హృతిక్, సెలీనాలపై సోషల్ మీడియా ఫైర్ | Social media ticks off Hrithik Roshan and Celina Jaitly for self-absorbed tweets on Istanbul attacks | Sakshi
Sakshi News home page

హృతిక్, సెలీనాలపై సోషల్ మీడియా ఫైర్

Published Thu, Jun 30 2016 6:33 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

హృతిక్, సెలీనాలపై సోషల్ మీడియా ఫైర్ - Sakshi

న్యూఢిల్లీ: టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి టెర్రరిస్టులు సృష్టించిన మారణకాండ పట్ల యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు టైస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం ఈ వార్తలు చదివి కలవర పడిన భారతీయులు ఇదే సంఘటనపై బాలివుడ్ నటుడు హృతిక్ రోషన్, సామాజిక కార్యకర్త, గే హక్కుల కోసం పోరాడుతున్న సెలీనా జైట్లీ పంపిన ట్వీట్లు చూసి కంగుతిన్నారు. ‘ఇదేమి చీప్ పబ్లిసిటీ!’ అంటూ ఈసడించుకున్నారు. వారిద్దరు సెలబ్రిటీల స్పందనలను ఎండగడుతూ కౌంటర్ ట్వీట్లు చేశారు.

విశ్రాంతి కోసం ఇద్దరు పిల్లలతో టాంజానియా వెళ్లిన తాను టైస్టుల దాడులకు కొన్ని గంటల ముందు ఇస్తాంబుల్‌లో ఆగానని, అక్కడి నుంచి మరో విమానంలో రావాలంటే ఒకరోజు ఆగాల్సి వచ్చేదని, అయితే తాను ఎకానమీ క్లాస్‌లో సర్దుకొని భారత్‌కు వచ్చానని, ఓ మతం కోసం అక్కడ అమాయకులను చంపారని, టెర్రరిజానికి వ్యతిరేకంగా మనమంతా నిలబడాలంటూ హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు.

దీనిపై సోషల్ మీడియా మండిపడింది. టెర్రరిస్టుల దాడుల్లో 41 మంది అమాయకులు మరణించి, 238 మంది గాయపడి తాము బాధ పడుతుంటే తమరు ఎకానమీ క్లాస్‌లో వచ్చారని జాలి చూపాలా అంటూ పలువురు విమర్శించారు. ‘నా ప్రజలు చనిపోతే ఎకానమీ క్లాస్ గురించి మాట్లాడుతావా?....ప్రజలు చనిపోవడంకన్నా ఎకానమీ క్లాస్‌లో హృతిక్ ప్రయాణించడం ఎక్కువ హారిబుల్‌గా ఉన్నట్టుంది....హృతిక్‌కు మతిపోయింది....ఆయనకు పిసరంతా కూడా మెదడు లేదు....ఆయన మాటలు పట్టించుకోకండి, నేను ఈ క్షణాన ప్రపంచం కోసం నిజంగా బాధ పడుతున్నా...’ అంటూ పలువురు ట్వీట్ చేశారు.

ఫ్లోరిడాలోని మయామిలో నెల రోజుల క్రితం జరిగిన హార్వే మిల్క్ ఫౌండేషన్ సన్మాన కార్యక్రమానికి హాజరైన తాను వచ్చేటప్పుడు ఇస్తాంబుల్ మీదుగా వచ్చానని, అక్కడ టెర్రరిస్టుల దాడి జరిగిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని సెలీనా జైట్లీ వ్యాఖ్యానించడంపై కూడా ట్విట్టర్‌లో మండిపడ్డారు. ‘అసలు నీకేమైంది? మిల్క్ ఫౌండేషన్ గురించి, సన్మానం గురించి మాట్లాడాల్సిన సందర్భమా ఇది!.....నీవు నిజంగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉండి ఉంటే బాధితులతో కలసి సెల్ఫీలు తీసుకునే దానివేమో!’ అంటూ కొందరు మండిపడ్డారు. వీటిపై సెరీనా జైట్లీ స్పందిస్తూ తాను ప్రస్తావించిన ఇతర అంశాలను ఎత్తిచూపినందుకు ధన్యవాదాలని, తనకు దురుద్దేశాలు అంటగట్టవద్దని, తనను క్షమించాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement