అది ‘ఈఎస్‌ఐ’ కుమ్మక్కు! Uttamkumar Reddy comments on KCR and Narendra Modi | Sakshi
Sakshi News home page

అది ‘ఈఎస్‌ఐ’ కుమ్మక్కు!

Published Sat, Dec 1 2018 1:30 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttamkumar Reddy comments on KCR and Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈఎస్‌ఐ కార్పొరేషన భవన నిర్మాణాల విషయంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం నుంచి తప్పించుకునేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ లాలూచీ పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఎన్‌బీసీ)కి ఇవ్వాల్సిన నిర్మాణ కాంట్రాక్టును కేంద్రమంత్రి హోదాలో సంబంధిత అధికారులను తన నివాసానికి పిలిపించుకుని, వారిపై ఒత్తిడి తెచ్చి మరీ అప్పటి ఏపీ ఫిషరీస్‌ కార్పొరేషన్‌కు ఇప్పించారని వెల్లడించారు. అప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎలుగుబంటి సూర్యనారాయణ అనే ఈఈకి కట్టబెట్టి పాల్పడిన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ పెండింగ్‌లో ఉందని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో కేసీఆర్‌ తన పేరు లేకుండా చేసుకున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.

ఈ అంశమే కేసీఆర్, మోదీల బంధానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ నేత, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, టీజేఎస్‌ నాయకుడు విద్యాధర్‌రెడ్డిలతో కలిసి ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. తరచూ కంటి పరీక్షలు, వైద్య పరీక్షల పేరుతో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌.. ఈ కేసులో సీబీఐ ముందుకు వెళ్లకుండా చూసుకునేందుకు ప్రధానిని, ఇతర పెద్దలను కలిసి వచ్చారని ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో కేసీఆర్‌ ప్రమేయం నేరుగా ఉంది. సీబీఐ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కేంద్రమంత్రి ఇంట్లో జరిగిన సమావేశంలోనే ఎన్‌బీసీ నుంచి ఆ కాంట్రాక్టును ఫిషరీస్‌కు ఇచ్చినట్టు రికార్డయింది. అయినా కేసీఆర్‌ పేరు చార్జిషీట్‌లో లేకుండా చేశారు. ఇందుకోసమే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మోదీ ముందు కేసీఆర్‌ తాకట్టు పెట్టారు’అని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. పునర్విభజన బిల్లులో తెలంగాణ ప్రయోజనాలను కాపాడే అంశాలను అమలు కాకుండా చేసింది కూడా ఇందుకోసమేనని ఆరోపించారు.

 
దిగజారి విమర్శలు చేస్తున్నారు... 
ఎన్నికల ప్రచారంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబులను ఉద్దేశించి కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలను ఉత్తమ్‌ తప్పుబట్టారు. రాష్ట్రం ఇచ్చిన తల్లిగా తన పిల్లలు బాధపడుతున్నారనే ఆవేదనతో సోనియా మాట్లాడారని, హుందాగా మాట్లాడిన ఆమె మాటలను కేసీఆర్‌ దిగజారి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణ సీఎం కావడం దౌర్భాగ్యమని ప్రజలు భావిస్తున్నారని, కేసీఆర్‌ వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుపై అనవసరంగా, అసందర్భంగా మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ ఏం చేస్తుంటే చంద్రబాబు అడ్డుపడ్డాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళితుడిని సీఎం చేస్తానంటే, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానంటే, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటే, నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానంటే బాబు అడ్డుపడ్డాడా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. 


సహారా కుంభకోణంలో ఎంత కమీషన్‌ వచ్చింది?: రమణ 
సోనియాగాంధీ, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని జీర్ణించుకోలేకనే కేసీఆర్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఆయన చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే 2006లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారని ఆరోపించారు. యూపీఏ హాయాంలోనే కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, నాటి శాంతిభద్రతల పరిస్థితులను అంచనావేసి, ఉద్యమ ఉధృతిని గమనించినందునే కేంద్రం ఆ దిశలో అడుగులు వేయలేదని వివరించారు.

సహారా కుంభకోణంలో కూడా కేసీఆర్‌ ప్రధాన భూమిక పోషించారని, ఆ కుంభకోణంలో ఎన్ని కోట్ల కమీషన్‌ వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబం జుట్టు కేంద్రం చేతిలో ఉన్నందునే మోదీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్‌ కేంద్రమంత్రిగా పనిచేశారని, అప్పుడు కూడా ఆయన కార్మికశాఖ కార్యాలయానికి వచ్చేవాడు కాదని మాజీ ఎంపీ అజీజ్‌పాషా వెల్లడించారు.  ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement