డీఎంకే ఎంపీకి జైలు శిక్ష | DMK MP set to lose post, as CBI court convicts him in cremation shed case | Sakshi
Sakshi News home page

డీఎంకే ఎంపీకి జైలు శిక్ష

Published Fri, Apr 18 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

DMK MP set to lose post, as CBI court convicts him in cremation shed case

సాక్షి, చెన్నై:డీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీఎం సెల్వగణపతి ఒక్కప్పుడు అన్నాడీఎంకే నేత. ఆ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యూరు. 1991-96 కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వ కేబినెట్‌లో ఈయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో జవహర్ రోజ్‌గార్ యోజన పథకం నిధులను ఆయన దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతో పాటుగా మంత్రుల  అవినీతి భాగోతాల్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఒక్కొక్కటిగా వెలికి తీసింది. ఇందులో సెల్వగణపతి భాగోతం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించడంతో పాటుగా శ్మశానాల్లో షెడ్ల పేరిట అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఐఏఎస్  అధికారుల సహకారంతో ఒకే సంస్థకు కాంక్రీట్ షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్టు తేలింది.
 
 దీంతో సెల్వగణపతి, అప్పట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ఆచార్యులు, ఆ శాఖ డెరైక్టర్‌గా ఉన్న సత్యమూర్తి,  ప్రాజెక్టు అధికారి కృష్ణమూర్తి, ఓం మురుగా సిమెంట్స్ ప్రతినిధి టీ భారతితో పాటుగా మరొకరిపై కేసు నమోదు అయింది.  విచారణ : ఈ కేసు విచారణ పదిహేను సంవత్సరాలుగా చెన్నై ప్రత్యేక సీబీఐ కోర్టులో సాగుతోంది. సీబీఐ విచారణను ముగించి చార్జ్ షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. వాదనలు ముగియడంతో విచారణ తుది దశకు చేరింది. నాగపట్నం జిల్లాలో 100 షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్టు, ఒక్కో షెడ్డుకు రూ.30 వేలు చొప్పున 30 లక్షలు ఏకకాలంలో మంజూరు చేసినట్టు విచారణలో తేలింది.
 
 కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జవహర్ రోజ్‌గార్ పథకం ఈ షెడ్ల నిర్మాణానికి వర్తించదని నిర్ధారణ అయింది. ఈ షెడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిధులు రూ.23 లక్షలు దుర్వినియోగం అయినట్టు, శ్మశాన షెడ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నట్టు ఆధారాలతో సహా సీబీఐ నిరూపించింది. సీబీఐ తరపున న్యాయవాది భాస్కరన్ తన వాదనను ముగించడంతో తీర్పు వెలువరిచేందుకు ప్రత్యేక న్యాయ స్థానం న్యాయమూర్తి ఎస్ మాలతి నిర్ణయించారు.తీర్పు: గురువారం న్యాయమూర్తి ఎస్ మాల తి తీర్పు వెలువరించారు. అవినీతి నిరూపణ కావడంతో సెల్వగణపతి, ఆచార్యులు, సత్యమూర్తి, కృష్ణమూర్తి, భారతీలకు మూడేళ్లకు పైగా శిక్ష పడొచ్చని సర్వత్రా భావించారు. అయితే, శిక్ష కేవలం రెండేళ్లకు పరిమితం అయింది. రూ. 25 వేలు జరిమానా విధిం చారు.
 
 ఈ జరిమానా చెల్లించని పక్షంలో నాలుగు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఈ తీర్పుకు సీబీఐ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శిక్షకాలాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో  ఈ శిక్ష మూడేళ్ల కన్నా, తక్కువగా ఉండడంతో అమలును తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. ఈ కేసు విచారణ సమయంలో ఒకరు మరణించడంతో ఆయనపై  కేసును కొట్టి వేశారు.  డీఎంకేకు షాక్: ఒకప్పుడు అన్నాడీఎంకే నాయకుడిగా ఉన్న సమయంలో సెల్వగణపతిపై తాము వేసిన కేసు ఇప్పుడు తమ మెడకే చుట్టుకోవడం డీఎంకే వర్గాలకు షాక్ తగిలినట్టు అయింది. ప్రస్తుతం సెల్వగణపతి తమ పార్టీలో ఉండడం, ఇటీవలే ఆయనకు రాజ్య సభ పదవిని సైతం డీఎంకే అధిష్టానం కట్టబెట్టింది. ఇప్పుడు డీఎంకే ఎంపీకి శిక్ష పడ్డట్టు ప్రచారం సాగుతుండడం ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎన్నికల వేళ ఈ శిక్ష వ్యవహారం కాస్త ప్రతి పక్షాలకు ఆయుధంగా మారింది.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement