Dr. Bhavana Kasu
-
Health: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే..
నేను ప్రెగ్నెంట్‌ను. ఇప్పుడు అయిదవ నెల. ఈ మధ్య అంటే ఓ పదిరోజులుగా .. ఎడమ బ్రెస్ట్‌లో గడ్డలాగా తగులుతోంది. అది నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో అలా ఉంటుందా? చెకప్ చేయించుకోవాలా? తెలియజేయగలరు. – వి. ఆనంది, జగదల్పూర్ ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్స్లో చాలా మార్పులు జరుగుతుంటాయి. మూడవ నెల నుంచే ఈ మార్పులు కనిపిస్తాయి. బ్రెస్ట్స్ సైజ్ పెరగడం, నిపుల్ ఏరియా డార్క్‌గా అవడం, కొంచెం నొప్పి వంటివి ఉండడం సహజం. కానీ గడ్డలు తగలడం.. ఈ అయిదవ నెల సమయంలో నార్మల్ కాదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న ప్రసూతి వైద్యులను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ అనేది సురక్షితం. డాక్టర్ పరీక్ష చేసి.. రెండు వైపులా బ్రెస్ట్స్కి అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తారు. ఎక్స్‌రే సురక్షితం కాదు. స్కానింగ్‌లో బ్రెస్ట్ టిష్యూలో ఉండే మార్పులను కనిపెట్టవచ్చు. చాలాసార్లు అంటే 90 శాతం ఇవి క్యాన్సర్ గడ్డలు కావు. ఇవి క్యాన్సర్కారకం కాని ఫైబ్రోఎడినోమా గడ్డలే అయి ఉంటాయి. ఇవి బ్రెస్ట్ సైజ్‌తోపాటు కొంచెం పెరిగి, ప్రెగ్నెన్సీలో బయటపడవచ్చు. ఒక చోట బ్రెస్ట్ టిష్యూ గట్టిపడి ఇవి ఏర్పడతాయి. చాలా మందిలో ఇవి 1–2 సెంటిమీటర్ల నుంచి 5–6 సెంటిమీటర్ల పరిమాణంలో ఉండొచ్చు. వీటిని అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. కానీ ప్రసవం తర్వాత కూడా ఫాలోఅప్ స్కాన్ చేయించుకుంటూ సైజులో మార్పులు కనిపెట్టుకుంటూ ఉండాలి. వీటివల్ల ఫ్యూచర్లో పాలు ఏర్పడడానికి కానీ, ఇవ్వటానికి కానీ ఏ ఇబ్బందీ ఉండదు. కొంతమందిలో ఇవి చాలా పెద్దగా అయి అయిదు సెంటిమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే excision బయాప్సీ ద్వారా చిన్న సర్జరీతో తీయటం జరుగుతుంది. కానీ అది ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీ గా చెయ్యవలసిన అవసరం లేదు. అరుదుగా నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ రావటం, నిపుల్ ఏరియాలో గుంటలు పడడం, బ్రెస్ట్ అంతా ష్రింక్ అవటం లాంటి మార్పులు ఉంటే అవి ప్రమాద సంకేతాలన్నమాటే. అలాంటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో abdominal shielding చేసి బిడ్డకు ఎక్స్‌రే కణాలు పడకుండా మమ్మోగ్రఫీ అనే టెస్ట్ చేస్తారు. ఇది క్యాన్సర్‌ను కనిపెట్టే టెస్ట్. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో సీనియర్ ప్రసూతి వైద్యులు, బ్రెస్ట్ స్పెషలిస్ట్ మీ కేస్‌ను హ్యాండిల్ చేసి తగిన ట్రీట్మెంట్/ బయాప్సీ/ సర్జరీ గురించి అవగాహన కల్పిస్తారు. అందుకే బ్రెస్ట్‌లో ఎలాంటి గడ్డలు తగిలినా వెంటనే డాక్టర్‌ను కన్సల్ట్ చేయాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి?
What Painkillers Are Safe During Pregnancy?: నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. ఇప్పుడు నాకు ఆరోనెల. నాకు నడుము నొప్పి, కాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ను సేఫ్‌గా వాడుకోవచ్చు. – దేవి, ఏలూరు ప్రెగ్నెన్సీలో పెయిన్ కిల్లర్స్ సేఫ్ కాదు. మెడికల్ షాపుల్లో అడిగి ఓవర్ ది కౌంటర్ దొరికే పెయిన్ కిల్లర్ మందులను అసలే వాడకూడదు. చాలా పెయిన్ కిల్లర్స్ రక్తం ద్వారా కడుపులోని బిడ్డకు వెళతాయి. ఇవి బిడ్డలోని అవయవాల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే నొప్పి నివారణ కోసం మందులు వాడాలి. ప్రెగ్నెన్సీలో ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేసినప్పుడు కాళ్లవాపులు, నొప్పి రావడం సహజం. ప్రెగ్నెన్సీలో బరువు పెరిగినందు వల్ల ఈ నొప్పి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. అందుకే వ్యాయామాలు మొదలుపెట్టాలి. గంట గంటకూ ఓ ఐదు – పది నిమిషాలు నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకోవాలి. కాల్షియం, విటమిన్ టాబ్లెట్స్, పోషకాహారం, పాలు తీసుకోవాలి. ఫిజియో థెరపిస్టును సంప్రదిస్తే, సరైన భంగిమలో కూర్చోవడంతో పాటు కూర్చుని చేసే ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. వీటితో నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో పారాసెటమాల్‌ను సేఫ్‌గా వాడుకోవచ్చు. అలాగే, తగినంత విశ్రాంతి, హాట్ అండ్ కోల్డ్ మసాజ్‌లు కూడా నొప్పి నివారణకు ఉపయోగపడతాయి. మొదటి మూడు నెలలు.. కడుపులో బిడ్డ అవయవాలు ఏర్పడుతూ ఉండే దశ. ఆ సమయంలో ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకపోవడమే మంచిది. అయితే, పారాసెటమాల్ వల్ల బిడ్డపై పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని పరిశోధనల్లో తేలింది. కొన్ని దగ్గు మందులు, సిరప్‌లలో కూడా పారాసెటమాల్ ఉంటుంది. అన్నీ కలిపి తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్లవచ్చు. అందుకే ఓవర్ ది కౌంటర్ మందులు తీసుకోకూడదు. పెయిన్ కిల్లర్స్ సేఫ్‌గా వాడుకోవాలంటే, తక్కువ మోతాదు, తక్కువ రోజులు వాడేలా చూసుకోవాలి. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఏఐడీస్) అనే కొన్ని రకాల మందులు మెడికల్ షాప్స్‌లో దొరుకుతాయి. ఇబుప్రొఫెన్, నాప్రోక్సెన్, మెఫెనామిక్ యాసిడ్లాంటివి.. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అసలు వాడకూడదు. ఏడో నెల తర్వాత ఇవి వాడినట్లయితే, కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకే వీటిని ప్రెగ్నెన్సీలో వాడకూడదు. ఓపియాయిడ్స్ అనే కొన్నిరకాల పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల పుట్టే బిడ్డలకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ట్రామడాల్ అనే మందు ఈ కోవలోకి వస్తుంది. తీవ్రమైన నొప్పులు ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో సరైన మోతాదులో మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడుకోవలసి ఉంటుంది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. శారీరకంగా, మానసికంగా కోలుకున్న తర్వాతే.. -
Health Tips: 8 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.. గర్భసంచి తీసేయించాలా?!
మేడం.. మా సిస్టర్కిప్పుడు తొమ్మిదవ నెల. హెచ్బి (హిమోగ్లోబిన్) 6 గ్రాములే ఉంది. వాంతుల వల్ల అసలు ఏమీ తినలేకపోయింది. బ్లడ్ ఎక్కించాలంటున్నారు డాక్టర్స్. మాకేమో బయట నుంచి బ్లడ్ తీసుకోవడం ఇష్టం లేదు. బ్లడ్ ఎక్కించడం నిజంగా అవసరమా? – సీహెచ్‌వీ ప్రజ్వల, కందుకూరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో బ్లడ్‌తోపాటు బ్లడ్ కాంపొనెంట్స్నూ ఎక్కిస్తారు. దీన్ని అత్యవసర పరిస్థితుల్లోనే చేస్తారు. మీ సిస్టర్‌కు రక్తహీనత సివియర్‌గా ఉంది. బ్లడ్‌లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. శరీరానికి కావల్సిన హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో, ఆక్సిజన్, పోషకాలను సమకూర్చడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో వీటిదే ప్రధాన పాత్ర. అంతేకాదు రక్తం గడ్డకట్టడానికీ పనిచేస్తాయి. హిమోగ్లోబిన్ 8 కన్నా తగ్గితే అదే రక్తహీనత. దీనివల్ల అలసట, ఆయాసం, నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, గుండెకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవచ్చు. తల్లికి రక్తహీనత ఉంటే దాని ప్రభావం పొట్టలోని బిడ్డ ఎదుగుదల మీదా పడుతుంది. ప్రసవమప్పుడు కూడా రక్తస్రావం వల్ల ఇబ్బందులు ఎదురై ప్రాణానికే ప్రమాదం కావచ్చు. తొమ్మిదవ నెలలో రక్తాన్ని పెంచడానికి ఎక్కువ సమయం, అవకాశం ఉండదు. వాంతులు, ఎసిడిటీ వల్ల చాలా మంది మాత్రలు, ఐరన్ ఇంజెక్షన్లను తట్టుకోలేరు. సుఖ ప్రసవమైనా, సిజేరియన్ అయినా కొంచెం రక్తస్రావం ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి రక్తహీనతతో బాధపడుతున్న తల్లులకు ఉండదు. అందుకే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ త్వరగా పెరగడానికి రక్తం ఎక్కించక తప్పదు. తలసీమియా, సికిల్ సెల్ అనీమియా వంటి అరుదైన కండిషన్స్ ఉన్న వారికి కొన్నిసార్లు మాత్రలు, ఇంజెక్షన్స్ పనిచేయవు. వాళ్లకు 8 కన్నా హిమోగ్లోబిన్ తగ్గితే తప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్‌ను క్రాస్ మ్యాచ్ చేస్తారు. రక్తం ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్స్ వగైరాను చెక్ చేస్తారు. దీన్ని చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు.. పర్యవేక్షిస్తారు. బ్లడ్ ఎక్కించే పరిస్థితి ఉంటే.. ఆసుపత్రిలో చేర్చుకుని.. రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా.. సోకుండా చూసుకుంటూ.. చాలా స్లోగా బ్లడ్ ఎక్కిస్తారు. 24 గంటలు అబ్జర్వేషన్లో పెడతారు. ప్రసూతి వైద్య నిపుణులు, మత్తు డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. బ్లడ్ ఎక్కించాక ఐరన్ మాత్రలు, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అసలు ఈ సమస్య అంటే హిమోగ్లోబిన్ తగ్గకుండా గర్భధారణ తొలి నుంచే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని .. అంటే ఆకు కూరలు, మాంసం, గుడ్లు, పళ్లు వంటివి తీసుకుంటే మంచిది. వాంతులను కంట్రోల్ చేయడానికి మందులు వాడాలి. నారింజ, నిమ్మ రసాలతో ఐరన్ మాత్రలు వేసుకుంటే శరీరానికి ఐరన్ త్వరగా పడుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. హెచ్బి శాతం తక్కువుందని తేలిన వెంటనే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది గర్భిణీలకు 7వ నెలలోపు హిమోగ్లోబిన్ తగ్గితే.. ఐవీ ఐరన్ ఇన్ఫ్యూజన్తో హిమోగ్లోబిన్ పెంచొచ్చు. 9వ నెలలో అనీమియా రిస్క్ ఎక్కువ. అందుకే హిమోగ్లోబిన్ 6 శాతం ఉంటే ముందుగానే రక్తం ఎక్కించే ఆప్షన్‌ను సూచిస్తారు డాక్టర్లు. బ్లడ్ డొనేషన్‌ను సామాజిక బాధ్యతగా గుర్తించాలి అందరూ. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, పిల్లలకు ఫ్రెష్ బ్లడ్ అవసరమవుతుంది. దగ్గర్లోని బ్లడ్ బ్యాంక్స్‌లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో పాల్గొనేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. ఆరోగ్యంగా ఉన్న యువత బ్లడ్ డొనేషన్లో పాల్గొంటే ఎంతో మంది జీవితాలను కాపాడిన వాళ్లవుతారు. నాకు 35 ఏళ్లు. ఎనిమిది నెలలుగా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి. ఇప్పుడు ఆ నొప్పితోపాటు లూజ్ మోషన్స్ కూడా అవుతున్నాయి. డాక్టర్‌కు చూపించుకుంటూ గర్భసంచి తీసేయాలని అంటున్నారు. దయచేసి నా సమస్య తగ్గే మార్గం చెప్పండి.. – డి. వసుధ, నిర్మల్ ఆరునెలల కన్నా ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి కొనసాగుతుంటే దాన్ని క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు. దీనికి గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన లక్షణాలున్న వాళ్లను క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఆపరేషన్ వల్ల ఏ ఉపయోగం ఉండదు. డాక్టర్‌ను సంప్రదించి.. పొత్తి కడుపులో నొప్పి ఎక్కడ.. ఎప్పుడు వస్తుంది.. ఏ పని వల్ల పెరుగుతుంది.. అని పెయిన్ మ్యాపింగ్ చేస్తారు. ఇప్పటి వరకు ఏ మందులు వాడారు, ఈ నొప్పితో యూరిన్, మోషన్లో ఎలాంటి మార్పులు వచ్చాయి.. మానసిక ప్రభావం వంటివన్నీ కనుక్కుంటారు. మీ రోజూవారీ జీవనశైలి,ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ చెక్ చేస్తారు. పొట్ట, వెజైనా, యూరినరీ ఏరియా, నర్వ్స్ చెక్ చేస్తారు. అబ్డామిన్, పెల్విస్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. వెజైనల్ స్వాబ్, యూరినరీ స్వాబ్ తీస్తారు. కొంతమందికి అప్పర్/ లోయర్ జీటీ రేడియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటారు. ఈ నొప్పి వల్ల పీరియడ్స్ టైమ్‌లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో కరెక్ట్‌గా చెప్పాలి. పొట్టకు సంబంధించి ఇంతకు ముందు ఏవైనా ఆపరేషన్స్ అయినట్టయితే నర్వ్ ఎన్‌ట్రాప్‌మెంట్ అనే కండిషన్ వల్ల నొప్పి వస్తుంది. దానికి సరైన చికిత్స తీసుకుంటే పొత్తి కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. పీరియడ్స్‌లో కూడా చేంజ్ వచ్చినట్టయితే మాత్రలను సూచిస్తారు. 3–6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత మీకు నొప్పి ఎలా ఉంది? ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయిందో లేదో.. మళ్లీ కన్సల్టేషన్‌లో చెక్ చేస్తారు. పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఇస్తారు. ఏవీ ఫలితాన్నివ్వకపోతే డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ చేస్తారు. ఈ విధానంలో పొట్ట మీద రంధ్రంలాంటి చిన్న కోత పెట్టి టెలిస్కోపిక్ కెమెరా ద్వారా ఆర్గాన్స్ అన్నిటినీ చెక్ చేస్తారు. దీనివల్ల ఎండోమెట్రియాసిస్, పెల్విస్ ఇన్ఫెక్షన్ వంటివి కనిపెట్టవచ్చు. వాటికి సరైన చికిత్స అందించవచ్చు. కొన్నిసార్లు నొప్పికి ఎలాంటి కారణం ఉండకపోవచ్చు. అదీ మంచిదే. అయితే నొప్పి తగ్గడానికి పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్‌కి రిఫర్ చేస్తారు. ఐబీఎస్(ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ )అనే కండిషన్లో డైట్ మార్పులతో పొట్ట నొప్పి తగ్గించవచ్చు. ఇన్ఫెక్షన్ను యాంటీబయాటిక్స్‌తో ట్రీట్ చేస్తారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా? -
Health: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా?
Pregnancy Tips: మేడమ్.. నాకిప్పుడు రెండో నెల. తొలి చూలప్పుడు అయిదో నెల వరకు వేవిళ్లతో బాధపడ్డాను. నాలుగు సార్లు ఆసుపత్రిలో జాయిన్ కావాల్సివచ్చింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా? చాలా భయంగా ఉంది. – ఎస్. మధులిక, బళ్లారి ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోపు వాంతులుండడం సర్వసాధారణం. కానీ వందలో ఒకరికి మాత్రం వాంతులు ఎక్కువై ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. దీనిని హైపర్మెసిస్ అంటారు. ఇది గర్భం దాల్చినప్పుడల్లా రిపీట్ అవ్వాలని ఏమీ లేదు. కొంచెం వాంతులు ఉన్నప్పుడే సరైన చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కొంతమందిలో 20వ వారం వరకూ వాంతులు అవుతుంటాయి ఎక్కువగా. మందులు వేసుకునే మందు, ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకుంటూండడం, వాంతి వచ్చేట్టుగా అనిపించే, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం, వాసనలకు దూరంగా ఉండడం, ఎండు ఉసిరి, శొంఠి ముక్కలను చప్పరించడం వంటివాటి వల్ల వాంతుల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. మీరు డాక్టర్‌ను కలసినప్పుడు మీకు థైరాయిడ్ , ఎలక్ట్రోలైట్స్, లివర్ టెస్ట్‌లు, హీమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. వీటిలో ఏదైనా అబ్నార్మల్గా ఉంటే ఆసుపత్రిలో చేరాల్సివస్తుంది. లేదంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్, మాత్రలతో మేనేజ్ చేయవచ్చు. ఐరన్, కాల్షియం మాత్రలను అయిదవ నెలలో మొదలుపెడతారు. వాటితో ఎసిడిటీ, వాంతులు ఎక్కువవుతాయి. చాలామందికి మాత్రలతోనే కంట్రోల్ అవుతుంది. నాకు 65 ఏళ్లండి. దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది. చాలా అసౌకర్యంగా ఉంటోంది. పదిమంది మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులతో కలసి కూర్చొని సరదాగా గడపాలన్నా ఇబ్బందిపడుతున్నాను. దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? దయచేసి చెప్పగలరు. – శ్రీదేవి కొప్పుల, అవిడి, తూర్పుగోదావరి జిల్లా మీ సమస్యను యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. వందలో యాభైమంది సిగ్గుగా ఫీలై డాక్టర్‌కు చూపించుకోవడానికి వెనకాడుతారు. కానీ త్వరగా చికిత్స తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఈ సమస్యలో పొట్ట మీద కొంచెం ఒత్తిడి పడితే చాలు మూత్రం పడుతుంది. దగ్గినా, తుమ్మినా, మలబద్ధకం ఉన్నా, వ్యాయామం చేసినా, వేగంగా నడిచినా నియంత్రణ తప్పి మూత్రం పడుతుంది. పెల్విక్ ఫ్లోర్‌లోని కండరాలు వదులైపోయి నప్పుడు ఇలా అవుతూంటుంది. చాలా మందికి సుఖ ప్రసవం తర్వాత ఈ సమస్య వస్తుంది. కెజెల్స్ ఎక్సర్సైజెస్ అని పొత్తి కడుపులో, పెల్విక్ ఫ్లోర్‌లోని కండరాలను బిగుతు చేసే వ్యాయామాన్ని ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే.. మిమ్మల్ని పరీక్షించి.. తన పర్యవేక్షణలో ఆ వ్యాయామాలను మీకు నేర్పిస్తారు. వెజైనల్ పెసరీ అనే రింగ్‌ను యోనిలో పెడతారు. దీనితో అలా నియంత్రణ లేకుండా మూత్రం పడడం తగ్గుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. పైన చెప్పినవేవీ పనిచేయనప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. యూరిన్ కల్చర్, సుగర్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలి. యూరోడైనమిక్ స్టడీస్ అని యూరినరీ ఫ్లో ఎలా ఉందని చెప్పే అడ్వాన్స్డ్ టెస్ట్స్ కొంతమందికి అసవరం పడొచ్చు. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే యోనిలో అల్సర్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కనుక ఆసల్యం చేయకుండా మీరు డాక్టర్‌ను సంప్రదించండి. నాకు పెళ్లయి సంవత్సరం అవుతోంది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నాం. దీనికి ముందుగా ఏమైనా టెస్ట్స్ చేయించుకోవాలా? – సీహెచ్‌వీకే సత్య, మచిలీపట్టణం ప్రికన్సెప్షన్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే కొన్ని నెలల ముందు నుంచి తీసుకునే జాగ్రత్తలని అర్థం. ఈరోజుల్లో పెళ్లయిన వెంటనే చాలామంది గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని వాళ్లు ఎప్పుడు, ఎలా ప్లాన్ చేయాలో కనుక్కుంటున్నారు. తగిన జాగ్రత్తలను ముందే తీసుకుంటే ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటి బిడ్డను కనే అవకాశాలు పెరుగుతాయి. ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ డోస్‌ను కనీసం గర్భధారణకు నెల ముందు నుంచి తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు స్పైన్, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మీకు కానీ, మీ కుటుంబంలో ఎవరికయినా బీపీ, సుగర్, థైరాయిడ్, ఆస్తమా, ఫిట్స్ వంటివి ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరీక్షలు మీకు చేస్తారు. అవి సరిగ్గా నియంత్రణలో ఉండేట్టు మందులు ఇస్తారు. కొన్ని వ్యాక్సిన్స్‌ను ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. ముందే తీసుకోవాలి. రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్స్‌ను ప్రెగ్నెన్సీకి కనీసం ఒకటి నుంచి మూడు నెలల ముందు తీసుకుంటే.. ఈ కండిషన్ వల్ల పొట్టలో బిడ్డ మీద దుష్ప్రభావం ఉండదు. మీరు ఏవైనా పెయిన్ కిల్లర్స్, హెర్బల్ మెడిసిన్స్ తీసుకుంటున్నట్లయితే డాక్టర్‌కు ముందే చెప్పాలి. కొన్నిటిని ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఆపేయాల్సి ఉంటుంది. ఆహారంలో కొన్ని రకాల చేపలను తీసుకోకూడదు. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో డాక్టర్ సూచిస్తారు. మీ బరువును బీఎమ్ఐ ద్వారా గణించి ఎక్కువ బరువు ఉంటే దానికి అనుగుణమైన డైట్‌ను, వ్యాయామాన్ని సూచిస్తారు. అధిక బరువు వల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు, పుట్టబోయే బిడ్డకూ సమస్యలు ఎక్కువ. బీఎమ్ఐ 25లోపు ఉంటే మంచిది. మీ భర్త తరపు కుటుంబంలో, మీ కుటుంబంలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు ఉంటే జెనెటిక్ కౌన్సెలర్‌ను తప్పకుండా సంప్రదించాలి. ప్రెగ్నెన్సీలో రిస్క్ కేటగరీ గురించి కౌన్సెలింగ్ చేస్తారు. మీరు ఏమైనా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నట్టయితే వాటిని ఎప్పుడు ఆపేయాలో చెప్తారు. ఇంతకు ముందు మీకు ఏమైనా యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ విషయాన్ని డాక్టర్‌తో చెప్పాలి. అవసరమైతే స్కానింగ్ చేస్తారు. మీరు, మీ భర్త ప్రికన్సెప్షన్ కేర్ కౌన్సెలింగ్ అటెండ్ అయితే ఈ విధమైన జాగ్రత్తలు చెప్తారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా? -
నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా?
నాకు 28 ఏళ్లు. ఓ వారం రోజులు (ఈ ఉత్తరం రాస్తున్నప్పటికి)గా పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి.. దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే మందులు రాసిచ్చారు. అవి వాడుతున్నా ప్రయోజనమేమీ లేదు. జ్వరం కూడా వస్తోంది. ఇదేమైనా ప్రమాదమా? – సీహెచ్. అనిత, బద్దెనపల్లి మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లి కన్సల్టెంట్‌ను కలిసి చెకప్ చేయించుకోవాలి. మందులు వేసుకున్నా తగ్గలేదంటే, చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది కూడా. మీకున్న ఈ సమస్యను పీఐడీ అంటారు. చాలామందికి ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. యోని నుంచి గర్భసంచి, అండాశయాలు, ఫాలోపియన్ ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే జ్వరం, ఇన్ఫెక్షన్ ఎక్కువై ప్రమాదకరంగా మారుతుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే, కాటన్ స్వాబ్స్‌తో యోని నుంచి వైట్ డిశ్చార్జ్‌ని తీసి పరీక్షకు పంపిస్తారు. ఈ పరీక్షలో ఏ ఇన్ఫెక్షన్ ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. మూత్రనాళంలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. కొన్ని రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి లోపల గర్భసంచి, అండాశయాలకేమైనా వాపు ఉందా అని చూస్తారు. జ్వరం వచ్చిందంటే యాంటీబయాటిక్స్ ఐవీ ఇస్తారు. తర్వాత రెండు వారాల వరకు యాంటీబయాటిక్స్ మాత్రలు వేసుకోవాలి. ఇలా సరైన చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. లేదంటే భవిష్యత్‌లో ఇన్ఫెక్షన్ తిరగబడి పిల్లలు కలగడంలో సమస్యలు తలెత్తవచ్చు. మీకు నొప్పి తగ్గడానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. 48 నుంచి 72 గంటల్లో మీ సమస్య సర్దుకోలేదంటే ఆసుపత్రిలో చేరి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మేడం.. మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది రీసెంట్గా. నాకు ఇప్పుడు 35 ఏళ్లు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటారు కదా.. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? – కాంస్యం పద్మజ, ముప్కాల్ రొమ్ము క్యాన్సర్‌కు చాలాసార్లు కారాణాలు తెలియవు. పది శాతం రొమ్మ క్యాన్సర్లు కుటుంబంలో రన్ అవుతాయి. అంటే ఆ జీన్ తల్లిదండ్రుల్లో ఉంటే, అది జన్యుపరమైన మార్పులతో పిల్లలకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందరిలో బీర్సీఏ1, బీఆర్సీఏ2 అనే రెండు జీన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతాయి. కానీ కొంతమందిలో ఈ జీన్స్ జన్యు మార్పిడిలో మ్యుటేటెడ్ జీన్స్ అవుతాయి. అవి పిల్లలకు వచ్చినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చాన్సెస్ పెరుగుతాయి. ఈ జీన్స్‌లో మ్యుటేషన్ ఓవరీ క్యాన్సర్‌కి కూడా కారణం అవుతుంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. వీళ్లల్లో కనుక ఆ మ్యుటేటెడ్ జీన్ ఉంటే, అది కుటుంబ పరంగా బ్రెస్ట్ క్యాన్సర్‌కి కారణం అవుతుంది. అలా తెలిసినప్పుడు జెనెటిక్ కౌన్సెలర్‌తో మాట్లాడాలి. ఒక్కోసారి అలాంటి అసాధారణ జీన్ ఉన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ. అందుకే జీన్ టెస్టింగ్ అందరికీ సూచించరు. మీరు చేయించుకోవాలనుకుంటే డాక్టర్‌ను సంప్రదించి, దాని గురించి కూలంకషంగా మాట్లాడాలి. క్లోజ్ ఫాలో–అప్ కేర్‌లో ఉండడానికి జీన్ టెస్టింగ్ సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ స్కాన్ లేదా మామోగ్రఫీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నలభై ఏళ్ల వయసు దాటాక ప్రతి రెండేళ్లకు ఒకసారి మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్రతి నెలసరి తరువాత స్వీయ పరీక్ష చేసుకోవాలి. డాక్టర్‌గారూ.. మా పాప వయసు ఏడున్నరేళ్లు. అప్పుడే నెలసరి వచ్చేసింది. ఎద కూడా ఎదిగింది. ఇంత చిన్నవయసులో ఈ విపరిణామమేంటో భయంగా ఉందండీ! – ఎన్. ప్రసూన, ఎమ్మిగనూరు మీరు తప్పకుండా డాక్టర్ని కలవాలి. దీనిని ముందస్తు రజస్వల అంటారు. ఎనిమిదేళ్లలోపు ఎద పెరగడం, నెలసరి మొదలవడం మంచిది కాదు. కొంతమందిలో జననేంద్రియాల దగ్గర రోమాలు రావడం కూడా ఉంటుంది. చాలామందిలో దీనికి కారణమేంటో తెలియదు. ఎండోక్రైనాలజిస్ట్, గైనకాలజిస్ట్.. ఈ ఇద్దరినీ సంప్రదించాలి. హార్మోన్లకు సంబంధించి కొన్ని పరీక్షలు చేయాలి. పెల్విస్, తలకు సంబంధించిన ఎమ్ఆర్ఐ చేస్తారు. ముందుగా కారణం కనుక్కొని చికిత్స చేస్తే మంచి హైట్ పెరుగుతారు. మెదడుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉండి ఇలా నెలసరి మొదలైతే వాళ్లకు కంటి చూపులో మార్పులు వస్తాయి. కళ్ల నరాలు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. దీనికి పిట్యూటరీ, తలకు ఎమ్ఆర్ఐ చేస్తారు. చర్మానికి సంబంధించి ఏవైనా క్రీమ్స్ వాడుతున్నారా అనేది కూడా డాక్టర్‌కు స్పష్టం చేయాలి. టాపికల్ హార్మోన్ క్రీమ్స్ మంచివి కావు. తెల్లబట్ట కూడా ఎక్కువగా అవుతుంది. కుటుంబంలో ఇలాంటి హిస్టరీ ఉందా అని కూడా చెక్ చేయాలి. థైరాయిడ్ పరీక్షలూ చేస్తారు. పిల్లలకు ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ హార్మోన్ క్రీమ్స్ వాడకూడదు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. శారీరకంగా, మానసికంగా కోలుకున్న తర్వాతే.. -
Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. అప్పుడే మళ్లీ మునుపటిలా భర్తతో..
నాకిప్పుడు 35 ఏళ్లు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. సుకన్య, ఆమ్రబాద్ లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి. ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక భర్తతో కాపురం చేయొచ్చు. మేడమ్.. మా మేనత్తకు ఈ మధ్యే పాప్ టెస్ట్ చేశారు. పాప్ టెస్ట్ అంటే ఏంటో చెప్పగలరు? – కె. సబిత, కంచిలి గర్భాశయ ముఖ ద్వారాన్ని సెర్విక్స్ అంటారు. ఇక్కడ అంటే ఈ సెర్విక్స్ లేదా సర్వైకల్ సెల్లో ఏవైనా మార్పులు ఉంటే పాప్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా సర్వైకల్ సెల్లో కనిపించే మార్పులు క్యాన్సర్‌గా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు అవి నార్మల్ అవచ్చు కూడా. కాబట్టి ఈ టెస్ట్‌లో అబ్నార్మల్ రిజల్ట్ వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్‌ని సూచిస్తారు డాక్టర్లు. ఆ పరీక్షల్లో కూడా మార్పులు కనిపిస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. పాప్ టెస్ట్‌ను నెలసరి అయిన వారంలోపు చేయాలి. అదీ గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్‌లోనే చేస్తారు. పది నిమిషాలు పడుతుంది. వారంలో టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఈ వైద్య పరీక్ష వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టెస్ట్ వల్ల సెర్విక్స్ క్యాన్సర్‌ను తొందరగా పసిగట్టవచ్చు. దాంతో వెంటనే చికిత్స అంది, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. పాప్ టెస్ట్‌ను పాతికేళ్లు వచ్చినప్పటి నుంచి ప్రతి మూడేళ్లకొకసారి చేయించుకోవాలి. యాభై నుంచి అరవై అయిదేళ్ల మధ్య వయస్కులు ప్రతి అయిదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఈ టెస్ట్‌లో హెచ్‌పీవీ టెస్ట్‌ను కూడా కలిపి చేయించుకోవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందవచ్చు. ∙మేడమ్.. నాకు డెలివరీ అయ్యి నెలవుతోంది. బేబీకి నా పాలే ఇస్తున్నాను. కానీ రెండు రోజుల (ఈ ఉత్తరం రాస్తున్నప్పటికి) నుంచి బ్రెస్ట్‌లో ఒకటే నొప్పి, చలి జ్వరం. ఈ టైమ్‌లో బేబీకి నా పాలు పట్టొచ్చా? – పి. సుధారాణి, తిరుపతి తల్లి పాలు ఇచ్చేప్పుడు బ్రెస్ట్‌లో నొప్పి, మంట ఉంటాయి కొంచెం. వేడినీళ్లతో కాపడం పెడితే తగ్గుతుంది. కానీ జ్వరం కూడా ఉంది అంటున్నారు కాబట్టి.. బ్రెస్ట్‌లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించాలి. దీనిని Mastitis అంటారు. బేబీ నోటిలో, ముక్కులో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా తల్లి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు. త్వరగా గమనించి చికిత్స చేస్తే జ్వరం రాదు. దీనివల్ల బ్రెస్ట్‌లో విపరీతమైన నొప్పి, జ్వరం, తలనొప్పి కూడా వస్తాయి. బ్యాక్టీరియా బ్రెస్ట్ నిపిల్ మీది పగుళ్ల ద్వారా లోపలికి వెళ్లి మిల్క్ డక్ట్‌ను ఇన్ఫెక్షన్తో బ్లాక్ చేస్తుంది. మీకు డయాబెటిస్ లేదా నిపిల్ మీద పగుళ్లు ఉంటే బ్రెస్ట్‌లో గడ్డ అయ్యే చాన్స్ పెరుగుతుంది. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చూసి, కొన్ని రక్త పరీక్షలు చేసి యాంటిబయాటిక్ మందులు ఇస్తారు. అవీ పాలు తాగే బిడ్డకు సురక్షితంగా ఉండేవే. ఈ టైమ్‌లో కూడా మీరు మీ బిడ్డకు డైరెక్ట్గానైనా లేదా పాలను పిండైనా పట్టవచ్చు. నిపిల్ పగుళ్లకు క్రీమ్ ఇస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండానికి చనుమొనలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే రెండు రొమ్ముల నుంచి సమంగా పాలు పట్టాలి. పోషకాహారం, మంచి నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. త్వరగా Mastitisకు చికిత్సను అందిస్తే అది గడ్డలా మారదు. ఇన్ఫెక్షన్ ఎక్కువై, రొమ్ములో వాపు వస్తే చిన్న ఆపరేషన్ చేసి పాలగడ్డలను, చీమును తీయవలసి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పాలిస్తూ ఉండాలి. జ్వరం ఉన్నా బిడ్డకు తల్లిపాలు పట్టొచ్చు. పాలిచ్చే సమయంలో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇలాంటి ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత కూడా బ్రెస్ట్ పంప్‌తో ఎక్కువైన పాలను తీసేస్తూ జాగ్రత్తగా ఉండాలి. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్