అయ్యా.. పింఛన్ since from Two months no pensions | Sakshi
Sakshi News home page

అయ్యా.. పింఛన్

Published Fri, May 9 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

since from Two months no pensions

వృద్ధులు, వికలాంగులకు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులే ఆసరా. మందుగోళీలకు, తిండికి ఎంతోకొంత వెసులుబాటు కలుగు తోంది. అలాంటిది రెండునెలలుగా కొందరికి పింఛన్ అందడం లేదు. సాంకేతిక కారణాల సాకుతో పంపిణీ నిలిపివేశారు. డబ్బుల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
 
 మానకొండూర్, న్యూస్‌లైన్ : పలువురికి ఆసరా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం నెలనెలా పింఛన్లు పంపిణీ చేస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీతకార్మిక, అభయహస్తం తదితర పథకాల కింద పింఛన్లు అందిస్తున్నారు. విభాగాన్ని బట్టి డబ్బులు ఇస్తున్నారు. ఎన్‌రోల్‌మెంట్(నమోదు) లేని లబ్ధిదారులకు డబ్బుల పంపిణీని అధికారులు ఏప్రిల్ నుంచి నిలిపేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.కోటికిపైగా డబ్బులు పంపిణీ కాలేదు. ఉదాహరణకు మానకొండూర్ మండలంలో మార్చి నెలలో 8,973 మందికి వివిధ రకాల పింఛన్లు పంపిణీ చేయగా ఏప్రిల్‌లో 7,930 మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఎన్‌రోల్‌మెంట్ కాని 1043 మందికి నిలిపివేశారు. బెజ్జంకి మండలంలోనూ ఏప్రిల్ నెలలో 400 మందికి పింఛన్ అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీలోగా అందే డబ్బులు అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ డబ్బులే వారి జీవనోపాధికి ఊరటనిస్తుండగా, డబ్బుల నిలిపివేతతో కొన్ని కుటుంబాల్లో పూటగడవని పరిస్థితులు ఉన్నాయి. ఫొటో దిగని కారణంగా ఎన్‌రోల్‌మెంట్ కాలేదని, జాబితాలో పేరున్నా... ప్రభుత్వం నుంచి డబ్బు రాలేదని ఫినో సిబ్బంది చెబుతుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. కొన్ని చోట్ల ఫినో సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
 
 కొనసాగుతున్న ఎన్‌రోల్‌మెంట్
 జిల్లాలో పింఛన్ల పంపిణీని వేర్వేరు సంస్థలకు అప్పగించారు. ఫినో ప్రైవేట్ సంస్థ 814 గ్రామాల్లో పింఛన్లు పంచుతుండగా, మణిపాల్ టెక్నాలజీ సంస్థ 280 గ్రామాల్లో పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.8 కోట్ల మేర పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పింఛన్‌ల పంపిణీకి ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరి కావడంతో ఎన్‌రోల్‌మెంట్ చేయించుకోనివారికి పింఛన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రూ.కోటికి పైగా డబ్బుల పంపిణీ నిలిచిపోయింది. పంపిణీ సంస్థలు సిబ్బందిని నియమించి గ్రామాల్లో లబ్ధిదారుల ఫొటోలు తీస్తూ ఎన్‌రోల్‌మెంట్ చేయిస్తున్నాయి.
 
 లబ్ధిదారులు సహకరించి త్వరగా ఫొటోలు దిగితే ఎన్‌రోల్‌మెంట్ పూర్తయి పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మొత్తం పింఛన్ డబ్బులు వస్తాయని పేర్కొంటున్నారు. అయినా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌రోల్‌మెంట్ లేక పింఛన్ డబ్బులు పొందినవారి పేర్లు జాబితాలో ఉండడం లేదని అన్నారం గ్రామానికి చెందిన తాటిపాముల వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు త్వరగా ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేసి డబ్బులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 
 మూడు నెలలాయె..
 ఎప్పుడు ఫస్ట్ తారీఖు తర్వాత డబ్బులు వచ్చేటియి. ఇప్పుడు మూడు నెలలైనా పింఛన్ డబ్బులు ఇస్తలేరు. లిస్టులో పేరుంది. కానీ, నువ్వు ఫొటో దిగలే, అందుకే పింఛన్ డబ్బులు ఇస్తలేం అన్నరు. ఆ డబ్బులు నాకు ఎంతో అక్కరకు వస్తుండే. డబ్బులు లేక ఇబ్బందిగా ఉంటోంది. డబ్బులు ఇచ్చుకుంట కూడా ఫొటోలు దించచ్చు కదా... ఆపుడెందుకు? మాలాంటోళ్లకు ఎంత గోసైతది.
 - బీమనపెల్లి వెంకటయ్య (అన్నారం)
 
 ఇబ్బందైతంది
 నా భర్త శివరాజం చచ్చిపోయిండు. నాకు వితంతు పింఛిన్ మంజూరైంది. నెలనెలా పింఛన్ డబ్బులు వచ్చినయ్. ఈ నెల డబ్బులు రాలేదు. సార్లను అడిగితే ఫొటో దిగాలె... అందుకే డబ్బులు రాలేదు అని చెప్పిండ్రు. ఫొటో దించేందుకు సార్లు ఇంతకుముందు వచ్చినప్పుడు నేను పొరుగూరికి వెళ్లిన. మళ్లీ ఫొటో దిగుతున్నరని తెలిస్తే వచ్చిన. పింఛన్ డబ్బులు రాకపోతే ఇబ్బంది అయితంది.
 -దాసరి ల క్ష్మి (అన్నారం)
 

Advertisement
 
Advertisement
 
Advertisement