-
పాపం గొరిల్లా...!
కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో జూలో తీసిన చిత్రమిది. సందర్శకులు జూ ఎన్‌క్లోజర్‌లోకి ఓ పెద్దసైజు నిమ్మపండును విసరగానే... ఇదిగో ఈ గోరిల్లా తన కండబలం చూపి మిగతా వాటిని తరిమేసింది. పండును దక్కించుకుంది. తిందామని కొరకగానే... నిమ్మరుచికి దాని ముఖంలో కనిపించిన హావభావాలివి... -
ధూంధాంగా షాబాని బర్త్ డే!
టోక్యో: షాబానిని ఎవరైనా చూడగానే ముచ్చటపడతారు. అంతటి అందం వాడిది. వాడిని ప్రత్యేకంగా చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాంటిది షాబాని పుట్టినరోజున ఎవరు రాకుండా ఉంటారు! అందుకే వందలమంది మంగళవారం జపాన్‌లోని నాగోయా నగరంలోని జూకు బారులు తీరారు. షాబానికి ఇష్టమైన కూరగాయలతో కేకు తయారుచేయించి వాడితో కట్ చేయించారు. ఇంతకీ షాబాని ఎవరనుకుంటున్నారా? జపాన్‌లోనే అందమైన మగ గోరిల్లా. నాగోయా జూలో మంగళవారం ఘనంగా ఈ గోరిల్లా 19వ పుట్టినరోజు జరిగింది. దాదాపు 500 మంది వీక్షకులు హాజరయ్యారు. తన గుహ ముందు కేకుతో బారులు తీరారు. జన్మదినం సందర్భంగా తాపీగా గుహ నుంచి బయటకు వచ్చిన షాబాని కేకులోని ఓ పెద్ద భాగాన్ని తిని సందర్శకులను ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ వారు పాట పాడారు. షాబాని ఫొటోలకు ఆన్లైన్లో యమ క్రేజ్ ఉంది. దీని ఫొటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకున్నారు. మానవ కాలమానం ప్రకారం ఈ గోరిల్లా వయస్సు 30 ఏళ్లు ఉంటుంది. షాబానితో హుషారుగా గడిపిన సందర్శకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా భర్త కన్నా షాబానే బాగుందన్న ఓ మహిళ అనగా.. అందం విషయంలో షాబానితో పోటీపడలేనని మరో వ్యక్తి పేర్కొన్నాడు. -
'అమ్మాయిల్లో పిచ్చి ఫాలోయింగ్'
ఈ మాట అంటున్నది ఎవరో కాదండోయ్. 180 కేజీల బరువుతో కండలు మెలితిరిగి బలిష్టంగా ఉన్న ఈ గొరిల్లాను చూసి జూకు వచ్చిన అమ్మాయిలంటున్నారు. 18 ఏళ్ల వయసున్న ఈ మగ గొరిల్లా పేరు షబని. నెదర్లాండ్‌లో పుట్టిన ఈ గొరిల్లాను ఆస్ట్రేలియాకు, అనంతరం జపాన్‌లోని నగోయా సిటీ హిగషియామా జూకు తరలించారు. 2007 నుంచి ఇక్కడే ఉంటున్న దీనితో జూ నిర్వహకులు ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్నుంచి దీనికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీనిని చూసేందుకు పెద్దసంఖ్యలో యువతులు జూకు తరలి వస్తున్నారని జూ అధికారి తెలిపారు. ట్విటర్లోనూ షబనీకి తెగ ఫాలోయింగ్ ఉంది. -
గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్
గొరిల్లా అనగానే ఇంతెత్తు విగ్రహం.. భీకరమైన ఆకారం.. కళ్లముందు కదలాడుతుంది. సినిమాల్లో చూడటం తప్ప గొరిల్లా గురించి తెలిసింది తక్కువే. గొరిల్లాలు ఎక్కడ సంచరిస్తాయి.. వాటి జీవన శైలి ఎలా ఉంటుంది.. అవి ఏమేం తింటాయి.. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ రోజు బంజారాహిల్స్, రోడ్ నంబర్ 3లోని గోథేజెంత్రమ్కు వె ళ్లాల్సిందే. ఉగాండా, రువాండా దేశాల్లో పర్వతారోహణ చేసిన బృందాలు.. తమ అనుభవాలను పంచుకుంటాయి. గొరిల్లాల జీవన విధాన విశేషాలను తెలియజేస్తాయి. ‘గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్’ పేరిట జరిగే ఈ కార్యక్రమం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఫోన్: 040-40180496 -
లోగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర 15 ఈ తెగల్లో అన్నికంటే భారీ జంతువు గొరిల్లా. ఆరడుగుల ఎత్తుకు పెరగడమే గాక, చాలా బలిష్టంగా ఉంటుంది. చూసేందుకు క్రూరంగా కనిపించినా, హాని కలిగించే జంతువు గాదు. ఇవి కూడా చిన్న చిన్న కుటుంబాలుగా జీవించేవే. పగటిపూట నేలమీదనే ఉంటాయిగానీ, నడిచేది మాత్రం నాలుగు కాళ్ళతోనే. నిటారుగా వెనకకాళ్ళ మీద నిలబడగలిగినా, రెండుకాళ్ళ మీద కొన్ని అడుగులకు మించి నడవవు. చీకటి పడగానే చెట్టెక్కి పంగల్లో పడుకుంటాయి. గడ్డితో కొమ్మలతో కప్పును తయారుజేసుకుంటాయి. బృందానికి నాయకత్వం ఏర్పాటు చేసుకునే సంప్రదాయం వీటికుంది. వయసులో అన్నిటికంటే పెద్ద జంతువును నాయకుడిగా అంగీకరిస్తాయి. నాయకుడు నడుస్తూంటే గౌరవసూచకంగా దారిని విడుస్తుంటాయి. శరీర పరిమాణంలో గొరిల్లాలకంటే చింపాంజీలు చిన్నవేగానీ, తెలివికి ముందంజలో ఉంటాయి. తర్ఫీదిస్తే సైకిలు తొక్కడం వంటి పనులు చేసేందుకు వీలుగా వీటి కాళ్ళూ చేతులూ ఏర్పడివుంటాయి. నిద్రపోయేందుకు తప్ప మిగతా సమయాల్లో నేలమీదనే ఉంటాయి. నిటారుగా నిలబడి గొరిల్లాకంటే ఎక్కువ దూరం నడవగలవుగానీ, అవసరమైనప్పుడు తప్ప అలా నడవవు. చింపాజీ, గొరిల్లా, ఒరాంగుటాన్ల శరీర పరిమాణం పెద్దగా ఉండడం వల్ల వీటిని ‘గ్రేట్ ఏప్స్’ అంటారు. అంత పెద్ద శరీరాలతో కొమ్మల మీద ఎల్లప్పుడు జీవించడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఇవి నేలకు దిగివచ్చినా, శాఖాజీవితాన్ని సంపూర్ణంగా వదిలేయలేదు. సీనోజోయిక్ యుగంలో తొలిఘట్టం ముగిసేనాటికి పులి, సింహం వంటి మినహాయింపులు పోను, ఇప్పుడు భూమిమీద ఉనికిలోవుండే జంతువులకంటే ఇంకా ఎక్కువే తెరమీదికి వచ్చాయి. ఇంతవరకు ఆరంగేట్రం చేయనిది ఒక్క మానవుడే. ఇంతకుముందు ‘హోమినాయిడీ’ విభాగాన్ని గురించి చర్చిస్తూ, అందులో ‘పాంజిడీ’ జాతికి చెందిన వాలిడులను మాత్రమే చెప్పుకున్నాం. అందులో మరోజాతిగావున్న ‘హోమినిడీ’ని వదిలేశాం. ఆ హోమినిడీలో ఉండేది ఒకేవొక జీవి. దాన్నే ‘మనిషి’ అంటారు. ఆనాటికి పులి, సింహం లేకపోయినా, వాటిగా పరిణామం చెందబోయే పూర్వజంతువుల ఆనవాళ్ళైనా ఉన్నాయి. మనిషికి పూర్వజంతువేదో దాని జాడలు వెదకడమే అనితరసాధ్యమయింది. తెలివిలోనూ, శరీర నిర్మాణంలోనూ వాలిడి జాతులు మనిషిని పోలినవిగా కనిపించినా, అవి మనిషికి ముందుతరాలు కానేకావు. స్థూలదృష్టికి శరీరాలు ఒకేలా కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా తేడాలు తెలిసొస్తాయి. ఏ తెగ వాలిడిని తీసుకున్నా దాని చేతుల జంపు కాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వాటి జీవితానికి కొమ్మలతో సంబంధం తెగలేదు. అవి రెండుకాళ్ళ మీద నడవడం యాదృచ్ఛికం; నడిచే విధానంలో బొటన వేలిమీద ఆధారపడకుండా, భారమంతా పాదం వెలుపలివైపు మోస్తుంది. నడకలో మనిషి తన బరువును మోపుకునేది మడమ, బొటనవ్రేళ్ళమీద. చెట్టెక్కాలంటే జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కాలి. వాలిడికి పరిగెత్తడం రాదు. మనిషి నడకగానీ, పరుగుగానీ పరిశీలిస్తే, అంత తేలిగ్గా వాటిని నిర్వర్తించే అవయవ నిర్మాణం కోట్లాది సంవత్సరాలకు పూర్వం మొదలయిందే తప్ప, అంతకు తక్కువ వ్యవధిలో సాధ్యమయ్యే పరిణామం కాదని తెలుస్తుంది. అంటే, సీనోజోయిక్ యుగం తొలిఘట్టంలోనే ఎప్పుడోవొకప్పుడు, నేలమీద పరిగెత్తే వాలిడివంటి జంతువు, కొమ్మల చాటున కాకుండా గుట్టల్లో దాక్కున్న జంతువు, కేవలం శాఖాహారం మీదే ఆధారపడకుండా భోజనానికి మాంసాన్ని తోడుజేసుకున్న జంతువు, తరువాతి తరువాతి కాలంలో మనిషిగా మారేందుకు తగిన సాధనసంపత్తిని అవయవాల్లో ప్రోగుచేసుకున్న జంతువు నిస్సందేహంగా జీవించివుండాలి. కానీ, దాని ఆనవాళ్ళు మాత్రం దొరకడం లేదు. దీనికి కారణాలు అనేకం. సరీసృపాల కాలం నుండి జంతువులు నీటికి దూరంగా జీవితాన్ని సాగించడం మొదలెట్టాయి. ప్రవాహాల విషయంలో మనిషి జాగరూకత మరింత ఎక్కువ. ఎందుకంటే, తర్ఫీదు ద్వారా తప్ప ఈతను సాధించుకోలేని జీవి ప్రకృతి మొత్తానికి మనిషి ఒక్కడే. అందువల్ల, సముద్రం పొరల్లో అవశేషాలు దుర్లభమైనాయి. నేల పొరల్లో సాధ్యమేగానీ, ఆ దిశగా ఇప్పుడు జరుగుతున్న పరిశోధన, ఉత్సాహం చూపించే శాస్త్రజ్ఞుల సంఖ్య చాలినంత లేదు. అయితే, వెలుతులు లేకుండా మానవుని చరిత్రను నిర్మించేందుకు తగిన ఆధారాలు ఏదోవొకరోజు నేలపొరల్లో బయటపడకమానవు. దానికోసం ఎంతకాలం నిరీక్షించాలో ఇప్పుడు చెప్పలేంగానీ, సంపన్నదేశాలు యుద్ధసామాగ్రి ఆధునీకరణకు చూపించే ఆసక్తిలో ఏ నూరోవంతుకు సమానమైన శ్రద్ధ ఇటువైపు మళ్ళించినా దశాబ్దకాలంలో వెలితిలేని మానవచరిత్ర నిర్మాణం కావచ్చు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
వర్ణం: మళ్లీ కావాలి అమ్మ ఒడి!
తల్లిని ప్రేమగా హత్తుకున్న ఈ పిల్ల గొరిల్లాను చూస్తుంటే, జీవుల ఉద్వేగాలన్నీ మనుషులకు మల్లేనే ఉంటాయని అనిపించట్లేదూ! తల్లి ఒడిలో లభించే భద్రత, తల్లి సామీప్యంలో లభించే నిశ్చింత ఏ పిల్లలకైనా అనుభవమే. అలాంటి అమ్మ ఒడి సౌఖ్యపు క్షణాల్ని పెద్దయ్యేకొద్దీ వదులుకోకా తప్పదు; జీవిత పోరాటంలో తల్లిగానో తండ్రిగానో రూపాంతరం చెందాల్సిన ప్రకృతి ధర్మాన్ని పాటించకా తప్పదు. అయినా అవకాశం వస్తే అందరూ శిశువులుగా మారిపోయే వరం కోరుకుంటారేమో! ఈరోజు మాతృ దినోత్సవం! అమ్మ పంచిన ప్రేమను నెమరువేసుకునే రోజు. బదులుగా అమ్మపట్ల సంతానానికి గల బాధ్యతను గుర్తుచేసుకునే రోజు. ఈ సందర్భంగా ఏర్చికూర్చిన కొన్ని ఫొటోలివి. గొరిల్లా తల్లీపిల్లలు జర్మనీలోని లైప్జిగ్ జంతుప్రదర్శనశాలలోవి. తల్లి పేరు కమిలి. పాపకు ఇంకా నామకరణం జరగాలి. పుట్టి మూడ్రోజులే అయింది. ఇక, మూడు నెలల ఫ్రాంకోయిస్ లంగూర్, వాళ్లమ్మ ఈనా నివాసం ఇంగ్లండ్‌లోని హౌలట్స్ వైల్డ్ యానిమల్ పార్కు. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ పార్కులో జన్మించిన తొట్టతొలి ఫ్రాంకోయిస్ లంగూర్ పిల్ల ఇదే. ఇంకో విశేషం, ఈ జాతి చాలా అరుదైనది. ఇంకా ఆడుకుంటున్న ఎలుగుబంట్లేమో డిస్నీ వాళ్లు తీస్తున్న ‘బేర్స్’ సినిమాలోవి. అమ్మ పేరు స్కై. పిల్ల పేరు స్కౌట్. కంగారూ తల్లీపిల్లలు చెక్ రిపబ్లిక్‌లోని జ్లీన్ ప్రాంతంలోని జూలోవి. బేబీ వయసు మూడు నెలలు. జిరాఫీలు కూడా జర్మనీలోవే! కాకపోతే టియర్పార్క్ హగెన్బెక్ జూలోవి. నాల్రోజుల క్రితమే బుజ్జి జిరాఫీని తల్లి ప్రసవించింది.