ఎన్నారై పాలసీకి ఈ బడ్జెట్‌ తొలిమెట్టు | Hundred Crore For NRI Cell In Telangana State Budget | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లు..

Published Sat, Mar 17 2018 9:28 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Hundred Crore For NRI Cell In Telangana State Budget - Sakshi

(నిజామాబాద్‌ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.100 కోట్లు ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు కేటాయించింది. తొలిసారిగా ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఈ నిధుల వినియోగంపై విధి విధానాలు వెల్లడించ లేదు. సాధారణ పరిపాలన శాఖలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఒక విభాగంలా ఉంది. ఇప్పటివరకు ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక శాఖ అంటూ ఏమీ లేదు. కేవలం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ మాత్రమే ఉంది. ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు తొలిసారి రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని ప్రవాస భారతీయులు స్వాగతిస్తున్నారు. కానీ ఈ నిధుల వినియోగంపై స్పష్టత లేక పోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ఈ నిధులను ఏ విధంగా వినియోగిస్తారో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది.

ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అన్ని దేశాల్లోని ప్రవాస భారతీయుల కోసం పనిచేస్తుంది. అయితే తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్‌ దేశాలకు వలసపోతున్నారు. ఆ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎంతో మంది సరైన జీతం పొందలేకపోవడంతో పాటు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.    తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రమాదాల్లో,  అనారోగ్యం వల్ల మరణిస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.100 కోట్ల నిధుల నుంచి గల్ఫ్‌ వలస కార్మికుల సంక్షేమానికి ఎంతమేరకు ఖర్చు చేస్తుందో వెల్లడి కావాల్సి ఉంది. 2014కు ముందు గల్ఫ్‌ దేశాల్లో వివిధ కారణాల వల్ల మరణించిన వారి సంఖ్య వెయ్యి ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మరణించిన వారి సంఖ్య 600 వరకు ఉంది. ఈ బాధిత కుటుంబాలకు ఈ బడ్జెట్‌ నుంచి ఎంత మేరకు సహాయం అందిస్తారో వివరంగా ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది.

ఎన్నారై పాలసీకి ఈ బడ్జెట్‌ తొలిమెట్టు
2016 జులై 27న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నారై పాలసీ మీటింగ్‌కు నేను హాజరయ్యాను. చాలా మంది ప్రవాస భారతీయులం ఎన్నో సలహాలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేశాము. ప్రభుత్వానికి స్పష్టమైన ప్రవాసీ విధానం ఉంటే సంక్షేమంతోపాటు, అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఈ బడ్జెట్‌లో ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించడం సంతోషకరం. రాబోయే ఎన్నారై పాలసీకి ఈ బడ్జెట్‌ తొలిమెట్టు. నేను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నారై మంత్రి కేటీఆర్‌లను కలిసి గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించాను. వారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం త్వరలోనే ఎన్నారై పాలసీ ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం విదేశాలలోని తెలంగాణ ఎన్నారైలను గుడ్‌విల్‌ అంబాసిడర్లుగా నియమించి ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసే ఆలోచనలో ఉన్నది.  – డాక్టర్‌ మోహన్‌ గోలి, టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ అడ్వయిజరీ బోర్డు మెంబర్‌

వెయ్యి కోట్లు అనుకుంటే.. వందతో సరిపెట్టారు
ఎన్నో ఆశలతో గల్ఫ్‌ బాట పట్టిన తెలంగాణ బిడ్డలను ఆదుకోవడానికి సమగ్రమైన ప్రవాసీ విధానాన్ని ప్రవేశ పెట్టా లి. కనీసం వెయ్యి కోట్లు కేటాయిస్తారనుకుంటే కేవలం వంద కోట్లతో సరిపెట్టారు. కువైట్‌ క్షమాబిక్ష పథకంలో వలసకార్మికులకు సహాయపడడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నారై మంత్రిని, ఏపీ ఎన్నార్టీ(నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ) చైర్మన్‌ను కువైట్‌కు పంపించి వారి బాగోగులను పట్టించుకున్నది. అవసరమైనవారికి ఉచిత విమాన ప్రయాణ టికెట్లు సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఎందుకు స్పందించలేదు.       –వార్ల మృణాళిని, కువైట్‌
ఎన్‌.చంద్రశేఖర్, మోర్తాడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement