ఇస్రో విజయ విహారం | Isro successfully launches CARTOSAT-3 from Sriharikota | Sakshi
Sakshi News home page

ఇస్రో విజయ విహారం

Published Thu, Nov 28 2019 3:42 AM | Last Updated on Thu, Nov 28 2019 5:36 AM

Isro successfully launches CARTOSAT-3 from Sriharikota - Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి జయ కేతనం ఎగురవేసింది.  విజయాల పరంపరను కొనసాగిస్తూ షార్‌ నుంచి 74వ ప్రయోగాన్ని బుధవారం విజయవంతంగా ముగించింది. నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ ద్వారా 1625 కిలోలు బరువు కలిగిన కార్టోశాట్‌–3 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది.

14 ఉపగ్రహాలను భూమికి 509 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సర్క్యులర్‌ సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్‌)లో వివిధ దశల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగ విజయంతో ఈ ఏడాది అయిదు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్లయింది.  ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ బృందాన్ని ఆలింగనం చేసుకోగా, శాస్త్రవేత్తలు తమ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు.  శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు చెబుతూ ట్వీట్‌ చేశారు.

వచ్చే మార్చిలోపే 13 మిషన్ల ప్రయోగం
2020 ఏడాది మార్చి 31లోపు 13 మిషన్లను ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు. ఇందులో ఆరు లాంచింగ్‌ వెహికల్స్, 7 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు. రాబోయే నాలుగు నెలలు ఇస్రో కుటుంబం తీరికలేకుండా పనిచేయాల్సి ఉంటుందన్నారు. షార్‌ నుంచి 74 ప్రయోగాలు చేశారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 49సార్లు ప్రయోగించగా 47సార్లు సక్సెస్‌ అయ్యింది. పీఎస్‌ ఎల్‌వీ ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్లతో 21 ప్రయోగమిది. ఈ ఏడాది 5వ ప్రయోగం కావడం విశేషం. కార్టోశాట్‌ ఉపగ్రహాల సిరీస్‌లో ఈ ప్రయోగం తొమ్మిదవది.


మనదేశ ఖ్యాతి మరింత పైకి: జగన్‌
సాక్షి, అమరావతి: పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భూతల మ్యాపింగ్, ఛాయాచిత్రాలను మరింత అత్యాధునికంగా తీసి సమాచారాన్ని పంపే ఈ ఉపగ్రహాల ప్రయోగంతో ప్రపంచంలోనే మన దేశ ఖ్యాతిని శాస్త్రవేత్తలు అగ్రభాగాన నిలిపారని జగన్‌ ప్రశంసించారు. ఈ ప్రయోగాలను విజయవంతం చేయడం ద్వారా ఇస్రో మరో మైలురాయిని చేరుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు.

కేసీఆర్‌ అభినందనలు..
సాక్షి, హైదరాబాద్‌: పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యం, కృషికి ప్రస్తుత విజయం తార్కాణంగా నిలుస్తుందన్నారు.

దేశీయ అవసరాలకే కార్టోశాట్‌–3
దేశీయ బౌగోళిక అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్‌ సిరీస్‌ ఉపగ్రహ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. కార్టోశాట్‌ సిరీస్‌లో ఇప్పటికే ఎనిమిది ఉపగ్రహాలను పంపించగా, ఇది తొమ్మిదవది. కార్టోశాట్‌–3 థర్డ్‌ జనరేషన్‌ ఉపగ్రహం కావడం విశేషం. గతంలో ప్రయోగించిన కార్టోశాట్‌ ఉపగ్రహాల కంటే ఈ ఉపగ్రహం అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ప్రాంకోమాటిక్‌ మల్టీ స్ప్రెక్ట్రరల్‌ కెమెరాలు అత్యంత శక్తిమంతమైనవి.

దీనిద్వారా పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ,  నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌లు తయారు చేయడం, విపత్తులను విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రత్యేకించి నిఘాలో సైనిక అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతోంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు సేవలు అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement