హోదాను ఖూనీ చేసి మళ్లీ నాటకాలా?: వైఎస్‌ జగన్‌ | Prajasankalpa Yatra YS Jagan Full Speech at Vuyyuru | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 7:31 PM | Last Updated on Fri, Jul 6 2018 2:54 PM

Prajasankalpa Yatra YS Jagan Full Speech at Vuyyuru - Sakshi

సాక్షి, విజయవాడ: హోదాను ఖూనీ చేసిన చంద్రబాబు నాయుడు.. ఇంకా నాటకాలు ఆడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిచారు. నాలుగేళ్ల పాలనలో అన్నీ వర్గాల ప్రజలను దగా చేసిన చంద్రబాబు..  హోదా విషయంలో చేసిన మోసం మరిచిపోలేనిదని జగన్‌ పేర్కొన్నారు. 

‘పురాణాల్లో రావణాసురుడు, బకాసురులు ఉంటే.. ఉయ్యూరులో మాత్రం ఇసకాసరులు ఉన్నారని రైతులు చెబుతున్నారు. లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అవినీతిని చంద్రబాబు దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. కలెక్టర్ల దగ్గరి నుంచి చినబాబు.. చినబాబు నుంచి పెదబాబు... ఇలా అందరికీ వాటాలు దక్కుతున్నాయి. పేదప్రజల మీద అవినీతి చేసే ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.  వైఎస్సాఆర్‌ ఇచ్చిన ఇళ్ల స్థలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. రూ. 3 లక్షల విలువ చేసే ఫ్లాట్లను.. రూ. 6లక్షలకు ప్రభుత్వం అమ్ముకుంటోంది. లంచాలు తీసుకునేది చంద్రబాబు.. డబ్బులు కట్టాల్సింది పేదవాడా?’ అని వైఎస్‌ జగన్‌ ఆక్షేపించారు. 


రైతన్నల ఆవేదన... యూపీలో చెరుకు టన్నుకు రూ. 3500 చెల్లిస్తున్నారు. కానీ, ఏపీలో రూ.2750 మాత్రమే ఇస్తున్నారు. మినుములు కనీసం రూ. 4 వేలకు కూడా కొనే నాథుడు లేడు. పసుపుకు క్వింటాల్‌కు రూ. 16 వేలు పలికేది. ఇప్పుడు రూ. 5రూ. కూడా పలకటం లేదు.  ఏ ఒక్క పంటకు కూడా గిట్టు బాటు రావటం లేదని రైతులు వాపోతున్నారు. వైఎస్సార్‌ హయాంలో అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించేంది. కానీ, ఈ టీడీపీ ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తోంది.  రుణాలన్నీ మాఫీ అయిపోయానని ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో మహిళలు కన్నీరు పెడుతున్నారు. నాలుగేళ్లుగా కనబడని ప్రజలు ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు గుర్తుకొస్తున్నారు. 

ఎల్లో మీడియాకు అవి కనపడవు... చంద్రబాబు ముఖం చూసి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంట. మరి అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? దారుణమైన అబద్ధాలు.. మోసాలు. విదేశీ ప్రయాణాల కోసం ప్రైవేట్‌ జెట్ విమానాలు‌.. కోట్ల ఖర్చులు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేస్తున్నాయంటూ ఎల్లో మీడియాలో కథనాలు ఇప్పిస్తారు. రాష్ట్ర ప్ర​యోజనాల కోసం విదేశాలకు వెళ్తున్నా అంటారు. కానీ, అది నల్లధనం దాచుకోడానికి. విజయవాడలో గవర్నర్‌-చంద్రబాబు గంట 40 నిమిషాలు మాట్లాడారు. కేంద్రంతో మీరేం పోరాడతారని గవర్నర్‌.. చంద్రబాబుతో చెప్పినట్లు ఆ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. మరి అదే గవర్నర్‌ దగ్గరికి సుజనా చౌదరిని చంద్రబాబు పంపించటం ఎల్లో మీడియాకు కనపడలేదా? ఐబీ చీఫ్‌ విజయవాడ వెళ్లి మరీ చంద్రబాబును కలుస్తారు. మరి ఆ వార్తను ఎల్లో మీడియా ఎందుకు గోప్యంగా ఉంచింది?..  

420 దీక్షలో అంతా పెయిడ్‌ ఆర్టిస్టులే.. ‘ఓ సిపాయి తుపాకీ చంకన పెట్టకుని యుద్ధానికి పోతాడు. యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో శత్రువుకు ఆ సిపాయి తుపాకీ పేల్చటానికి ట్రిగ్గర్‌ నొక్కుతాడు. బుల్లెటు బయటకు రాలేదు. కారణం.. ఆ బుల్లెట్‌ నకిలీది కాబట్టి. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చేయించిన డ్రామా కూడా నకిలీదే. పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మొత్తంగా రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కానీ, టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించి ఉంటే కేంద్రం ఖచ్ఛితంగా దిగొచ్చేది. చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మళ్లీ డ్రామాలు. ఆయన పుట్టిన రోజున 420 దీక్షకు దిగారు. దీక్షలో ఎన్టీఆర్‌ డూప్‌ చంద్రబాబుకు ఆశీర్వాదం ఇచ్చాడు. దీక్షలో అంతా పెయిడ్‌ ఆర్టిస్టులే. రూ. 30 కోట్ల ప్రజాధనాన్ని ఒక్క పూట దీక్ష కోసం చంద్రబాబు నాశనం చేశాడు.

మోసంలో నీకు భాగం లేదా?.. హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని ఈ నెల 30న తిరుపతిలో సమావేశం పెడతారంట. మరి ఆ మోసంలో చంద్రబాబు భాగస్వామ్యం కాదా? అని జగన్‌ నిలదీశారు. హోదా రాకుండా చేసిన వ్యక్తే.. ఇప్పుడు మళ్లీ నాటకాలు ఆడుతున్నారు. మూలవిరాట్‌ మోదీ కాళ్లు దొరకలేదు. కాబట్టి ఉత్సవవిగ్రహం గవర్నర్‌ కాళ్లు గట్టిగా పట్టుకుంటున్నారు. ఓవైపు బీజేపీతో కటీఫ్‌ అంటూనే... మరోవైపు మహారాష్ట్ర బీజేపీ నేత భార్యను టీటీడీ మెంబర్‌ను చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఆయన ఆడుతున్న డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు. కాళ్లు పట్టుకోవడం.. కాకా పట్టడమంటే ఇది కాదా బాబూ?. హోదా కోసం పోరాటం అంటూ ఫోజులే తప్ప ఫలితం లేదు. ఢిల్లీకి పోతారు. ప్రత్యేక హోదా కోసం అని బిల్డప్‌ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో మీడియా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారంటూ విపరీతంగా చూపించాయి. కానీ, ఆయన మాత్రం ఏపీ భవన్‌లో రాత్రిపూట అమర్‌సింగ్‌ను కలుస్తారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కోసం బ్రోకరిజం చేస్తారు. ఎల్లో మీడియల్లో అవేం రావు. చేఏసింది వాళ్ల మనుషులు కాబ్టటే. (నమాజ్‌ జరుగుతుండటంతో జగన్‌ కాసేపు ప్రసంగం ఆపేశారు) 

... టీడీపీ పెద్దలు అగ్రిగోల్డ్‌ ఆస్తులను యథేచ్ఛగా కాజేశారు. చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, అవినీతి మయం. ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు అన్నిరకాలుగా యత్నిస్తున్నారు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోండి. ఓటు మాత్రం మనస్సాక్షి చెప్పిన విధంగానే వేయండి. మోసాలు, అబద్ధాలు చేసే వారిని బంగాళాఖాతంలో కలిపేయండి. రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే.. రాజీనామా చేసి ఇంటికి పోయే వ్యవస్థ రావాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. 

పిల్లల చదువుల కోసం... ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. అందులో ఈ రోజు పేద పిల్లల చదువుల కోసం ప్రజా ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకుందాం. తల్లిదండ్రులు పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగో, మెడిసినో చదవాలంటే లక్షల ఫీజు కట్టాలి. చంద్రబాబు రూ.30 వేలిచ్చి సరిపెడుతున్నారు. అదే మన ప్రభుత్వం వస్తే పిల్లల చదువులకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులు హాస్టళ్లలో ఉండటానికి వీలుగా మెస్‌చార్జి కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. అప్పులబారినపడి ఏ తల్లిదండ్రీ పిల్లల్ని స్కూలుకు పంపించని పరిస్థితి రావద్దు. అందుకే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి నెల నెలా రూ.15 వేలు అందిస్తాం. అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా మీ పిల్లల్ని చదవిస్తా’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండని ఆయన ప్రజలను కోరారు. దివంగత నేత వైఎస్సార్‌ కలలు గన్న గొప్ప రాజ్యాన్ని తీసుకొస్తానని చెబుతూ ప్రజల ఆశీర్వాదం కోరుతూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement