అమాత్య... అన్న పిలుపేదీ? | No Ministry For Three Constituencies Since | Sakshi
Sakshi News home page

అమాత్య... అన్న పిలుపేదీ?

Published Tue, Mar 26 2019 8:35 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

No Ministry For Three Constituencies Since - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో గతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పనర్విభజనతో 19 నుంచి 17కు తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకూ మూడు నియోజకవర్గాలకు మంత్రి పదవి దక్కలేదు. వాటిలో ఒకటి రద్దయిన దుగ్గిరాల నియోకవర్గంకాగా మిగిలిన రెండు నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని గురజాల, మాచర్ల. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని సత్తెనపల్లికి కేవలం నెలరోజులే మంత్రి పదవి దక్కింది. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు.

మాజీ మంత్రి ఆలపాటి ధర్మారావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనంతరం వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. సత్తెనపల్లిది విచిత్ర పరిస్థితి. 1983లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్యేగా గెలుపొంది నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో నెలపాటు మంత్రిగా కొనసాగారు. ఆ నెల మినహా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు.

సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు సైతం మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 స్వల్ప మెజార్టీతో గెలిచినా శాసన సభ స్పీకర్‌ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు మంత్రి పదవి దక్కలేదు. 2014లో మాత్రం మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు అమాత్యుడిగా ప్రమాణం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవి పొందలేదు.

అయితే గురజాల వాసి అయిన డొక్కా మాణిక్యవరప్రసాదరావు తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడూ రెండు సార్లుకంటే ఎక్కువ సార్లు గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కలేదని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిని పొందలేకపోయారు.

ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సైతం విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ రికార్డు సృష్టించారు. ఆయన మినహా మిగిలిన ఎవరూ రెండు సార్లు గెలవలేదు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement