మరాఠీల మొగ్గు ఎటువైపో? Maharashtra Assembly polls Marathi Voters Key Role | Sakshi
Sakshi News home page

మరాఠీల మొగ్గు ఎటువైపో?

Published Wed, Sep 25 2019 9:21 AM | Last Updated on Wed, Sep 25 2019 9:22 AM

Maharashtra Assembly polls Marathi Voters Key Role - Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సైరన్‌ మోగడంతో ముంబైలో రాజకీయ పార్టీల కదలిక లు జోరందుకున్నాయి. తమ తమ నియోజక వర్గాలలో ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏ వార్డులో ఎన్ని ఓట్లు తమకు అనుకూలంగా ఉన్నాయనే దానిపై ఆయా పార్టీల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు బేరీజు వేసుకుంటున్నారు. మరాఠీ ఓటర్లున్న నియోజక వర్గాలలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని వ్యూహం పన్నుతున్నాయి. ముంబైలో సుమారు 24 లక్షల మరాఠీ ఓటర్లున్నారు. మరాఠీ ప్రజల శాతం తగ్గిపోతున్నప్పటికీ ముంబైలో వారి ఓట్లే కీలకం కానున్నాయి. అనేక నియోజక వర్గాలలో మరాఠీ ఓట్లు ఫలితాలను తారుమారు చేస్తాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకుల దృష్టి ఆ ఓట్లపైనే ఉంది.  

రెండు కూటముల మధ్యే పోరు.. 
ముంబైలో శివసేన–బీజేపీ, కాంగ్రెస్‌–ఎన్సీపీ మధ్య పొత్తు కుదిరితే ఈ రెండు కూటముల మధ్య నేరుగా పోరు జరగనుంది. బహుజన్‌ వంచిత్‌ ఆఘాడి ఏర్పడిన తరువాత అసెంబీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) కూడా బరిలో దిగేందుకు సన్నహాలు చేస్తోంది. దీంతో కొన్ని చోట్ల ద్విముఖ పోటీ, మరికొన్ని చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీ జరగనుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమ తమ నియోజక వర్గాలలో ఇప్పటి నుంచి నడుం బిగించారు. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అందులో శివ్డీ, వర్లీ, మాహిం, వడాల, తూర్పు బాంద్రా, కాలీనా, బోరివలి, చెంబూర్, జోగేశ్వరీ, తూర్పు ఘాట్కోపర్, పశ్చిమ ఘాట్కోపర్, చాందివలి, విలేపార్లే, వర్సోవా, కాందివలి, మాగఠాణే తదితరా నియోక వర్గాలలో మరాఠీ ఓట్లు ఫలితాలను నిర్ణయిస్తాయి.

సునీల్‌ ప్రభు, రవీంద్ర వైకర్, ప్రకాశ్‌ సుర్వే, పరాగ్‌ అలవ్‌ణి, భారతీ లవేకర్, సంజయ్‌ పోత్నీస్, ఆశీష్‌ శేలార్, సదా సర్వణ్కర్‌ తదితర మరాఠీ ఎమ్మెల్యేలకు తమ తమ నియోజక వర్గాలలో మంచి పట్టు ఉంది. ఈ సారి కూడా వారి మళ్లీ అభ్యర్తిత్వం కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఈ నియోజక వర్గాలలో మరాఠీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. అంతేగాకుండా ఈ నియోజక వర్గాలలో మరాఠీ కార్పొరేటర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఎన్సీపీ, ఎమ్మెన్సెస్, సమాజ్‌వాది పార్టీ, ఎంఐఎం మినహా ఇక్కడ అన్ని పార్టీల ఎమ్మెల్యేలున్నాయి.

గతంలో జరిగిన ఎన్నికల్లో మరాఠీ ఓట్లతోనే వారంతా గెలిచారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌ పోటీ చేయలేదు. కాని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. శివసేన, ఎమ్మెన్సెస్‌కు మరాఠీ ఓటర్ల అండ ఉన్నప్పటికీ కొంచెం అటు, ఇటుగా మిగతా పార్టీలకు కూడా ఓట్లు పోలయ్యే ప్రమాదముంది. ఇదే సమయంలో వంచిత్‌ ఆఘాడి కూడా మొదటిసారి బరిలో దిగడంతో మరాఠీ ఓట్లు చీలిపోయి ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం లేకపోలేదు. 

ప్రాబల్యం తగ్గిపోతుండటంతో.. 
ఇప్పటికే ముంబైలో మరాఠీ ఓటర్లు తగ్గుతున్నారు. 2001లో మధ్యముంబైలో మరాఠీ ప్రజల సంఖ్య 45 లక్షలు ఉండగా 2011లో ఈ సంఖ్య 44 లక్షలకు పడిపోయింది. ముంబైలో మొత్తం 94,58,397 ఓటర్లున్నారు. ప్రసుత్తం అందులో మరాఠీ ఓటర్లు కేవలం 24 లక్షలున్నారు. దీంతో ముస్లీం, ఉత్తరభారతీయ ఓటర్లను కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి దువ్వే ప్రయత్నం చేయగా మరాఠీ, దక్షిణ భారతీయుల ఓటర్లను శివసేన–బీజేపీ కూటమి ఆకర్షించే ప్రయత్నం చేయనున్నాయి. ఈ ప్రజలకు ఎలాంటి హామీలిచ్చి తమవైపు ఆకర్షించుకోవాలనే దానిపై ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కొన్ని చోట్ల మరాఠీ ఓటర్లు తగ్గడంతో ఇతర ప్రాంతాల ఓటర్లే కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేయనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement