కేజ్రీవాల్, బేడీ అవకాశవాదులు | Delhi polls: Arvind Kejriwal, Kiran Bedi opportunists of first order, says Congress | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్, బేడీ అవకాశవాదులు

Published Sun, Jan 18 2015 12:55 AM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

కేజ్రీవాల్, బేడీ అవకాశవాదులు - Sakshi

* హజారేను అడ్డుపెట్టుకుని రాజకీయాలు
* ఆప్, బీజేపీలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్

 
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వారిద్దరూ అవకాశవాదులని ఆరోపించింది. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన పార్టీలకు ఎన్నికల వేళ మెరుగులద్దే పని పెట్టుకున్నారని, అవకాశవాదులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి అజయ్ మాకెన్ శనివారం పేర్కొన్నారు.
 
  కేజ్రీవాల్, బేడీ ఇద్దరూ అవినీతి వ్యతిరేక పోరాటం, అన్నా హజారేను అడ్డుపెట్టుకుని రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. వారిద్దరి మధ్య ఎలాంటి భేదం లేదని, వారు ఒకే నాణేనికి రెండు ముఖాల వంటి వారని విమర్శించారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేజ్రీవాల్ ఇచ్చిన అఫిడవిట్‌ను ఈ సందర్భంగా మాకెన్ విడుదల చేశారు. ఎర్ర బుగ్గలను వాడబోనని, పెద్ద భవంతుల్లో ఉండబోనని, అనవసర భద్రత వద్దని పలు మాటలు చెప్పిన కేజ్రీవాల్.. అధికారం చేతికి రాగానే ఆ మాటలన్నీ తప్పారని మండిపడ్డారు.
 
 తన 49 రోజుల పాలనలో కేజ్రీవాల్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఫలితంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలతో సోమవారం ఓ పుస్తకాన్ని తేనున్నట్లు అజయ్ మాకెన్ వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యంకాకే ఆయన అధికారాన్ని వదిలి పారిపోయారని ధ్వజమెత్తారు. ఇక బేడీ, షాజియా వంటి బయటివారిని పార్టీలో చేర్చుకుంటూ బీజేపీ తన బలహీనతను చాటుకుంటోందన్నారు. మరోవైపు బీజేపీలో కిరణ్ బేడీ చేరికపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అసంతృప్తిగా ఉన్నారని వస్తున్న కథనాలను సంఘ్ పరివార్ తోసిపుచ్చింది. అవన్నీ అవాస్తవమని పేర్కొంది. దీన్ని బీజేపీ, సంఘ్ పరివార్ మధ్య చీలిక తెచ్చేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రధాని నరేంద్ర మోదీ పరువు పోకుండా ఉండేందుకే కిరణ్ బేడీని బీజేపీలో చేర్చుకున్నారని ఆప్ ధ్వజమెత్తింది. ఢిల్లీకి రాష్ర్ట హోదా ఇచ్చే అంశంపై ఆ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement