3 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. మెటీరియల్, పొడవును బట్టి 10 వేలనుంచి లక్ష రూపాయల వరకు వీటి ధరలు ఉన్నాయి. - దీప్తి మువ్వ, లా మార్స్ హెయిర్ సెలూన్