‘దేవుడి’ సొమ్ముకే టెండర్‌ | Golmal In Dwaraka Tirumala Temple | Sakshi
Sakshi News home page

‘దేవుడి’ సొమ్ముకే టెండర్‌

Published Fri, Mar 8 2019 4:16 PM | Last Updated on Fri, Mar 8 2019 4:27 PM

Golmal In Dwaraka Tirumala Temple - Sakshi

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. టెండర్లు పిలువకుండానే, లక్షలాది రూపాయల మేర అభివృద్ధి పనులను కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనేది పక్కనబెడితే, దీని వల్ల లక్షలాది రూపాయల మేర దేవుడి సొమ్ము దుర్వినియోగమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సాధారణంగా రూ.30 వేలు పైబడి ఖర్చు చేసే ఏ పనికైనా దేవస్థానం మాన్యువల్‌ టెండర్‌ను పిలవాలి. అలాగే లక్ష రూపాయలు పైబడి జరిగే పనులకు ఈ ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ను పిలిచి, ఎవరు తక్కువకు టెండర్‌ వేస్తే.. వారికే పనులను అప్పగించాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో, సకాలంలో పనులు పూర్తవడంతో పాటు, పనుల్లో నాణ్యత కనిపిస్తుంది.

కానీ ఇక్కడ ఆ నిబంధనలేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అత్యవసరం పేరుతో 90 శాతం అభివృద్ధి పనులను ఎటువంటి టెండర్లూ లేకుండానే చకచకా కానిచ్చేస్తున్నారు. తమకు కావాల్సిన వారికి అధికారులు పనులను అప్పగించి, వారికి సొమ్ములను ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఒకే వ్యక్తికి పనులు అప్పగింత

ద్వారకాతిరుమలలో దాదాపు ఐదు జేసీబీలు ఉండగా, ఎప్పుడూ ఒక జేసీబీ యజమానికే దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగ అధికారులు పనులను అప్పగిస్తున్నారు. ఈ విషయంలో గతేడాది సెప్టెంబర్‌ 7న ఇద్దరు జేసీబీ యజమానులకు, దేవస్థానం అధికారులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది.

చివరకు ఆ గొడవ రోడ్డుపైనే సెటిల్‌మెంట్‌ అయ్యింది. అయినా అధికారులు తమకు అనుకూలంగా ఉన్న  ఆ జేసీబీ యజమానికే ఇప్పటికీ టెండర్లు లేకుండా పనులను అప్పగించడంపై  ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలపైబడి జరిగిన పనులకు సైతం రూ.30 వేలు లోపు, పలు బిల్లులను పెడుతూ ఆ వ్యక్తికే లబ్ధి చేకూరుస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 


శ్రీవారి శేషాచలకొండపై ఇటీవల జేసీబీతో జరుగుతున్న పనులు 

తక్కువ పని చేసినా..

జేసీబీ దాదాపు 4 గంటలు పనిచేస్తే, 10 గంటలు పనిచేసినట్లు బిల్లుల్లో చూపుతూ, గంటకు రూ.వెయ్యి వరకు అధికారులు ఆ వ్యక్తికి నగదు చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీ ఎంత సమయం పనిచేసిందనే దాన్ని రీడింగ్‌ రూపంలో సంబంధిత సిబ్బంది లాక్‌బుక్‌ రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే దేవస్థానం బిల్లులను చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పనులకు ఎటువంటి లాక్‌బుక్‌ లేనట్లు తెలుస్తోంది.

తక్కువ పనిచేసినా.. ఎక్కువ పనిచేసినట్లు సిబ్బంది చేప్పే, ఒట్టి నోటి మాటల ద్వారానే, పెద్ద మొత్తంలో బిల్లులు ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చినవెంకన్న సొమ్ముకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొక్కల పెంపకానికి, ఇతర పనులకు మట్టిని తోలే పనులను సైతం అదే వ్యక్తికి అప్పగించినట్లు స్పష్టమవుతోంది.

ఇలా అన్ని పనులూ దాదాపుగా ఒకే వ్యక్తికి అధికారులు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆ చినవెంకన్నకే తెలియాలి. ఇప్పటికైనా అధికారులు నిబంధనలను పాటించి, అభివృద్ధి పనులకు టెండర్లను పిలవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజును వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement