‘మహా’ పొత్తు కుదిరింది  BJP and Shiv Sena to contest the Maharashtra elections | Sakshi
Sakshi News home page

‘మహా’ పొత్తు కుదిరింది 

Published Tue, Oct 1 2019 2:57 AM | Last Updated on Tue, Oct 1 2019 9:39 AM

BJP and Shiv Sena to contest the Maharashtra elections - Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చామని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటిస్తారని బీజేపీ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ సోమవారం ప్రకటించారు. తమ కూటమిలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, రాష్ట్రీయ సమాజ్‌ ప„ŠS, శివ సంగ్రామ్‌ సంఘటన్, రైతు క్రాంతి సేన కూడా ఉన్నాయని శివసేన నేత సుభాష్‌ దేశాయ్‌ చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని శివసేన నేత, ఉద్ధవ్‌ ఠాక్రే పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రకటించారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రేనే కావడం విశేషం. ముంబైలోని వర్లి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదిత్య వెల్లడించారు.

వర్లి సేన బలంగా ఉన్న స్థానాల్లో ఒకటి. 1966లో బాల్‌ ఠాక్రే శివసేనను స్థాపించినప్పటి నుంచి ఆ కుటుంబసభ్యులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజ్యాంగ పదవులు పొందలేదు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే (బాల్‌ ఠాక్రే సోదరుడి కుమారుడు) 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కానీ తరువాత మనసు మార్చుకున్నారు. ఎక్కువ స్థానాల్లో శివసేన గెలిస్తే ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారని సేన వర్గాలు చెబుతున్నాయి. ఒక శివసైనికుడిని సీఎం చేస్తానని తన తండ్రి దివంగత బాల్‌ ఠాక్రేకు హామీ ఇచ్చానని శనివారం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించడం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఫలితాల అనంతరం అదే సంవత్సరం డిసెంబర్‌లో బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరింది. 

ఎంఎన్‌ఎస్‌ పోటీ 
ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం. గెలుస్తాం’ అని ఆయన సోమవారం ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది ఆయన ప్రకటించలేదు. కానీ సుమారు 125 సీట్లలో ఎంఎన్‌ఎస్‌ పోటీ చేయొచ్చని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ముంబై, పుణె, నాసిక్, థానె, పాల్ఘార్‌.. తదితర పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ బరిలో నిలిచే అవకాశముంది. అయితే, ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్న ముంబైలోని వర్లి స్థానంలో ఎంఎన్‌ఎస్‌ అభ్యర్థిని నిలుపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement