గ్రామాల్లో ప్రభుత్వాలు | huge changes in panchayati raj system, says minister ktr | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ప్రభుత్వాలు

Published Mon, Jan 19 2015 1:08 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

గ్రామాల్లో ప్రభుత్వాలు - Sakshi

పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు.. ఇందుకు కొత్తగా చట్టాన్ని తీసుకువస్తాం: కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పంచాయతీల స్థాయిలో గ్రామ ప్రభుత్వాలు ఏర్పడాలనేది దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన చట్టం రూపకల్పనకు సంబంధించిన పలు అంశాలను శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఈ కొత్త చట్టం రూపకల్పన కోసం కేరళ, కర్ణాటక రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా దీనికోసం క్షేత్రస్థాయి నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామని చెప్పారు. ప్రజల నుంచే ప్రభుత్వ విధానాలు రూపొందాలన్న ఆశయంతోనే కొత్త చట్టానికి రూపకల్పన జరగనుందని... అధికార వికేంద్రీకరణకు అసలైన అర్థం వచ్చేలా ఈ చట్టాన్ని తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు.

గ్రామ ప్రభుత్వాల కోసం..
రాష్ట్రస్థాయిలో ఉన్న ప్రభుత్వం మాదిరిగానే పంచాయతీల స్థాయిలో గ్రామ ప్రభుత్వాలు ఏర ్పడాలనేది తాము రూపొందించనున్న చట్టం అంతిమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రస్తుతం పనిచేస్తున్న 29 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకువచ్చేలా.. అన్నిశాఖలను సమన్వయ పరచాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ అధికారులు, సిబ్బంది అంతా గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నడిచే పంచాయతీలకు జవాబుదారీగా పనిచేసేలా చట్టంలో నిబంధనలను పొందుపరుస్తామని వెల్లడించారు. నూతన చట్టం రూపకల్పన నిమిత్తం కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పంచాయతీ వ్యవస్థల పనితీరు, అక్కడ అమలు చేస్తున్న విధానాలను సమగ్రంగా అధ్యయనం చే స్తున్నామన్నారు.

ట్రిబ్యునల్స్, అంబుడ్స్‌మన్ వ్యవస్థలు..
గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌లు, అంబుడ్స్‌మన్ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయని... తండాలను కూడా పంచాయతీలుగా మార్చితే ఈ సంఖ్య మరో 1,200 వరకు పెరగనుందని చెప్పారు.

పంచాయతీలకు కొత్త చట్టం రూపొందించే క్రమంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని... మహిళా సంఘాల సేవలను ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఈ కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీ వ్యవస్థలకు ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

పంచాయతీల్లో స్వయం సమృద్ధి..
గ్రామ ప్రభుత్వాల ఏర్పాటుతో పాటు పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించే విధంగా కొత్త చట్టం ఉండాలని భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ నిధులతో పాటు ప్రజలు చెల్లించిన పన్నుల వినియోగంపై పారదర్శక విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ప్రజలు పంచాయతీలకు పన్నులు చెల్లించేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చెల్లించే సొమ్ము అభివృద్ధి పనుల ద్వారా తిరిగి వారికే చేరుతుందన్న నమ్మకం కలిగిస్తేనే ఇది సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement