మళ్లీ క్లీన్‌సిటీ.. Again cleancity | Sakshi
Sakshi News home page

మళ్లీ క్లీన్‌సిటీ..

Published Sun, Jun 14 2015 4:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

మళ్లీ క్లీన్‌సిటీ..

- నడుం బిగించిన మహానగరపాలక సంస్థ
- వరంగల్ పూర్వవైభవానికి సన్నాహాలు
- నేడు  సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి రాక
- అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం
- పటిష్ట కార్యాచరణతో ముందుకు..

2012 అక్టోబర్ 10 నుంచి 17.. క్లీన్‌సిటీ చాంపియన్ షిప్.. దేశంలోనే ప్రప్రథమంగా వరంగల్ నగరంలో చేపట్టిన బృహత్తర కార్యక్రమం. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఆరు నెలల్లోనే సీన్ రివర్స్ అరుంది. ఈ క్రమంలో క్లీన్‌సిటీని మళ్లీ గాడిన పెట్టేందుకు మహా నగర పాలక సంస్థ నడుం బిగించింది. మసకబారిన ఓరుగల్లు క్లీన్‌సిటీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, బల్దియా కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బల్దియూ సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి ఆదివారం వరంగల్‌కు రానున్నారు.

వరంగల్ అర్బన్ : క్లీన్‌సిటీపై వరంగల్ మహానగరపాలక సంస్థ మళ్లీ దృష్టి కేంద్రీకరించింది. సమైక్య రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని వరంగల్ నగరంలో 2012లో చేపట్టారు. 1.19 లక్షల ఇళ్లు, షాపుల నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. జిల్లా అధికారులు, సిబ్బందితోపాటు తెలంగాణ ప్రాంతంలోని మునిసిపాలిటీల నుంచి 150 బృందాలు 450 మంది ఉద్యోగులు విచ్చేసి కార్యక్రమంలో వారం రోజులపాటు పాల్గొన్నారు.

అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ ఈ బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించగా... అవార్డుల మీద అవార్డులు వచ్చారు. దేశంలోని పలు నగరాలకు వరంగల్ రోల్‌మోడల్‌గా మారింది. కానీ.. పలు కారణాలతో ఈ కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోరుంది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం.. రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్‌సిటీపై  సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టి కేంద్రీకరించారు.
 
2012లో...
ట్రైసిటీ పరిధి చెత్తను సేకరించేందుకు 600 రూట్లను ఏర్పాటు చేశారు. ప్రతి రూట్‌కు తోపుడు బండి, ఒక మగ, మరో ఆడ కార్మికులను కేటాయించారు. ఇద్దరు కార్మికులు రోజు వారీగా 250 నుంచి 300 ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తను సేకరించడం ప్రారంభించారు. చెత్త కుండీల రహిత నగరంగా మార్చేశారు. కార్మికులు సేకరించి తడి,పొడి చెత్తను తూకం వేయడం, పనితీరును పర్యవేక్షించడం కొనసాగింది. డ్రై వేస్ట్ సెంటర్‌కు పొడి చెత్తను తరలించడం, వేరు చేసి పలు సంస్థలకు విక్రయించారు.

తడి చెత్తను మడికొండ డంపింగ్ యార్డుకు తరలించడం... అక్కడ ప్రత్యేక యంత్రం ద్వారా శుద్ధి చేశారు. కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో విధులు నిర్వర్తించారు. కార్మికులకు ప్రోత్సాహం, కాలనీ ప్రజలను బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆరు నెలల పాటు క్లిన్‌సిటీ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. దీంతో కార్పొరేషన్‌కు ప్రశంస పత్రాలు, దేశ వ్యాప్త అవార్డులు వరించాయి.

కొంత కాలం తర్వాత  ప్రధాన రహదారుల్లో వ్యాపార,వాణిజ్య సంస్థల నుంచి పొడి చెత్తను సేకరించడంలో సిబ్బంది వెనుకబడిపోయారు. ఇంటింటా ఉదయం 6 గంటల నుంచి చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగింది. దుకాణాలు ఉదయం 10 నుంచి 11 గంటలకు తెరవడం వల్ల సకాలంలో షాపుల నుంచి చెత్తను సేకరించకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనిమిచ్చింది. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ 150 చెత్త కుండీలను తెప్పించి, ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయించారు.

అనంతరం కమిషనర్ వివేక్‌యాదవ్ బదిలీ బాట పట్టారు. తదుపరి కమిషనర్ సువర్ణపండాదాస్ బాధ్యతలు స్వీకరించారు. తడి, పొడి చెత్త సేకరణపై అప్పటి కమిషనర్ దృష్టి కేంద్రకరించకపోవడంతోపాటు మొత్తం చెత్తను డంప్ యార్డుకు తరలించాలని ఆదేశించారు.విద్యుత్ తయారీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.  దీంతో పారిశుద్ద్య కార్మికులు తడి,పొడి చెత్తను కలిపి ఇంటింటా సేకరించడం తోపుడుబండ్ల ద్వారా వాహనాలకు చేర్చడం, అక్కడి నుంచి డంపింగ్ యార్డులోకి చేరడం ప్రారంభమైంది. దీంతో యార్డులో చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోరుుంది. దీంతో క్లీన్‌సిటీ కార్యక్రమం పూర్తిస్థారుులో అటకెక్కింది. గత తప్పిదాలు, లోటుపాట్ల నేపథ్యంలో క్లీన్‌సిటీలో ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు...

రూట్ల విభజన
 2012లో 600 రూట్లలో ఇంటింటా తడి,పొడి చెత్త సేకరించారు. ప్రస్తుతం విస్తరించిన నగరంలో మరి న్ని రూట్లు విభజించి సిబ్బందికి కేటారుుంచాలి. క్షేత్రస్థారుులో పర్యవేక్షణకు అధికారులను నియమించాలి.

తడి, పొడి చెత్త..
ఇంట్లో వెలువడిన వ్యర్థాలను తడి, పొడి చెత్త రూపంలో వేర్వేరుగా వేసేలా నగర ప్రజల్లో పూర్తిస్థారుులో అవగాహన కల్పించాలి. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు, పొడి చెత్తను రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆదాయం వస్తుందని, ఈ మేరకు సహకరించేలా ప్రజల్లో చైతన్యం తేవాలి.   పొడి చెత్తను ఏ రోజుకు ఆ రోజు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ల నుంచి వెలువడిన వ్యర్థాలను బయోగ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఎప్పటికప్పుడు తరలించేలా పటిష్ట ఏర్పాటు చేయూలి.
 
సేకరణ, నిర్వహణ కీలకం...
పారిశుద్ధ్యం విషయంలో చెత్త సేకరణ, నిర్వహణ కీలకాంశాలు. ఇందుకోసం మహా నగర పాలక సంస్థ ఏటా కోట్లాది రూపాయాలు వెచ్చిస్తున్నప్పటికీ... పరిస్థితిలో ఆశించిన మార్పులు రావడం లేదు. నగర పరిధిలోని ప్రతి ప్రాంతానికి.. నిర్ధిష్ట సమయంలో తోపుడు బండ్లు, ట్రాలీలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి.
 
సమన్వయం.. ప్రోత్సాహకం.. పర్యవేక్షణ
కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో పనిచేయూలి. కార్మికులకు ప్రోత్సాహకాలు అందించి వారిలో ఉత్తేజం నింపాలి. అదేవిధంగా అధికారులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి.
 
వాహనాలపై నిఘా పెట్టాలి..
కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల నుంచి రోజూ చెత్తను తరలించడానికి సరిపడా వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, డంపర్ ప్లేసర్లు, ఆటోలు, క్యాంపాక్టర్లులు మొత్తంగా 70 వరకు ఉన్నాయి. వీటిని సరైన పద్ధతిలో నడిపించే వారు లేరు. వాహనాల పని తీరుపై నిఘా లేదు. ఇంటర్నెట్ ద్వారా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అమల్లో ఉన్నప్పటికీ.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటలేరు. కాంట్రాక్టు డ్రైవర్లు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ మేరకు గాడినపెట్టాలి. వాహనాలపై నిఘా ఉంచాలి.
 
ఖాళీపోస్టులు భర్తీ చేయాలి..
క్లీన్‌సిటీ సక్రమ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ ఉండాలంటే ఉద్యోగులు, అధికారుల కొరత లేకుండా చూడాలి. ప్రస్తుతం మహా వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో క్షేత్ర స్థాయి ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పదోన్నతులపై ఏఈలు, టీపీఎస్‌లు, టీపీబీఓలు బదిలీపై వెళ్తున్నారు. వీరి స్థానంలో కొత్త వారు రాకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. రోజురోజుకూ విస్తరిస్తున్న కొత్త కాలనీలతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జీఓ ఎంఎస్ నెంబర్ 151 ప్రకారం కార్పొరేషన్‌కు 103 పోస్టుల భర్తీ ప్రక్రియ నాలుగేళ్లలో జరగాలి. కానీ.. కేవలం పది నుంచి పదిహేను మంది అధికారులు, ఉద్యోగుల పోస్టుల మంజూరయ్యాయి. అంత్యంత కీలకమైన సీటి ప్లానర్, ఎంహెచ్‌ఓ, ఆరోగ్యశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు క్షేత్ర స్థాయి ఉద్యోగులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయూలి.
 
ప్రజలను భాగస్వాములను చేయాలి..

బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇళ్లల్లో వెలువడిన తడి,పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రోజు చెత్త అందించే బాధ్యతను కట్టబెట్టాలి. లేనిపక్షంలో జరిమానాలు విధించాలి. పారిశుద్ధ్య సిబ్బంది రోజు గడపగడపనూ తట్టాలి. కాలనీ వారీగా క్లీన్‌సిటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. వారికే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలి. అప్పడే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.
 
సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టిసారించాలి...
సేంద్రియ ఎరువు తయారీకి మడికొండ డంప్‌యార్డులో సూమారు రూ.40లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా షెడ్లను నిర్మించారు. తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డులో ప్రత్యేక మిషన్ ద్వారా జల్లెడ పట్టినప్పటికీ  సేంద్రియ ఎరువు తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఈ మేరకు వీటిపై దృష్టిసారించాలి. తడి చెత్తతో సేంద్రియ ఎరువును విరివిగా తయారు చేసి సరసమైన ధరకు విక్రరుుంచాలి.

బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తేవాలి...
చెత్త ప్రక్షాళన నిబంధనావళిలో భాగంగా హన్మకొండలో చిల్డ్రన్ పార్కులో బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్ విజయవంతంగా కొనసాగుతోంది. బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్ నుంచి వ్యర్థాలు తీసుకెళ్లి, ఎర్రల సహాయంతో సేంద్రియ ఎరువు తయారు చేసి బయోగ్యాస్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం అవరణలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినా.. అందుబాటులోకి రాలేదు. దీన్ని అందుబాటులోకి తెస్తే కొంతమేరనైనా విద్యుత్ సమస్య తీరుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement