కొండగట్టు ప్రమాదం: ఆగని కన్నీళ్లు | Pooja Done At Kondagattu Accident Spot Bus Swamy Paripoornananda | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 27 2018 7:53 AM | Last Updated on Thu, Sep 27 2018 9:46 AM

Pooja Done At Kondagattu Accident Spot Bus Swamy Paripoornananda - Sakshi

జగిత్యాలజోన్‌/కొండగట్టు/ధర్మపురి: ప్రజలు సుభిక్షంగా ఉండాలనే నారాయణ బలిహోమం నిర్వహిస్తున్నట్లు  శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడి 62మంది చనిపోయిన కొండగట్టు ఘాట్‌రోడ్డు ఆవరణలో బుధవారం నారాయణ బలి శాంతిహోమం నిర్వహించారు. కార్యక్రమానికి కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల నుంచి మృతుల కుటుంబాలు భారీగా తరలివచ్చారు. ఘటనాప్రదేశాన్ని చూసి, వారి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందాస్వామి మాట్లాడుతూ.. దేశంలోనే కొండగట్టు బస్సు ప్రమాదం ఘోరమైందన్నారు. ప్రమాదంలో మరణించిన వారిని తీసుకురాలేమని, ఉన్నవారికి మంచి జరగాలనే ఉద్దేశంతో నారాయణబలిహోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ హోమం ద్వారా ప్రేతాత్మకు విముక్తి, ఆత్మశాంతి కలుగాలని కోరుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంఘటన స్థలం వద్ద శాస్త్రోత్తకంగా పిండ ప్రదానం చేసి వాటిని ధర్మపురి గోదావరిలో కలుపుతారని వెల్లడించారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలకు ఉచిత వసతి, విద్యను అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలుర కోసం వాల్మీకి అవాసం, బాలికల కోసం భగిని నివేదిత అవాసాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాను సాయం అందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైదికులు డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శర్మ, కరీంనగర్, జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు బండి సంజయ్, ముదుగంటి రవీందర్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వెంకట్‌ రాజ్‌ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ చాలక్‌లు డాక్టర్‌ శంకర్, డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

కన్నీరు.. మున్నీరు.. 
కొండగట్టు ప్రమాద ఘటనాస్థలానికి భారీగా మృతుల కటుంబసభ్యులు వచ్చారు. ఎవరి మోహంలో నిరునవ్వు లేదు. కన్నీరు ఆగడం లేదు. ఘటనాస్థలాన్ని చూసిన వారు తమ వారిని గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ముందుగా పండితులు మృతుల కుటుంబసభ్యులపై గోదావరి పుణ్యతీర్థం చల్లారు. అనంతరం హోమం, పూజలు, సామూహిక పిండాలు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడే అన్నదానం నిర్వహించారు.  

పంచభూతాల పరిరక్షణతో క్షేమం..
పకృతిని ఆరాధిస్తూ పంచభూతాలను పరిరక్షించడం ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. కొండగట్టు మృతుల పిండాలను ధర్మపురి గోదావరిలో కలిపారు. అనంతరం ఆర్‌అండ్‌బీ వసతిగృహంలో మాట్లాడారు. ధర్మపురిలో సాక్ష్యాత్తు భగవంతుని సొమ్ముకే రక్షణ లేకపోవడంతో శోచనీయం అన్నారు. ధర్మపురి పవిత్ర గోదావరిలో కొంతకాలంగా  డ్రయినేజీ నీరుకలుస్తూ కాలుష్య కోరల్లో చిక్కుకోగా దీన్ని నివారించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. పంచభూతాల్ని పవిత్రంగా  కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఘాట్‌రోడ్‌ ప్రమాదంపై మరో బస్సుతో పరిశీలన
ఘాట్‌రోడ్‌పై బస్సు ప్రమాదంపై అధికారులు కదిలారు. ఈ ఘటనపై రాష్ట్ర రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ ఇప్పటికే మూడుసార్లు కొండగట్టు చేరుకుని అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. దీంతో స్థానిక అధికారుల్లోనూ కదలిక వచ్చింది. మరోవైపు బుధవారం నల్గొండ జిల్లా ఆర్‌ఎం విజయ్‌కుమార్‌ ఘటనస్థలానికి వచ్చి ఘాట్‌రోడ్‌పై ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు సేకరించారు. మరో ఆర్టీసీ బస్సును కొండపై నుంచి కిందకు తీసుకొచ్చారు. వచ్చేక్రమంలో ఘాట్‌రోడ్‌ స్పీడ్‌ బ్రేకర్ల వల్ల ప్రమాదం జరిగిందా..? టర్నింగ్‌లతోనా.. ? ప్రమాద సమయంలో బస్సు స్పీడు ఎంత ఉంది.. ? ఎంత స్పీడులో ఈ ప్రమాదం జరిగింది.. ? ఆ సమయంలో బ్రేకులు ఫెయిలయ్యాయా...? అని అనేక కోణాల్లో పరిశీలించారు. ప్రమాద సమయంలో ధ్వంసమైన  రెయిలింగ్‌తోపాటు ప్రమాదకరలోయనూ పరిశీలించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement