ఎవరా ఐఏఎస్‌?  ESI Medicine scam suspecting IAS Officer Involvement | Sakshi
Sakshi News home page

ఎవరా ఐఏఎస్‌? 

Published Sun, Sep 29 2019 3:13 AM | Last Updated on Sun, Sep 29 2019 3:13 AM

ESI Medicine scam suspecting IAS Officer Involvement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల కొనుగోళ్లల్లో రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. ఈ వ్యవహారంలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హస్తం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విజిలెన్స్‌ విచారణకు ముందు సనత్‌నగర్‌లోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ కార్యాలయంలోని రికార్డు రూముల్లో లెక్కలు తారుమారు చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  కార్యాలయంలోని సీసీటీవీ ఫుటే జీని పరిశీలిస్తే మరిన్ని విష యాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. బోరబండ, పటాన్‌చెరు, చర్లపల్లి డిస్పెన్సరీల్లోనే రూ.100 కోట్లకుపైగా అవినీతి జరిగిందని సమాచారం. నాలుగేళ్లలో రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్లకుపైగా మింగేశారని  ఆరోపిస్తున్నారు.

ఎలా నడిపారంటే? 2015 నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో డైరెక్టర్‌ దేవికారాణిది కీలక పాత్ర. ఈమె నేతృత్వంలో జాయింట్‌ డైరెక్టర్‌ కలకుంట్ల పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కూరపాటి వసంత ఇందిరా, ఫార్మాసిస్ట్‌ రాధిక, సీనియర్‌ అసిస్టెంట్‌ ఒగ్గు హర్షవర్ధన్, ఆమ్ని ఫార్మాకు చెందిన చెరుకూరి నాగరాజు, కంచర్ల హరిబాబు అలియాస్‌ బాబ్జీలతో కథ నడిపారు. వాస్తవానికి మందుల కొనుగోళ్లలో నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి జీవో నంబర్‌ 51ను ప్రభుత్వం 2012లోనే విడుదల చేసింది. దాని ప్రకారం.. రిజిస్టర్డ్‌ కంపెనీల నుంచే కొనుగోళ్లు చేయాలి. రిజిస్టర్‌ కంపెనీలు అందుబాటులో లేని అత్యవసర సమయాల్లో మాత్రమే గుర్తింపులేని ప్రైవేటు కంపెనీల నుంచి కొనుక్కోవచ్చన్న వెసులుబాటు ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని జాయింట్‌ డైరెక్టర్‌ పద్మతో కలసి దేవికారాణి కథ మొత్తం నడిపింది.

నలభైకి పైగా నకిలీ కంపెనీలు దేవికా రాణికి చెందినవేనని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మొత్తం 140 కంపెనీలను అప్పటికప్పుడు సృష్టించి నకిలీ బిల్లులు పెట్టి కోట్లు డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని, ముందే ఖాళీ బిల్లులపై, ఇండెట్లపై ముందుగానే సంతకాలు చేసి ఉంచేవారు. దేవికారాణి ఎంత చెబితే అంత వేసి డబ్బు డ్రా చేసుకునేవారు. దీంతో ఈ ముఠాలోని సభ్యులంతా హైదరాబాద్‌ శివార్లలో భారీగా భూములు, అపార్ట్‌మెంట్లు, నగలు, బంగారం బిస్కెట్లు కొన్నారని సమాచారం. 

సీఎం నాకు బంధువు.. 
జాయింట్‌ డైరెక్టర్‌ కలకుంట్ల పద్మ అక్రమాలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ ఉండేదనిసిబ్బంది చెబుతున్నారు. ‘నా ఇంటి పేరు తెలుసా? సీఎం కేసీఆర్‌ది నాదీ ఒకే ఇంటిపేరు. ఆయన నాకు బంధువు’ అంటూ నేమ్‌ ప్లేట్‌ చూపించి బెదిరించేదని వాపోతున్నారు.  ఈ కుంభకోణంలో డైరెక్టర్‌ నుంచి మెడికల్‌ రిప్రంజెంటేటివ్‌ వరకు అంతా పాత్రధారులే కావడంతో కథ సాంతం సాఫీగా సాగేది. ఎక్కడైనా కొత్త సిబ్బంది వస్తే.. వారిని ప్రలోభ పెట్టడం, లేకపోతే బెదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఐఎంఎస్‌లో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ సురేంద్రనాథ్‌ ఓ డాక్టర్‌ను ఖాళీ బిల్లులపై సంతకాలు చేయాల్సిందిగా ప్రలోభపెట్టిన ఆడియో టేపులు లీకవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో దేవికారాణి ముఠా ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ను తమతో కలుపుకొన్నారని ఉద్యో గ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు భారీగా లంచం ముట్టజెప్పడంతో ఆడిట్‌ రికార్డులను చెరిపేందుకు వచ్చాడని ఆరోపిస్తున్నారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో బ్యాంకు మేనేజర్లతో పెద్ద మొత్తంలో కమీషన్‌ మాట్లాడుకుని కొత్త నోట్లు మార్చుకున్నారని సమాచారం.  

దారి మళ్లించి దండుకున్నారు! 
మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ నిధులతో మందుల కొనుగోళ్లు
బీమా వైద్య సేవల సంచాలక (డీఐఎంఎస్‌) విభాగంలో ఉన్నతాధికారుల అక్రమాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఈఎస్‌ఐ నిబంధనలకు తూట్లు పొడిచి భారీగా నిధులను స్వాహా చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. కేంద్ర ప్రభుత్వం డీఐఎంఎస్‌కు విడు దల చేసిన నిధులను నిర్దేశిత కార్యక్రమాల కోసం కాకుండా అక్రమాలకు వినియోగించిన తీరు బహిర్గతమైంది. రాష్ట్రంలో ఈఎస్‌ఐ ఖాతాదారులు 18.5 లక్షల మంది ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 58 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో సేవల లభ్యత కష్టమైనప్పుడు ఈఎస్‌ఐసీ గుర్తింపు పొందిన ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో లబ్ధిదారులు చికిత్స పొందొచ్చు. వీరికి నిబంధనల ప్రకారం ఈఎస్‌ఐసీ వైద్య ఖర్చును రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంది. ఈ రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ద్వారా  డీఐఎంఎస్‌లకు విడుదల చేస్తుంది. అక్కడ వైద్య బిల్లులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత చెల్లింపులను ఖరారు చేసి లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తుంది. ఇలా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ నిధులను క్రమం తప్పకుండా ఈఎస్‌ఐసీ విడుదల చేస్తుండగా... డీఐఎంఎస్‌ మాత్రం వీటిని దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడింది. 

ఐదేళ్లలో రూ.110 కోట్ల మళ్లింపు 
ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన ఈఎస్‌ఐ ఖాతాదారులు రీయింబర్స్‌మెంట్‌ కోసం డీఐఎంఎస్‌కు పెట్టుకున్న అర్జీల పరిశీలన, పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాదాపు ఐదేళ్లుగా వీటి చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. అత్యవసర కార్యక్రమం కింద మందుల కొనుగోలుకు మళ్లించారు. గత ఐదేళ్లలో దాదాపు 110 కోట్లను ఇలా మందులు కొనుగోలు చేయడం గమనార్హం. డీఐఎంఎస్‌లో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పెరుకుపోయాయి. దాదాపు లక్ష బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.  పెండింగ్‌ బిల్లులను పూర్తిస్థాయిలోచెల్లించాలంటే రూ.178 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement