పీజీ మెడికల్‌లో ‘ఇన్‌ సర్వీస్‌’ రద్దు సబబే | High Court Respond To PG Medical Weightage Marks | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌లో ‘ఇన్‌ సర్వీస్‌’ రద్దు సబబే

Published Tue, Apr 10 2018 3:11 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

High Court Respond To PG Medical Weightage Marks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పీజీ మెడికల్‌ డిగ్రీ కోర్సులో ఇన్‌ సర్వీస్‌ కోటా రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. భారత వైద్య మండలి (ఎంసీఏ) నిబంధన 9(4) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వారు ఇకపై వెయిటేజీ మార్కులు మాత్రమే పొందాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఇన్‌ సర్వీస్‌ కోటా రద్దు చేసి దాని స్థానే వెయిటేజీ మార్కులిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు సబబేనని సోమవారం తీర్పు వెలువరించింది.

పీజీ మెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే రాష్ట్ర కోటా కింద ఉన్న 50 శాతం సీట్లలో రిజర్వేషన్లు పొందడానికి పిటిషనర్లు అర్హులని పేర్కొంటూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇన్‌ సర్వీస్‌లోని వైద్యులు గరిష్టంగా గిరిజన ప్రాంతాల్లో మూడేళ్ల వైద్య సేవలు అందిస్తేనే వెయిటేజీ మార్కులు పొందేందుకు అర్హులంటూ తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొన్న పేరాను హైకోర్టు తప్పుపట్టింది. జీవోలోని ఆ విభాగాన్ని ధర్మాసనం రద్దు చేస్తూ.. ఏడాది, రెండేళ్లు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వైద్యులూ పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో వెయిటేజీ మార్కులు పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement