ప్రతి పనికీ మనీ మనీ..! | Lavanya Victims Holds Protest At Keshampet MRO Office | Sakshi
Sakshi News home page

ప్రతి పనికీ మనీ మనీ..!

Published Sat, Jul 13 2019 2:34 AM | Last Updated on Sat, Jul 13 2019 5:03 AM

Lavanya Victims Holds Protest At Keshampet MRO Office - Sakshi

కేశంపేట : రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య బాధితులు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. తహసీల్దార్‌ లావణ్యకు ఎంత సమర్పించుకున్నారో చెప్పారు. ప్రతి పనికీ రేటును ఫిక్స్‌ చేసి వసూలు చేశారని పలువురు రైతులు ఆరోపించారు. రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలంటే తహసీల్దార్‌కుగానీ, తన ఏజెంట్లకుగానీ డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని, మీడియాకు తెలిపితే తమ సమస్యలను మరింత జటిలం చేస్తుందనే తాము ఎవరికీ చెప్పలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
కార్యాలయంపై దాడి.. 
కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రైతులు బయటే గుమిగూడారు. అదే సమయంలో వచ్చిన సర్వేయర్‌ నాగేశ్‌ కాళ్ళు మొక్కి తమకు ఇవ్వాల్సిన రిపోర్టులను అందజేయాలని రైతులు కోరారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు సర్వేయర్‌ను నిలదీశారు. టేబుల్, కుర్చీలను ఎత్తి పడేశారు. సకాలంలో పోలీసులు స్పందించి రైతులను సముదాయించి బయటకు పంపించారు.
 
కలెక్టర్‌ రావాలి...
గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని భూరికార్డులను మాయం చేసిన లీలలు తెలవాలంటే కలెక్టర్‌ కేశంపేటకు రావాలని రైతులు డిమాండ్‌ చేశారు. మండలంలో జరిగిన అవినీతిపై కలెక్టర్‌ విచారణ జరిపించాలన్నారు.


సర్వేయర్‌ కాళ్లు మొక్కుతున్న బాధితురాలు 
 
మళ్లీ ఏసీబీ తనిఖీలు  
కేశంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మళ్లీ తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ లావణ్య, వీఆర్వో అనంతయ్య రైతు వద్ద నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కేశంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు.

రూ. 50 వేలు ఇస్తేనే కాస్తు.. 
కేశంపేట శివారులోని సర్వే నంబర్‌ 223లో రెండు ఎకరాల భూమిని 1991లో సాదాబైనామాగా తలకొండపల్లి మండలంలోని రామకృష్ణపురం గ్రామానికి చెందిన శేరిల వెకటయ్య వద్ద కొనుగోలు చేశామని భారతమ్మ అనే మహిళా రైతు తెలిపారు. అప్పటి నుంచి కబ్జాలో ఉన్నామని, దానికి కాస్తు రాయాలని వీఆర్వో అనంతయ్యను కోరగా రూ.50 వేలు డిమాండ్‌ చేశారని చెప్పారు. తప్పనిపరిస్థితుల్లో డబ్బులిచ్చి కాస్తు రాయించుకున్నామన్నారు. గత సంవత్సరం మళ్లీ కాస్తు రాయాలని కోరగా లక్ష రూపాయలు ఇవ్వాలని వీఆర్వో కోరారని, తహసీల్దార్‌ను సంప్రదిస్తే అనంతయ్య చెప్పినట్టు లక్ష రూపాయలు ఇసైనే కాస్తు రాస్తామన్నారని భారతమ్మ ఆరోపించారు. తాము డబ్బులు ఇవ్వకపోవడంతో శేరిల వెంకటయ్య పేరును అన్‌లైన్‌లో చేర్చారని తెలిపారు. దీంతో అతను ఆ భూమిని విక్రయించాడని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement