అన్నరాయుని చెరువును రక్షించండి | Save Annarayani Cheruvu | Sakshi
Sakshi News home page

అన్నరాయుని చెరువును రక్షించండి

Published Tue, Jun 18 2019 2:00 PM | Last Updated on Tue, Jun 18 2019 2:00 PM

Save Annarayani Cheruvu - Sakshi

సాక్షి, కీసర: అన్నరాయుని చెరువును పరిరక్షించాలని నాగారం మున్సిపాలిటీలోని పలు కాలనీల వాసులు, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన మురుగునీటి పైపును మళ్లించాలని కోరారు. నాగారంలోని అన్నరాయుని చెరువును ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మిషన్‌ కాకతీయ రెండో విడతలో భాగంగా పూడికతీత పనులకు ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. సుందరీకరణ పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. మామిడాల ప్రశాంత్‌, కె. సుధాకర్‌రెడ్డి, ఎ. శంకర్‌రెడ్డి, కె. శ్రీధర్‌, పి. వీరేశం, బి. రామకృష్ణ, వెంకట్‌ బోగి, ప్రవీణ్‌కుమార్‌, అమరేందర్‌ రెడ్డి తదితరులు ప్రజావాణికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. (అన్నరాయని చెరువు పరిరక్షణ ర్యాలీ)

ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు
అన్నరాయుని చెరువును కాపాడుకునేందుకు నాగారం మున్సిపాలిటీ వాసులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హ్యుమానిటీ సంస్థ ప్రతినిధులతో కలిసి చెరువులోని ప్లాస్టిక్‌ వ్యర్థ్యాలను తొలగించారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వృద్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కృష్ణమాచార్యులు, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్‌, రాకేశ్‌, సుబ్రహ్మణ్యం తదితరులు స్వయంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎత్తిపోశారు. పర్యావరణ స్పృహ ఉన్నవారు ఎవరైనా చెరువు రక్షణకు స్వచ్ఛందంగా తరలి రావాలని నాగారం వాసులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement