అయోధ్యలో ఘనంగా దీపోత్సవం | Yogi Adityanath Celebrates Grand Diwali in Ayodhya | Sakshi
Sakshi News home page

అయోధ్యలో ఘనంగా దీపోత్సవం

Published Thu, Oct 19 2017 3:03 AM | Last Updated on Sat, Aug 25 2018 4:19 PM

Yogi Adityanath Celebrates Grand Diwali in Ayodhya - Sakshi

అయోధ్య: పురాణ పురుషుడు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య పులకించింది. సరయు నదీ తీరం ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలతో మార్మోగింది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా దీపోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. శ్రీరాముడు, సీతాదేవి వేషధారణలో ఉన్న కళాకారులు పష్పక విమానాన్ని పోలిన ప్రత్యేక హెలికాప్టర్‌లో రామ్‌ కథా పార్కుకు చేరుకున్నారు.

14 ఏళ్ల వనవాసం ముగించుకుని శ్రీరాముడు, సీతాదేవి అయోధ్యలో అడుగుపెట్టిన క్షణాలను గుర్తుచేసేలా ఉన్న ఆ దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. రామాయణంలోని వివిధ పాత్రలు ధరించిన కళాకారులు రామ్‌లీలా వేదికకు చేరుకుంటున్న సమయంలో వారిపై పూల వర్షం కురిసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్‌ రామ్‌ నాయక్, కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్‌ శర్మ తదితరులు హాజరయ్యారు.

దీపోత్సవంలో భాగంగా నదీ తీరంలో 1.71 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో నిర్వహించిన 22 నిమిషాల లేజర్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దాదాపు ప్రభుత్వ యంత్రాంగమంతా అయోధ్యలోనే మకాం వేయడం గమనార్హం. అయోధ్యను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేయడానికే  ‘త్రేతా యుగం నాటి దీపావళి’ని ప్రజల కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేశామని యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. అయోధ్య నగర్‌ నిగమ్‌లో ఉన్న జనాభా 1.71 లక్షలని దానికి సమాన సంఖ్యలోనే దీపాలు వెలిగించినట్లు తెలిపారు.

నిజమైన రామరాజ్యమిదే: సీఎం యోగి
పేదరికం, వివక్ష, దుఃఖం లేని రాజ్యమే రామరాజ్యమని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అయోధ్య పట్టణాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ కోణంలో చూడొద్దని విమర్శకులను కోరారు. దీపోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...తానేం చేసినా కొందరు పనికట్టుకుని విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘రామరాజ్యం అనే భావనను ఇచ్చింది అయోధ్యే. ఇక్కడ పేదరికం, బాధలు, వివక్షలకు చోటు లేద’ని అన్నారు ఈ భావనకు నిజమైన అర్థం..అందరికీ ఇళ్లు, విద్యుత్, ఎల్పీజీ సిలిండర్లు కల్పించడమేనని వివరించారు.

గత ప్రభుత్వాల మాదిరిగా తాము కులం, మతం ఆధారంగా పక్షపాతం చూపట్లేదని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరును రామరాజ్యంతో పోల్చిన యోగి...అయోధ్యకు పూర్వ వైభవం తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.  ‘అయోధ్య ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. ఎన్నో దాడులను ఓర్చుకుంది. ఇకపై అలా కుదరదు. ఇక్కడ రూ.133 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించాం.అయోధ్య ఘాట్లను సుందరీకరిస్తాం. ఉత్తరప్రదేశ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుగా అయోధ్యపై దృష్టిపెట్టాం ’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement