పింక్ స్లిప్‌పై కన్నెర్ర government fire's on pink slip | Sakshi
Sakshi News home page

పింక్ స్లిప్‌పై కన్నెర్ర

Published Fri, Nov 7 2014 4:03 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

పింక్ స్లిప్‌పై కన్నెర్ర - Sakshi

* ఐటీ కంపెనీకి రూ.12.5 లక్షల జరిమానా
* ఆ మొత్తాన్ని బాధిత ఉద్యోగికి అందజేయాలని సర్కార్ ఆదేశాలు
* రాష్ట్రంలో ఇదే మొదటిసారి

 సాక్షి,బెంగళూరు : ‘పింక్‌స్లిప్’పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చూపించకుండా ఉద్యోగినిని విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీకి జరిమానా విధించింది. ఇలాంటి కేసు రాష్ట్రంలో ఇదే ప్రథమం. ఐటీ, బీటీ కంపెనీల్లో పింక్ స్లిప్ అన్నది సాధారణం. ఉద్యోగికి ఒక నెల జీతం ఇచ్చి విధులకు రాకుండా ఉండమని చెప్పడాన్నే ఐటీ ఇండస్ట్రీ పరిభాషలో ‘పింక్ స్లిప్’ అని అంటారు. అయితే కొన్ని కంపెనీల్లోని ఉన్నతోద్యోగులు ‘తమ మాట వినడంలేదు’ అనే నెపంతో తరుచుగా కింది స్థాయి ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తుంటారు.

ఈ విషయంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ‘పింక్ స్లిప్’ విధానానికి అడ్డుకట్టవేయడానికి నూతన చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఇక ఏ కంపెనీ అయినా ఓ ఉద్యోగికి పింక్ స్లిప్ ఇస్తే అందుకు గల కారణాలను రాష్ట్ర కార్మిక శాఖకు తప్పక తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాక పింక్ స్లిప్‌కు గురైన ఉద్యోగి కంపెనీ నిర్ణయాన్ని కార్మికశాఖ వద్ద సవాలు చేయవచ్చు. అకారణంగానే కంపెనీ ఉద్యోగిని తొలగించినట్లు కార్మికశాఖ పరిశీలనలో తేలితే సదరు సంస్థ బాధిత ఉద్యోగికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
 
మొదటి విజయం..
అమెరికా కేంద్రంగా ఐటీ కంపెనీ నడుపుతున్న సంస్థకు బెంగళూరులోని ఓల్డ్ మద్రాస్ రోడ్డులో ఓ శాఖ ఉంది. ఢిల్లీకి చెందిన లక్ష్మి (పేరు మార్చాం) 2012 జూలైలో టెక్నికల్ సిస్టం అనలిస్ట్‌గా ఈ సంస్థలో ఉద్యోగంలో చేరారు. మూడు నెలల ప్రొబేషనరీ కాలం తర్వాత ఆమెను ఉద్యోగిగా గుర్తిస్తూ సదరు సంస్థ ఆదేశాలు కూడా జారీ చేసింది. కష్టపడి పనిచేసే విధానం వల్ల ఆమెకు తర్వాతి ఏడాది జీతాన్ని 8 శాతం పెంచుతూ సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో మిగిలిన ఉద్యోగులకు 5 శాతం మాత్రమే జీతంలో పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. అంతేకాాకుండా బోనస్ రూపంలో రూ.56 వేలను అందుకుంది. మరోవైపు లక్ష్మి పనితనాన్ని మెచ్చుకుంటూ అమెరికాలోని కంపెనీ వారు ప్రసంశాపత్రాన్ని (అప్రిషియేషన్ లెటర్)ను కూడా పంపిచారు. ఆతర్వాతే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

సంస్థలోనో ఓ మేనేజర్ ఆమెను వివిధ రకాలుగా వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయాలన్ని కంపెనీ హెచ్‌ఆర్‌తో పాటు మిగిలిన ఉన్నతాధికారులకు ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది.  పై పెచ్చు అదే ఏడాది అక్టోబర్‌లో హెచ్‌ఆర్ నుంచి లక్ష్మి పింక్‌స్లిప్ అందుకున్నారు. కారణం అడిగినా ఎటువంటి సమాధానం చెప్పకుండా లక్ష్మిని సెక్యూరిటీ గార్డుతో బయటికి పంపించేశారు. కనీసం తన బ్యాగు, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు తీసుకోవడానికి కూడా ఆమెకు అవకాశం కల్పించలేదు. ఈ విషయమై లక్ష్మి హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చివరికి ఆమె కానిస్టేబుళ్ల ద్వారా తన వస్తువులు తీసుకున్నారు.

అనంతరం ఆమె మానసిక ఆరోగ్యంగా కూడా  క్షీణించింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.  ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇదిలా ఉండగా తనకు జరిగిన అన్యాయంపై లక్ష్మి  రాష్ట్ర మహిళా కమిషన్,  రాష్ట్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. కేసును పరిగణనలోకి తీసుకున్న అనంతరం కార్మికశాఖ  ఆ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది.  కంపెనీ, బాధిత ఉద్యోగి వాదోపవాదాలు ఈ ఏడాది జులై 14 నుంచి సెప్టెంబర్ వరకూ కార్మికశాఖలో సంబంధిత అధికారుల సమక్షంలో కొనసాగాయి.

చివరికి సరైన కారణాలు చూపకుండానే లక్ష్మికి  పింక్‌స్లిప్ ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. ఆమెకు జరిగిన నష్టానికి రూ.12.5 లక్షలను పరిహారంగా అందించాలని కంపెనీకి ఆదేశించారు. అంతేకాకుండా సెప్టెంబర్ వరకూ ఆమె సదరు సంస్థలో ఉద్యోగం చేసినట్లు, ఆరోగ్య సమస్యల వల్ల ఆమే కంపెనీకి రాజీనామా చేసినట్లు కూడా సదరు కంపెనీ సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా అధికారులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని వల్ల లక్ష్మికి మరో చోట ఉద్యోగం సులభంగా లభిస్తుందనేది అధికారుల భావన.

అధికారుల సూచనలకు అటు కంపెనీ ప్రతినిధులతో పాటు ఇటు లక్ష్మి కూడా అంగీకరించారు. ఇదిలా ఉండగా కంపెనీ చెక్ రూపంలో అందించిన పరిహారం ప్రస్తుతం రాష్ట్ర కార్మికశాఖ వద్ద ఉందని ఆ శాఖ అదనపు కమిషనర్ జింకాలప్ప స్పష్టం చేశారు. కాగా, జరిమానా చెల్లించిన కంపెనీ దాదాపు 20 ఏళ్లుగా భారత్‌లో ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement