పార్కింగ్ స్థలం చూపితేనే వాహనం రిజిస్ట్రేషన్ parking space staff abuse, fleece vehicle owners | Sakshi
Sakshi News home page

పార్కింగ్ స్థలం చూపితేనే వాహనం రిజిస్ట్రేషన్

Published Thu, Jan 29 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

parking space staff abuse, fleece vehicle owners

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన
సాక్షి, ముంబై: ఇకపై యజమానులు పార్కింగ్ స్థలం చూపిస్తేనే వారి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని బొంబాయి హైకోర్టు సూచించింది. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు, రోడ్డు, ఫూట్‌పాత్‌పై ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ‘జనహిత్ మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు సూచనలు చేసింది.

అస్తవ్యస్తమైన పార్కింగ్, నగరంలో పెరుగుతున్న వాహనాల సమస్యను ఎలా అధిగమిస్తారని న్యాయమూర్తులు నరేష్ పాటిల్, అజయ్ గడ్కరిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని, బీఎంసీని ప్రశ్నించింది. వచ్చే ఐదేళ్లకు మీ ప్రణాళిక ఏమిటని నిలదీసింది. రోడ్లపై కార్లను నిలపడాన్ని అనుమతించకూడదని ఆదేశించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఒక్క ముంబైలోనే నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినందుకు ట్రాఫిక్ పోలీసులు గత ఐదేళ్లలో రూ.25 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది జస్బీర్ సలుజా కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ప్రభుత్వంపై మరింత మండిపడింది. ఇలా చేయడంవల్ల ప్రభుత్వ ఖజానాలో భారీగానే ధనం చేకూరుతుంది, కానీ రాకపోకలు సాగించే జనానికి తగినంత స్థలం లేకపోవడం వల్ల ప్రయోజనమేంటని కోర్టు నిలదీసింది.

ప్రభుత్వం స్కైక్ వాక్‌లు నిర్మించిందని, కానీ వాటిని ప్రజలు వినియోగించడం లేదన్న న్యాయవాది వ్యాఖ్యలను కూడా కోర్టు తిరస్కరించింది. ‘‘మీరు నిర్మించిన స్కై వాక్‌లు ప్రణాళికాబద్ధంగా లేవు. వాటిపై లైట్లు లేనందున అవి మహిళలకు సురక్షింతం కావు. వృద్ధులు వాటిపైకి ఎక్కి, దిగలేరు’’ అని మందలించింది. ‘‘విదేశాల్లో వాహన యజమానులు బాటసారులను గౌరవిస్తారు. వారికి రోడ్డు దాటే అవకాశం ఇస్తారు.

కాని మనదేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వాహన యజమానులను ఆదరిస్తారు’’ అని ధర్యాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థను మార్చాలంటే ముందు వాహన యజమానులు పార్కింగ్ స్థలం చూపించాలి. ఆ తరువాతే ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ పనులు జరగాలి. అప్పుడే నగరంలో వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పడతాయని కోర్టు అభిప్రాయపడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement