ఈ విజయం ఎంతో ప్రత్యేకం | Gopichand on Sindhu is World Championship triumph | Sakshi
Sakshi News home page

ఈ విజయం ఎంతో ప్రత్యేకం

Published Tue, Aug 27 2019 4:43 AM | Last Updated on Tue, Aug 27 2019 4:43 AM

Gopichand on Sindhu is World Championship triumph - Sakshi

న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్‌ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్‌ చాంపియన్‌ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్‌ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్‌పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్‌లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్‌ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్‌ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్‌ఇంగ్లండ్‌ చాంపియన్‌ అభిప్రాయపడ్డారు.  

ఎమ్మెస్కే అభినందన...
సింధు విజయంపై భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్‌ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్‌కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్‌కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్‌ అన్నారు.  

చాముండేశ్వరీనాథ్‌ కారు కానుక...
వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్‌ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్‌ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement