శ్రీరామసాగరం చుట్టొద్దామా.. | Tourist Place as sriram sagar | Sakshi
Sakshi News home page

శ్రీరామసాగరం చుట్టొద్దామా..

Published Wed, Apr 20 2016 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

శ్రీరామసాగరం చుట్టొద్దామా..

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగానూ విలసిల్లుతోంది. ప్రాజెక్టుతోపాటు దిగువన పార్క్, జల విద్యుదుత్పత్తి కేంద్రం, పలు ఆలయాలు ఉన్నారుు. వాటిని చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు.
- బాల్కొండ
 
ప్రాజెక్ట్ చరిత్ర..
18 లక్షల ఎకరాలకు సాగునీరు, 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి, చేపల పెంపకం లక్ష్యాలుగా శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 1963 జూలై 26 న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1,091 అడుగుల నీటిమట్టంతో(112 టీఎంసీల నీటి సామర్థ్యంతో ) 175 చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మ స్థానానికి 326 మైళ్ల దూరంలో సముద్ర మట్టానికి ప్లస్ 980 అడుగుల ఎత్తులో పోచంపాడ్ వద్ద ప్రాజెక్టు నిర్మించారు.

35,425 చదరపు మైళ్ల క్యాచ్‌మెంట్ ఏరియాతో 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్ట్ డ్యాం డిజైన్ చేశారు. 50 అడుగుల వె డల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లున్నాయి. ప్రాజెక్ట్ నుంచి పూడిక పోవడానికి ఆరు రివర్స్ స్లూయీస్ గేట్లు నిర్మించారు. 1981లో జాతికి అంకితం చేశారు.
 
చూడదగ్గ ప్రదేశాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు నదీ తీరాన ఉన్న శ్రీరామ లింగేశ్వరస్వామి ఆలయూన్ని దర్శించుకోవచ్చు. ప్రాజెక్ట్ ఆనకట్టపై నిర్మించిన జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహం ఆకట్టుకుంటోంది. ప్రాజెక్ట్ మిగులు జలాలను గోదావరిలోకి వదలడానికి నిర్మించిన 42 వరద గేట్లు, ప్రాజెక్ట్ దిగువన ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రం, గార్డెన్‌లను తిలకించవచ్చు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న పార్కులో సేదతీరవచ్చు.

వర్షాకాలంలో సరైన వర్షాలు కురిసి, ఎగువ ప్రాంతాలనుంచి వరద నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. అప్పుడు నీటిని దిగువకు వదులుతారు. ఆ సమయంలో గోదావరి పరవళ్లను తిలకించడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వర్షాకాంలో ప్రతిరోజువేల సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ వద్ద బోటు షికారు అందుబాటులో ఉంటుంది.
 
ఎలా వెళ్లాలి
జిల్లా కేంద్రం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో పోచంపాడ్ కూడలి ఉంది. ఇక్కడినుంచి 3 కిలోమీటర్ల దూరంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు పోచంపాడ్ కూడలి మీదుగానే వెళ్తుంది. కూడలి నుంచి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement