దిగుమతి దేశాల గ్యాస్ రేట్లే పరిగణించాలి | Gas importing countries should consider rate | Sakshi
Sakshi News home page

దిగుమతి దేశాల గ్యాస్ రేట్లే పరిగణించాలి

Published Sat, Oct 3 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

దిగుమతి దేశాల గ్యాస్ రేట్లే పరిగణించాలి

భారత్‌లో గ్యాస్ ధర నిర్ణయంపై ఎస్‌అండ్‌పీ సూచన
 

న్యూఢిల్లీ: గ్యాస్ రేటును నిర్ణయించ డంలో పుష్కలంగా నిల్వలున్న దేశాలను కాకుండా, తక్కువ నిల్వలుండి దిగుమతి చేసుకునే దేశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని భారత్‌కు రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) సూచించింది. లేకపోతే  ధర గిట్టుబాటు కాక... ఇంధన అన్వేషణ కార్యకలాపాల కంపెనీలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం కష్టమని తెలియజేసింది. గ్యాస్ నిల్వలున్న దేశాల్లో రేట్ల ఆధారంగా ఇటీవలే భారత్ సహజ వాయువు రేటును యూనిట్‌కు 18 శాతం మేర కోత పెట్టి 4.24 డాలర్లకు తగ్గించిన నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.

 ప్రస్తుతం ఎగుమతి దేశాల సగటు ప్రకారం..
 ప్రస్తుతం మిగులు సహజ వాయువు, మెరుగైన గ్యాస్ రవాణా మౌలిక సదుపాయాలు ఉన్న అమెరికా, కెనడా తదితర దేశాల్లో ధరల ఆధారంగా దేశీయంగా రేట్లను నిర్ణయిస్తున్నారు. అయితే, ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పత్తి చాలా తక్కువ కాగా, రవాణా మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని... ఇలాంటి పరిస్థితుల్లో సదరు దేశాలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూసినా భారత్‌లో గ్యాస్ రేట్లు తక్కువగానే ఉన్నాయని, థాయ్‌ల్యాండ్, ఇండొనేషియాలో యూనిట్ ధర సగటున 8-10 డాలర్ల మేర ఉందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అటు రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి కూడా పెద్దగా స్పందన లభించకపోవచ్చని కూడా తెలియజేసింది. మరోవైపు, గ్యాస్ ధరలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ ఆదాయం రూ. 1,080-1,150 కోట్లు, ఆయిల్ ఇండియాకు రూ. 120-130 కోట్ల మేర తగ్గవచ్చని మరో రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement