నేను దేవుడిని కాను | Sachin Tendulkar Says He is Not a Cricket God, Just Blessed With Love From Fans | Sakshi
Sakshi News home page

నేను దేవుడిని కాను

Published Wed, Nov 12 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

నేను దేవుడిని కాను

కేవలం సచిన్‌ను మాత్రమే..  టెండూల్కర్ వ్యాఖ్య
 
 లండన్: చాలా మంది అభిమానులు తనను క్రికెట్ దేవుడిగా భావిస్తున్నా... తాను మాత్రం సాధారణమైన వ్యక్తినేనని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ‘నేను క్రికెట్ దేవుడ్ని కాను. మైదానంలో చాలా తప్పులు చేశా. కాకపోతే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా సాధారణ సచిన్‌నే. అందుకు తగ్గట్టుగానే ఉంటా. చాలా మంది ప్రజలు నన్ను ఇష్టపడటం నా అదృష్టం.

ఇది చాలా ప్రత్యేకమైంది. వాళ్ల ఆశీస్సులు నాపై ఉన్నాయి. దేవుడు అలాంటి స్థితిని కల్పించాడు. నేను కోరుకున్న ప్రతిదీ కష్టపడి సాధించుకున్నా. నాపై ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నా’ అని మాస్టర్ పేర్కొన్నాడు.

 బిజీగా మారిపోయా...
 రిటైర్మెంట్ తర్వాత జీవితం బిజీగా మారిపోయిందని సచిన్ చెప్పాడు. ‘ఇప్పుడు నేను భిన్నమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. 24 ఏళ్లు కేవలం క్రికెట్‌పైనే దృష్టిపెట్టా. మిగతా వాటి గురించి పట్టించుకోలేదు. నా జీవితంలో తొలి ఇన్నింగ్స్ క్రికెట్ ఆడటం, ప్రపంచకప్ గెలవాలన్న నా కలను నెరవేర్చుకోవడానికి సరిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అభిమానులు, ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా’ అని సచిన్ వెల్లడించాడు.

ఎప్పటికైనా క్రికెట్‌లో టెస్టు మ్యాచ్‌లే అత్యుత్తమని చెప్పిన మాస్టర్ మిగతా ఫార్మాట్లలో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయన్నాడు. 2008 ముంబైలో ఉగ్రవాదుల దాడుల తర్వాత చెన్నైలో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ తన కెరీర్‌లో అర్థవంతమైందని సచిన్ తెలిపాడు. తన వారసత్వాన్ని కుమారుడికి అందించడంపై మాట్లాడుతూ... ఆట ఆడాలన్న కోరిక హృదయం, మనసులో బలంగా ఉంటే క్రికెట్ పిచ్చొడు అయిపోతాడని, అర్జున్‌లో ఇది ఉందన్నాడు.

 ప్రాంతీయ భాషల్లో సచిన్ పుస్తకం
 ఇప్పటికే అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్న సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్స్ మై వే’ పుస్తకాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించనున్నారు. చాలా మంది ప్రచురణకర్తల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోందని ‘హచెట్టీ ఇండియా’ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement