ఆగని కన్నీళ్లు..! | Kondagattu RTC Bus Accident In Karimnagar | Sakshi
Sakshi News home page

ఆగని కన్నీళ్లు..!

Published Sat, Sep 15 2018 2:44 PM | Last Updated on Sat, Sep 15 2018 2:44 PM

Kondagattu RTC Bus Accident In Karimnagar - Sakshi

చితి మంటలు ఆరలేదు.. కన్నీటి ధారలు ఆగలేదు.. ‘కొండగట్టు’ పల్లెల్లో కొడిగట్టిన విషాదం కొండంత శోకాన్ని మూటకట్టింది. ప్రమాదం జరిగి మూడురోజులు గడిచినా.. ఆ పల్లెల్లో విషాదం వీడలేదు. ఎవరినీ కదిలించినా కన్నీళ్లే. పచ్చని పొలాలు.. పాడి పంట.. కులవృత్తులు.. ఏ ఇంటి పెరడి చూసినా నిండాకాసిన కూరగాయలు. పాలు అమ్ముకుని కొందరు, పనికిపోయి ఇంకొందరు ఇలా.. ఏ గడప చూసినా.. పట్టెడన్నం తిని చల్లగా బతికిన ఊర్లవి. ‘కొండం’త అభివృద్ధి, సింగారించుకున్న ప్రజా జీవన సౌందర్యం ఆయా గ్రామాలకే సొంతం. ఇదంతా నాలుగు రోజుల కిందటి ముచ్చట. ఇప్పుడా పల్లెలు కళతప్పాయి.

ఏ ఊరు చూసినా పెనువిషాదమే.. ఏ ఇళ్లు చూసినా విషాదఛాయలే.. ఏ గుండె తట్టినా కన్నీటిధారలే.. వెక్కివెక్కి ఏడ్చిన పల్లెజనం కళ్లలో నీళ్లూ ఇంకిపోయాయి. అయినా.. ఏడుపు ఇంకా మిగిలే ఉంది. తల్లికోసం బిడ్డ.. బిడ్డ కోసం తల్లిదండ్రులు.. భర్తను గుర్తుచేసుకుని భార్య.. భార్యను మరవలేని భర్త.. పని కోసం బయటికి వెళ్లి, తిరిగిరాని తోడుకోడళ్లు. అంతులేని విషాదం ఆ ఊళ్లలో చోటు చేసుకోగా.. ఇప్పుడా గ్రామాలు గణేష్‌ ఉత్సవాలకు కూడా దూరంగా ఉన్నాయి. ఎక్కడా చూసినా సిద్ధమైన మండపాలు.. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో వినాయకుడి విగ్రహాలు.. ఊహించిన ఘటనతో విషాదం నిండిన ఆ పల్లెలు వినాయక ఉత్సవాలను జరుపుకోవడం లేదు. కొండగట్టు పల్లెల నుంచి ‘సాక్షి’కథనం..      

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/సాక్షి జగిత్యాల: చిన్నా, పెద్ద, స్త్రీ, పురుషుల వయోభేదం లేకుండా కన్నుల పండుగలా జరుపుకునే గణేష్‌ నవరాత్రోత్రి ఉత్సవాల కళ ఆ గ్రామాల్లో తప్పింది. శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లె, రాంసాగర్‌లో ఏర్పాటు చేసి న గణేష్‌ మండపాలు వెలవెలబోతున్నాయి. ఈనె ల 11న కొండగట్టు ఘాట్‌రోడ్‌పై నుంచి లోయలో పడిన ప్రమాదంలో 62మంది మరణించిన సం గతి తెలిసింది. ఈ గ్రామాలకు చెందిన 43 మంది కొండగట్టు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు, విద్యార్థులు ఉన్నారు. ఈ పల్లెల్లో ఏ వాడ, ఏ గల్లికి, ఏ ఇంటి తలుపు తట్టినా ఆ విషాదకరమైన సంఘటననే తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.  కేవలం మృతుల కుటుంబాల్లోనే కా దు.. గ్రామస్తులందరిలోనూ నిస్తేజం.

పదేళ్ల చి న్నారి నుంచి పండు ముసలి వరకు ఎవర్ని తట్టినా గుండెచెరువే.. అందరి కళ్లలోనూ ఇదే విషాదం. నిన్నటివరకు ఆ దారి గుండా అంజన్న చెంతకు వెళ్లాలనుకున్న భక్తులు ఇప్పుడు ఆ మార్గమంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం డీజి ల్‌ పొదుపు.. లాభాపేక్ష ఆ ఊళ్లను వల్లకాడుగా మార్చింది. మృతులపై ఆధారపడ్డ కుటుంబాలను ఛిద్రం చేసింది. పిల్లలపై తల్లిదండ్రులు.. తల్లిదండ్రులపై ఒకరికొకరు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. గణేష్‌ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోలేక గణేష్‌ ఉత్సవాలకు దూరంగా ఉంటూ.. వాళ్ల బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక విషాదవదనంతో ఉన్నారు.

మండపాలు ఎక్కని గణేష్‌ విగ్రహాలు.. పండుగకు దూరంగా పల్లెలు
హిమ్మత్‌రావుపేటలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ముందుగానే యూత్‌ సంఘాలు, కుల సంఘాలు గ్రామాలకు చెందినవారు మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు డబ్బులు చెల్లించి విగ్రహాలను కూడా తెచ్చుకున్నారు. కానీ ఇంతలోనే కొండగట్టు ప్రమాదం రూపేణా ఆ ఊరికి చెందిన 10 మందిని కబళించింది. మొత్తం మృతుల్లో 60 మంది ఉంటే ఈ ఒక్క గ్రామానికి చెందిన వారే 10 మంది. దీంతో ఆ విగ్రహాలను గ్రామపంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో పెట్టి ఆ తర్వాత మండపాలకు పరిస్థితి లేకపోయింది.

ఎందుకంటే ఈ ఊరిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది కూడా నిత్యం గ్రామస్తులతో ఐక్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్లే. నిన్నమొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వాళ్లు నిత్యం మాట్లాడిన వాళ్లు లేకపోవడం ఆ బాధను తట్టుకోలేక ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పండగ జరుపులేక గ్రామాలు కళ తప్పాయి. ప్రతి సంవత్సరం గణేష్‌ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే కన్నుల పండువగా జరుపుకునే ఈ పండుగను ఈసారి జరుపుకోలేని పరిస్థితి. అలాగే శనివారంపేట, డబ్బు తిమ్మాయిపల్లె, రాంసాగర్‌లలోను ఈసారి గణేష్‌ నవరాత్రులను నిర్వహించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

గ్రామ పంచాయతీ భవనంలోనే వినాయకుని విగ్రహం

Advertisement
 
Advertisement
 
Advertisement