సమర సన్నాహాలు | Fighter preparations in delhi | Sakshi
Sakshi News home page

సమర సన్నాహాలు

Published Tue, Sep 3 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

Fighter preparations in delhi

సాక్షి. న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికలకు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్‌పీ) సన్నాహాలు ప్రారంభించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఈ నెల ఆరో తేదీన కార్యకర్తలతో సమావేశమవనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించాలంటూ ఆమె కార్యకర్తలను కోరనున్నారు. పార్టీ టికెట్లు ఎవరెవరికి లభిస్తాయనే విషయం ఈ సమావేశంలోనే తేలిపోతుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. స్థానిక తాల్కటోరా స్టేడియంలో  తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని బీఎస్పీ నాయకుడు బ్రహ్మసింగ్ చెప్పారు. కార్యకర్త మహాసమ్మేళన్ పేరిట నిర్వహించే ఈ సమావేశం కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. 
 
 కాగా గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ 69 స్థానాల నుంచి తన అభ్యర్థులను నిలబెట్టి కేవలం రెండు సీట్లలో విజయం సాధించింది. వీరిలో ఒకరైన బదర్‌పుర్ ఎమ్మెల్యే రామ్‌సింగ్ నేతాజీ కొద్దిరోజుల కిందటే  బీఎస్‌పీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బదర్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ నరసింగ్‌షాను అభ్యర్థిగా ప్రకటించింది. మరో ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ తూర్పు ఢిల్లీలోని గోకుల్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలమధ్య పోటీకే అలవాటుపడిన ఢిల్లీలో గత ఎన్నికల్లో బీఎస్పీకూడా బరిలోకి దిగింది. దీంతో అనేక నియోజకవర్గాలలో పోటీ  ముక్కోణపు పోటీ తప్పలేదు. దాదాపు డజనుపైగా స్థానాలలో బీఎస్పీ అభ్యర్థులు విజేతలకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు.
 
  కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులు వీరే
 న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 27 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, పీసీసీ అధ్యక్షుడు జె.పి.అగ ర్వాల్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, కృష్ణ తీరథ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేది, అజయ్ మాకెన్ తదితరులు ఉన్నారు. వీరితోపాటు ఆ పార్టీ ఎంపీలు సందీప్ దీక్షిత్, రమేశ్‌కుమార్, పర్వేజ్ హష్మి, మహాబల్ మిశ్రా, సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులు తాజ్దార్ బాబర్, సుభాష్ చోప్రా, ప్రేమ్‌సింగ్, మంత్రులు అర్విందర్ సింగ్ లవ్లీ, హరూన్ యూసఫ్ తదితరులు కూడా ఉన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement