ఈ బడ్జెట్‌తో హామీల అమలెలా? | CM KCR Counter Reply TO Bhatti Vikramarka Question in Assembly | Sakshi
Sakshi News home page

ఈ బడ్జెట్‌తో హామీల అమలెలా?

Published Tue, Feb 26 2019 4:13 AM | Last Updated on Tue, Feb 26 2019 4:13 AM

CM KCR Counter Reply TO Bhatti Vikramarka Question in Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల హామీలను అమలు చేసేలా బడ్జెట్‌ను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందని ఆశించిన ప్రజలకు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌తో తీవ్ర నిరాశే మిగిలిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించాక పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతామన్న ప్రభుత్వ వాదనలో పసలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే రాబడుల్లో రూ. 8–10 వేల కోట్లకు మించి మార్పు ఉండనందున పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చలో భాగంగా సభలో ఆయన సోమవారం సుదీర్ఘంగా ప్రసంగించారు.

ప్రభుత్వ ఉద్యోగాలేవీ..?
తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ప్రధాన కారణాల్లో నియామకాలు ఒకటని భట్టి గుర్తుచేశారు. నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేసి ఉంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడేది కాదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రాజెక్టులను కేంద్రం నుంచి సాధించి ఉంటే భారీగా ఉద్యోగాలు లభించేవని, ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించడంతో నిరుద్యోగ సమస్య పెరి గిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా 2013లో నిమ్జ్‌కు అనుమతి వచ్చిందని, అప్పట్లోనే కొంత భూసేకరణ కూడా జరిగిందని, అది వచ్చి ఉం టే రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు ఏర్పడేవన్నారు. ఐటీఐఆర్‌ను సాధించి ఉంటే రూ. 3.11 లక్షల కోట్ల ఆదాయం, రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ. 2.35 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు.

భట్టిపై సీఎం ఆగ్రహం...
భట్టి విక్రమార్క తన ప్రసంగంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతిసారీ సీఎం కేసీఆర్‌ దాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. భట్టి చెబుతున్న అంకెలు తప్పని, ఆయన అవగాహన లేక మాట్లాడుతూ సభ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయితే తన ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదం టూ భట్టి కూడా అసహనం వ్యక్తం చేశారు. వాస్తవా లు చెబుతుంటే సీఎం దబాయించేలా మాట్లాడుతున్నారన్నారు. దీంతో ఆ మాటను ఉపసంహరించుకోవాలంటూ సీఎం డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ లెక్కల్లో అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదన్న ఆరోపణపై సీఎం స్పందిస్తూ బడ్జెట్‌ లెక్కలు అలాగే ఉంటాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పదేళ్ల లెక్కలు ఇంతకంటే దారుణంగా ఉన్నాయన్నారు.

విద్యారంగానికి కేటాయింపులు కనీసం 20 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 6.8 శాతమే పెట్టారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వ్యయం 30–40 శాతం తక్కువగా ఉందని భట్టి విమర్శించగా.. వివిధ అంశాల కింద బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 19,482 కోట్లు కేటాయించామని, అది 11.2 శాతం అవుతుందని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. మిషన్‌ భగీరథ నుంచి జగిత్యాల మున్సిపాలిటీకి బిల్లులు చెల్లించా లంటూ నోటీసులు పంపారని భట్టి పేర్కొనగా ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ పేరును మిషన్‌ భగీరథగా మార్చామ ని, కాంగ్రెస్‌ హయాంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని మాత్రమే అధికారులు అడిగారన్నారు. భగీరథ నీటి వినియోగానికి సంబంధించి ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు.

పాత ప్రాజెక్టులు పూర్తి చేసుంటే
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టులను యథాతథంగా పూర్తి చేసి ఉంటే ఇప్పటికే తెలంగాణకు ఎంతో మేలు జరిగి ఉండేదని భట్టి పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ. 28 వేల కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉండేదని, అదే జరిగి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చి ఉండేదన్నారు. ఇందిర, రాజీవ్‌ సాగర్‌లను రూ. 1,500 కోట్ల వ్యయంతో పూర్తి చేయగలిగి ఉండేవారమని, దానివల్ల పూర్వపు ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు లభ్యత ఉండేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement