నల్లమలకు పర్యాటక శోభ | Tourist charm to nallamala | Sakshi
Sakshi News home page

నల్లమలకు పర్యాటక శోభ

Published Wed, Nov 29 2017 3:09 AM | Last Updated on Wed, Nov 29 2017 4:52 AM

Tourist charm to nallamala  - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌ :  నల్లమలకు పర్యాటక శోభ సంతరించుకుంది. రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పురాతన ఆలయాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీశైలం క్షేత్రానికి ముఖద్వారంగా భావించే ఉమా మహేశ్వర క్షేత్రానికి పర్యాటకంగా మెరుగులు అద్దుతున్నారు.

జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశం సోమశిలలోని జ్యోతిర్లింగాల ఆలయాలను అభివృద్ధి పర్చడంతోపాటు ఇక్కడ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రత్యేకంగా బోట్లు, కాటేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఇంకా హరి, కేశవుల ప్రతిరూపంగా భావించే సింగవట్నం లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయాన్ని పర్యాటకశాఖ అభివృద్ధి పరుస్తోంది.  ఆలయ ఆవరణలోని శ్రీవారి సముద్రాన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరుస్తోంది. రత్నగర్భ లక్ష్మీదేవి కొలువైన రత్నగిరి కొండను పర్యాటకుల సౌకర్యార్థం సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

ఆకట్టుకుంటున్న వ్యూ పాయింట్లు
 సలేశ్వరం వ్యూ పాయింట్‌కు వెళ్లేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సఫారీ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇక్కడికి వెళ్లాలంటే టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ గుండా ప్రయాణించాల్సి ఉండటంతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు ఉంటాయి. ఈ సందర్భంగా పర్యాటకులకు అటవీ వన్యమృగాలు కనువిందు చేస్తాయి. జింకలు, దుప్పులు, అడవి కోళ్లు, కోతులు, నెమళ్లు, రకరకాల పక్షులతోపాటు చిరుతలు, పెద్ద పులులు దర్శనమిస్తుంటాయి.

ఈగలపెంట వద్ద రోప్‌వే..
దట్టమైన అభయారణ్యంలో ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ఉంది. ఇక్కడి నుంచి నల్లమలలోని అటవీ అందాలు, వన్య మృగాల సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. దీనిని కాళ్ల కింద నుంచే డీప్‌ (లోతును) అందాలను చూసేందుకు ప్రత్యేక లిఫ్ట్‌ మాదిరి యంత్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీని మాదిరిగానే అక్కమ్మదేవి గృహాల సమీపంలో మరో వ్యూ పాయింట్, వాచ్‌టవర్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు.

శ్రీశైలం డ్యాం సమీపంలో కృష్ణానదిలోకి దిగేందుకు ఈగలపెంట వద్ద రోప్‌వే ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రోప్‌వే ఏర్పాటుతో పాతాళగంగను చేరేందుకు దాదాపు 20 కి.మీ దూరం తగ్గుతుంది. డ్యాం చుట్టు కాకుండా నేరుగా పాతాళగంగా నుంచి శ్రీశైలం వెళ్లొచ్చు. తద్వారా శ్రీశైలం మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు దోమలపెంట, ఈగలపెంటలో విడిది చేసి రద్దీ తగ్గాక వెళ్లేందుకు వెసులుబాటు లభిస్తుంది. అటవీశాఖ అనుమతులు రాగానే రోప్‌వే పనులు ప్రారంభిస్తారు.
 

పర్యాటకులకు బస్సులు
ఫర్హాబాద్‌ నుంచి అమ్రాబాద్‌ పులుల అభయారణ్య సంరక్ష కేంద్రంలో వివిధ ప్రాంతాలను పర్యాటకులు తిలకించేందుకు ఇప్పటికే రెండు బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కొకరికి రూ.100 చార్జీ చొప్పున తీసుకుని రెండుగంటలు అడవి అందాలను చూసే అవకాశాన్ని కల్పించారు. పర్యాటకుల రద్దీని బట్టి మరో 2 బస్సు లు కొనుగోలు చేయనున్నారు.

ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌కు అపూర్వ స్పందన
3ఇటీవల పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంటకు 12 కిలోమీటర్ల దూరంలో ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌ ఏర్పాటు చేశారు. కృష్ణానది మూడు పాయలుగా ఇక్కడ నల్లమల కొండలను చీలుస్తూ ప్రవహించే దృశ్యం వీక్షించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశారు.

ఇక్కడికి వెళ్లాలంటే కూడా అటవీ శాఖ అధికారుల బందోబస్తు ఏర్పాట్ల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. నల్లమల అడవిలో ప్రయాణించడం, పారే జలపాతాలు, కిలకిలరావాలు చేసే పక్షుల సందడి మధ్య వ్యూ పాయింట్‌కు చేరుకోవడం పర్యాటకులకు తెలియని అనుభూతిని కలిగిస్తుంది. ఇక నల్లమల అటవీ ప్రాంతంలోని పలు చోట్ల రోప్‌వేల నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎత్తయిన జలపాతమైన మల్లెలతీర్థాన్ని చేరుకునేందుకు మెట్ల దారి ఏర్పాటు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement