యథా మోదీ తథా ఇమ్రాన్‌ ఖాన్‌! | Anti-India Rhetoric Played A Role In Pakistan Elections | Sakshi
Sakshi News home page

యథా మోదీ తథా ఇమ్రాన్‌ ఖాన్‌!

Published Fri, Jul 27 2018 2:06 PM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM

Anti-India Rhetoric Played A Role In Pakistan Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ ఎన్నికల్లో విజయం తనదేనని భావించిన ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి, తాను భారత్‌తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్నానని, కశ్మీర్‌పై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇమ్రాన్‌ ఖాన్‌తో పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ కుమ్మక్కయిందని, ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశానికి ప్రధాని అయితే భారత్‌కు ముప్పేనంటూ విశ్లేషణలు వెల్లువెత్తిన నేపథ్యంతో అనూహ్యంగా ఆయన నుంచి శాంతి చర్చల మాట వెలువడడం ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ అదొక వ్యూహం.

ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల ప్రచారమంతా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు. అహ్మది తెగ బహిష్కరణను తీవ్రంగా సమర్థించిన విషయాన్ని ఎలా మరచిపోతారు (అహ్మది తెగవారు ముస్లింలు కాదంటూ 1973లో జుల్ఫీకర్‌ అలీ భుట్టో నిషేధం విధించగా, జనరల్‌ జియా ఉల్‌ హక్‌ ఏకంగా 1984లో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు) మైనారిటీలను చిత్ర హింసలకు గురిచేస్తున్న మత విద్రోహ రాక్షస చట్టాన్ని ఇమ్రాన్‌ వెనకేసుకొస్తున్న విషయాన్ని, తాలిబన్‌ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా తాలిబన్‌ ఖాన్‌గా ముద్రపడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు! ఇప్పుడు చర్చలకు సిద్ధమంటే ఎవరు నమ్ముతారు!!

అంతా ఒక వ్యూహం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అనుసరించిన వ్యూహమే అది. పాకిస్థాన్‌ బూచిని చూపించి దేశభక్తి పేరిట ఓట్లు దండుకోవడమే ఆ వ్యూహం. ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పాక్‌ పేరునే జపిస్తుంది. వ్యూహానికి ప్రతి వ్యూహంగా నరేంద్ర మోదీని విమర్శించే అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని నవాజ్‌ షరీఫ్‌కు ప్రియమిత్రుడని కాంగ్రెస్‌ పార్టీ సంబోధిస్తోంది. 2015లో మోదీ అనూహ్యంగా పాక్‌ వెళ్లి నవాజ్‌ షరీఫ్‌ను కలుసుకున్న విషయం తెల్సిందే.

బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ వ్యూహాన్ని అనుసరించిందో ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా తన ఎన్నికల ప్రచారంలో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ భారత్‌ను తిడుతూ వచ్చారు. ఎన్నికలు ముగిశాయి. ఇక ఆ అవసరం లేదు. భారత్‌ను నిజంగా ఇరుకున పెట్టాలంటే చర్చల ప్రక్రియను ముందుకు తీసుకరావడమే. పైగా అంతర్జాతీయ సమాజం ముందు మంచి మార్కులు కొట్టేయవచ్చు. అందుకనే చర్చల ప్రతిపాదన చేశారు. అందుకు స్పందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ లబ్ధి పొందాలంటే పాకిస్తాన్‌తో వియ్యానికి బదులు కయ్యానికి కాలుదువ్వాలి. అందుకు కశ్మీర్‌ భారత్‌కు ఎప్పుడూ ఆయుధమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement