‘బదులు’ తీర్చుకునే శిక్ష.. సంస్కరణేనా? | Rajya Sabha passes Juvenile Justice Bill | Sakshi
Sakshi News home page

‘బదులు’ తీర్చుకునే శిక్ష.. సంస్కరణేనా?

Published Thu, Dec 24 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

‘బదులు’ తీర్చుకునే శిక్ష.. సంస్కరణేనా?

సందర్భం:
జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 (జె.జె. యాక్ట్ బాల న్యాయ చట్టం)కు 2014లో రాసిన ముసాయిదా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. గతంలోనే లోక్‌సభ ఆమోదించింది కనుక ఇది చట్టంగా మారింది. దీని ప్రకారం దారుణ నేరాలు (అంటే ఏమిటో నిర్వచనం చెప్పలేదు) చేసినవారు 16 -18 ఏళ్ల మధ్యవారయినా వారిని జువెనైల్ బోర్డు విచారించి పెద్దలతో సమానంగా సాధారణ కోర్టులకు, తర్వాత శిక్ష పడితే పెద్దల జైలుకు పంపవచ్చన్నమాట. సవరణకు ప్రధాన కారణం నిర్భయ కేసులో ఒక నిందితుడు మైనర్ కావడం వలన మూడేళ్ల జువెనైల్ హోమ్‌లో ఉండి విడుదల కావటం. నిర్భయ తల్లిదండ్రుల దుఃఖాన్ని, దానికి లభిస్తున్న సానుభూతిని, దానిలో అంతర్గతంగా దాగిన.. గత మూడేళ్లుగా అత్యాచారాలు తగ్గడం లేదన్న ఆక్రోశాన్ని ఉపయోగించి భిన్నాభిప్రాయాల్ని రాజ్యసభలో పూర్వపక్షం చేశారు. దారుణ ఘటనను అందరూ నిరసించాలి. అయితే ఏ శిక్ష కూడా ఒక ప్రజాస్వామ్య నాగరిక న్యాయ వ్యవస్థలో ‘బదులు’ తీర్చుకునేదిగా ఉండరాదు.

 ఒక పరిణతి చెందిన సమాజం ఎంతో అరుదైన, ఘోరమైన ఒక నేరం వల్ల పెల్లుబికిన దుఃఖంపై ఆధారపడి చట్టాలు చేయడం న్యాయం మౌలిక సూత్రాలకే భంగం కలిగిస్తుంది. ఈ చట్టం కావాలన్న వారు.. 16-18 ఏళ్ల కౌమార వయస్కులు లైంగిక నేరాలు చేయడం వేగంగా పెరుగుతున్నదనీ, ఈ కాలంలో బాలల్లో మానసిక పరిణతి చాలా వేగంగా జరుగుతున్నదనీ, వయస్సును అడ్డం పెట్టుకుని నేరాలు నిర్భయంగా చేస్తున్న వారికి కఠిన శిక్ష తప్పవనే సందేశం పంపాలనీ, దానివల్ల స్త్రీలు, బాలికలకు రక్షణ లభిస్తుందనీ చెబుతున్నారు.

 ఇక మానసిక పరిణతికి సంబంధించి చూస్తే.. కౌమార వయస్సులో మానసిక, శారీరక భావోద్వేగ పరమైన, మెదడులో నిర్మాణాత్మకమైన తీవ్ర మార్పులు జరుగుతాయని బాలలతో పని చేసే వారందరికీ తెలుసు. మెదడులో వైట్ మ్యాటర్ పెరిగి, గ్రే మ్యాటర్ తగ్గుతుంది. భావోద్వేగాల నియంత్రణ విభాగానికి, అనుభూతి సమాచార విభాగానికి మధ్య పూర్తిస్థాయి సమన్వయం 16 ఏళ్లతో ప్రారంభమై 20 ఏళ్ల దాకా కొనసాగుతుంది. 16 ఏళ్లకే పోటీలకు సంబంధించిన నిర్ణయాలు చేయగలిగే శక్తి ఏర్పడుతుంది. కాని చేస్తున్నది తప్పని తెలిసినా, దాని ఆధారంగా నియంత్రించుకునే శక్తి ఇంకా ఏర్పడదు. అట్లాగే ప్రమాదాన్ని ఫలితాల్ని, చట్టాల్ని, శిక్షల్ని తక్కువగా ఊహిస్తారు. ప్రతికూల ప్రభావాలు పనిచేయటం, స్థిరత్వం దూరదృష్టి లేకపోవడం ఈ 16-18 ఏళ్ల వయస్సు లక్షణాలు - వారిని పెద్దలుగా భావించి విచారించవచ్చనడాన్ని ఏ అధ్యయనమూ ఆమోదించడం లేదు. కనుకనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సవరణల బిల్లును రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన అని చెప్పినా కేబినెట్ దాన్ని ఖాతరు చేయలేదు.

 ఇక కఠిన శిక్షల విషయం చూస్తే అమెరికా 90లలో బాలల నేరాల పట్ల తీవ్ర చర్యలు చేపట్టింది. కొన్ని రాష్ట్రాల్లో 10 ఏళ్ల వారినైనా పెద్దలతో సమంగా విచారించవచ్చు. కాని అనేక పరిశోధనల ఫలితంగా 2005 నుండి వైఖరి మార్చుకుంటున్నది. ఈ కఠిన శిక్షల వల్ల నేరాల నివారణ జరగలేదు సరికదా కరడుగట్టిన నేరస్తులతో గడిపి అత్యాచారాలకు ఎర అయ్యి ఈ బాలలు కరడుగట్టిన నేరస్తులుగా సమాజంలోకి ప్రవేశిస్తున్నారు. కనుకనే ఇప్పుడు జైళ్లు మూసి వేసి ఆ డబ్బు పునరావాసంపైనా, కమ్యూనిటీలో భాగంగా బాలల్ని సరిదిద్దడం పైనా ఖర్చు చేయాలని ప్రయత్నం చేస్తున్నది.

 ఈ చట్టం వల్ల కౌమార ప్రేమికులు నేరస్తులుగా ముద్రపడి పెద్దల జైలుకి వెళతారు. బాలనేరస్తులు పెద్దల జైలుకే వెళతారు. మన జైళ్లలో ఖైదీలలో పరివర్తన తెచ్చే ప్రయత్నం అటుంచి వారిని మనుషులుగా కూడా పరిగణించరు. అంటే 7 ఏళ్లు, 10 ఏళ్లు శిక్ష అనుభవించిన జైలు అనుభవంతో జిత్తులు నేర్చిన నేరస్తులుగా బాలలు యువకులుగా సమాజంలో తిరిగి ప్రవేశించడం దేనికి దారితీస్తుంది? దారుణ నేరాలు చేసిన బాలల కోసం ప్రత్యేక విచారణ, స్వల్పకాలపు శిక్షలు సంస్కరణా సంస్థలు ఎందుకు ఆలోచించకూడదు. ఒకసారి నేరం చేస్తే దాన్ని సరిచేసుకునే అవకాశం ఇవ్వకపోవటం ఏ మానవత్వానికి ప్రతీక?

 కఠిన శిక్షల బెదిరింపు పనిచేస్తే ‘నిర్భయ’ సవరణల తర్వాత లైంగిక దాడులు తగ్గాలి కదా! పెద్దలే శిక్షలకు భయపడనప్పుడు వివక్షపై అంచనా సరిగా లేని ఉద్రేకపూరిత కౌమార వయస్కులను ఈ కఠినత్వం ఆపుతుందా? ఈ బాలనేరస్తుల్లో 55 శాతం మంది కుటుంబ ఆదాయం ఏడాదికి 25 వేలు. వలసలు, ఛిద్రమైన కుటుంబాలు, బూతును నిరంతరం చూడటం, వారు చిన్నప్పటి నుండి శారీక, మానసిక, లైంగిక హింసకు బాధితులుగా ఉండటం, అత్యధికులు ప్రాథమిక విద్యలేని వారు కావడం, ఇంటాబయటా నిర్లక్ష్యానికి ఎరకావడం.. బాల నేరస్తుల జీవిత సాధారణ సత్యాలు.. ఒక కనీసపు బాల్యాన్ని భద్రతని చివరికి ఆహారాన్ని కూడా ఇవ్వడంలో విఫలమైన సామాజిక రాజకీయ వ్యవస్థలు వారిని నేరస్తులుగా మార్చడానికి బాధ్యులు కాదా?

ఇప్పటికైనా ఈ నేరమయ ప్రవర్తనల మూలాలకు బాధ్యత తీసుకుని బాలలకు మరొక అవకాశం ఇవ్వడం ఈ వ్యవస్థల కనీస ధర్మం కాదా? జువెనైల్ హోమ్స్ ఏ సౌకర్యాలూ లేకుండా అత్యాచారాలకు మాదకద్రవ్యాలకు నిలయాలుగా ఉన్నా యని జస్టిస్ వర్మ కమిషన్ పేర్కొంది. వాటిని బాగు చేయటం ఎవరి బాధ్యత?

 నిర్భయ సవరణలలో 16 ఏళ్లలోపు అని ఒకచోట 18 ఏళ్లలోపు అని మరొక చోట బాలల వయస్సు రాశారు.  15ఏళ్లు దాటిన బాలికతో ఆమె భర్త లైంగిక సుఖం పొందితే (అతని వయస్సు ఎంతైనా) నేరం కాదని రాశారు. అంటే 18ఏళ్లలోపు మైనర్ బాలికల్ని లైంగిక అత్యాచారం చేసే హక్కుని నిర్భయంగా భర్తలకే కట్టబెట్టిన దేశం.. ఏ స్త్రీలకి రక్షణ కల్పిస్తుంది? ఒకే చట్టంలో, వివిధ చట్టాల్లో పరస్పర విరుద్ధాంశాలు ఏ రకమైన న్యాయం చేస్తాయి? వీటినెందుకు పట్టించుకోరు?

 ఈ సవరణలు రాజ్యాంగ స్ఫూర్తిని, బాలలుగా ఒక కొత్త జీవితాన్ని పొందే హక్కుని, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందంలో 37, 38 ఆర్టికల్‌ని- ఉల్లంఘిస్తున్నాయి. కనుకనే సుప్రీంకోర్టు ‘‘మీరు అతడ్ని నిరవధికంగా నిర్బంధించాలని కోరుతున్నారా? సంస్కరించాలని కోరుతున్నారా?’’ అని ప్రశ్నించింది. బాలలకు విధించే ఏ శిక్షయినా సంస్కరణకూ పునరావాసానికి దారితీయాలి. కొత్త నేరస్తుల్ని ఉత్పత్తి చేయడానికి కాదు.
 వ్యాసకర్త సామాజిక కార్యకర్త, దేవి  
 మొబైల్ : 9848622829

Advertisement
 
Advertisement
 
Advertisement