బాదన్‌కుర్తి.. బుద్ధుడి ధాత్రి! | Emergence of the oldest bouddha stupam | Sakshi
Sakshi News home page

బాదన్‌కుర్తి.. బుద్ధుడి ధాత్రి!

Published Fri, Mar 8 2019 1:15 AM | Last Updated on Fri, Mar 8 2019 5:11 AM

Emergence of the oldest bouddha stupam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం అస్మక రాజ్యం.. ఆ రాజ్యంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న ఓ జనావాసం.. అది తెలంగాణలోనే ఉంది. అక్కడికి చేరువలో నది మధ్యలో చిన్న దీవి.. ఆ దీవిలో ఉందీ ఓ అద్భుతమైన బౌద్ధ స్థూపం.. ఇటీవలే జరిపిన తవ్వకాల్లో ఈ స్థూపం బయల్పడింది. ఇది తెలంగాణలో బయటపడ్డ అతి పురాతన స్తూపంగా చరిత్రకారులు భావిస్తున్నారు.  

బావరి గ్రామానికి సమీపంలో.. 
క్రీ.పూ.1 నుంచి 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు. విశేషమేంటంటే బుద్ధుడిని స్వయంగా కలసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించిన బావరి అనే వ్యక్తి నివసించిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్తూపం ఉంది. అంటే బుద్ధుడు సజీవంగా ఉన్నప్పుడు ఆయన బోధనలను ప్రచారం చేసిన వారి తాలూకు వ్యక్తులే వీటిని నిర్మించారని తెలుస్తోంది. గోదావరి నది మధ్యలో చిన్న దీవిలో ఉన్న ఈ స్తూపంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర బౌద్ధ నిర్మాణాలను వెలుగులోకి తెస్తే ఇది పెద్ద పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుందని చెబుతున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది. 

బౌద్ధ సాహిత్యంలో ప్రస్తావన.. 
బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే సుత్త నిపత గ్రంథంలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి దీని గురించి తెలియకపోవటంతో బౌద్ధ పర్యాటకులు ఇక్కడికి రావట్లేదు. నిర్మాణాలు వెలుగు చూసి, వాటి ప్రాధాన్యంపై ప్రచారం చేస్తే దేశవిదేశీ బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సుత్త నిపత గ్రంథంలోని పారాయణ వగ్గ చాప్టర్‌లో తెలంగాణ ప్రాంతం ప్రస్తావన ఉందని గతంలోనే నిపుణులు గుర్తించారు. ‘అస్మక రాజ్యంలో గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన వారు బుద్ధుడిని దర్శనం చేసుకుని ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించారు’అని అందులో లిఖితపూర్వకంగా ఉంది. అస్మక పరిధిలో తెలంగాణ ఉండటంతో ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో జనావాసం ఎక్కడుందా అని నిపుణులు శోధించి.. అది ఖానాపూర్‌ మండలంలోని బాదన్‌కుర్తి గ్రామంగా గుర్తించారు. ఆ గ్రామం నది చీలికలో ఉంటుంది. అక్కడ ప్రాథమికంగా తవ్వకాలు జరిపి బౌద్ధ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. కానీ వాటిపై ఓ దేవాలయం సహా వేరే నిర్మాణాలు రావటంతో ఏమీ చేయలేకపోయారు. తాజాగా దానికి చేరువలో అతి పురాతన బుద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలను గుర్తించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశంతో బుద్ధవనం అధికారి శ్యాంసుందర్, పుణేలోని డెక్కన్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీకాంత్, ఔత్సాహిక చరిత్రకారులు జితేంద్రబాబు, శ్రీరామోజు హరగోపాల్‌ తదితరులు ఇటీవల పర్యటించి వాటిని గుర్తించారు.  

►బాదన్‌కుర్తి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో బావాపూర్‌ సమీపంలో గోదావరి మధ్యలో రెండు చిన్న దీవులున్నాయి. వాటిల్లో దాదాపు 57 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఒక దీవిని పరిశీలించగా ఇవి వెలుగు చూశాయి.  
►దాదాపు 17 అడుగుల ఎత్తున మట్టి దిబ్బను పరిశీలించగా అది బౌద్ధ స్తూపమని తేలింది.
►3 అంచెలుగా ఈ స్తూపం నిర్మితమైంది. 
►ఇందులో దిగువ ఉన్న చివరి అంచె రాతి
కట్టడంగా ఉండగా, పై 2 అంచెలు పెద్ద ఇటుకలతో నిర్మితమై ఉన్నాయి. చివరి వరుస వ్యాసం 40 చదరపు అడుగులు ఉంది. 
►దీనికి చేరువలో 20 అడుగుల వ్యాసంతో మరో రెండు స్తూపాలున్నాయి. ఇలా ఒకేచోట 3 స్తూపాలుండటం, పెద్ద స్తూపం మూడు అంచెలుగా ఉండటం అరుదని నిపుణులంటున్నారు. గుప్త నిధుల కోసం కొందరు ఆ మూడు స్తూపాల మధ్య తవ్వటంతో అవి కొంతమేర దెబ్బతిన్నాయి. 

ఎంతగానోఆకట్టుకుంటుంది 
చాలా పురాతనమైన స్తూపాలుండటం, బుద్ధుడి బోధనలు స్వయంగా విని బౌద్ధాన్ని ప్రచారం చేసిన బావరి నివసించిన ప్రాంతం కావటం, గోదావరి నది మధ్యలో ఉండటంతో ఇది పర్యాటకంగా బాగా అభవృద్ధి చెందే ప్రాంతం. అందుకే అక్కడ వెంటనే తవ్వకాలు జరిపి నిర్మాణాలను వెలుగులోకి తేవాలని హెరిటేజ్‌ తెలంగాణ శాఖను కోరాం. సమీపంలోనే కడెం రిజర్వాయర్, దట్టమైన అడవి, గోదావరి నది.. పర్యాటక ప్రాంతంగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయంలో ప్రతిపాదనలు రూపొందిస్తాం 
–మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement