సేద్యానికి భారీ బడ్జెట్ రూ.3,500 కోట్లతో ప్రతిపాదనలు | Rs 3,500 crore to irrigate huge budget proposals | Sakshi
Sakshi News home page

సేద్యానికి భారీ బడ్జెట్ రూ.3,500 కోట్లతో ప్రతిపాదనలు

Published Tue, Aug 12 2014 2:15 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Rs 3,500 crore to irrigate huge budget proposals

సాక్షి, హైదరాబాద్: ఈ సారి బడ్జెట్లో వ్యవసాయరంగానికి సుమారు రూ. 3,500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ విన్నవించింది. బడ్జెట్లో సూక్ష్మ సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనోత్పత్తి, గ్రీన్‌హౌస్‌లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ బి.జనార్దన్‌రెడిలు పాల్గొన్నారు. రైతు ప్రభుత్వం కనుక గతం కంటే ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి అధికనిధులు కేటాయించాలనికోరారు.
 
 దీనికి ఆర్థికశాఖ కూడా సమ్మతించినట్టు తెలిసింది. రూ. 800 కోట్ల మేర ప్రణాళికేతర బడ్జెట్ కాగా, మిగిలినది ప్రణాళిక బడ్జెట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈసారి సూక్ష్మసేద్యానికి రూ. 500 కోట్లు కేటాయించాలని కోరారు. కేంద్రం ఈసేద్యానికి సబ్సిడీ తగ్గించడంతో రాష్ట్రం ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉందన్నారు.  యాంత్రీకరణకు రూ. 200 కోట్లు, విత్తనోత్పత్తికి రూ. 50 కోట్లు ఇవ్వాలని కోరారు. 300 ఎకరాల్లో గ్రీన్‌హౌసెస్ కోసం రూ. 134 కోట్లు కోరారు. ఒక్కో ఎకరా గ్రీన్‌హౌజ్‌కు రూ. 40 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. మండలాల్లో వ్యవసాయశాఖకు భవనాలు నిర్మించడానికి నిధులు కోరారు. ఒక్కో భవనానికి రూ. 10 లక్షల చొప్పున సుమారు 500 భవనాలకు నిధులు కోరారు. మండల వ్యవసాయాధికారుల అద్దె వాహనాలకోసం రూ. 15 కోట్లు కోరారు. అలాగే, వ్యవసాయశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement