జై బోలో గణేశ్ మహారాజ్‌కీ.. | Chaturthi is celebrated gloriously | Sakshi
Sakshi News home page

జై బోలో గణేశ్ మహారాజ్‌కీ..

Published Thu, Sep 4 2014 10:35 PM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

Chaturthi is celebrated gloriously

దాదర్, న్యూస్‌లైన్ : నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకొంటున్నారు.  వినాయకుడి విగ్రాహాల వద్ద ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వీధులన్నీ జైబోలో గణేష్ నామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ప్రజలను వివిధ సామాజిక అంశాలపై కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నాయి.

 గణేష్ మండళ్లు ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ అంశాలపై పోస్టర్లు, మ్యానిక్వీన్‌లు, లైట్ అండ్ సౌండ్ షోలను ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. పెద్దలను ఎలా గౌరవించాలి, వృద్ధులైన తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోంలకు తరలించ కూడదు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సెల్ ఫోన్, సెల్ టవర్లపట్ల పొంచి ఉన్న ప్రమాదాన్నికూడా షోల ద్వారా తెలియజేస్తున్నారు.  

 వినూత్న సెట్టింగ్‌లు
 కేత్‌వాడి ఖమ్‌బాతా లేన్ సార్వజనిక్ గణేషోత్సవ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేయడానికి 20 అడుగుల గణేష్ విగ్రహాన్ని పచ్చని చెట్టుపై ఉండేలా వినూత్నంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలపై  6 నిమిషాల పాటు భక్తులకు కళ్లకు కట్టినట్లు ఆడియో విజువల్స్ ద్వారా లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మిమిక్రీ కళాకారుడు ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను ఆయా మండళ్లు ఏర్పాటు చేశాయి.

 శివ్డి మధ్య విభాగ్ గణపతి సార్వజనిక్ గణేషోత్సవ్ మండలి ఆధ్వరం్యలో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా కలిగే అనర్థాలను ప్రదర్శనల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. యువతను వీటి వల్ల అప్రమత్తం చేస్తున్నామని మండలి సభ్యులు పేర్కొన్నారు. సెల్ టవర్ల ద్వారా కూడా ముప్పు పొంచి ఉన్నదనే అంశాన్ని తెలియజేస్తున్నామన్నారు.

 అవినీతి, వరకట్న దురాచారంపై
 అంధేరీకి చెందిన ఈశ్వర్ తరూణ్ మిత్ర మండలి వారు అవినీతికి , వరకట్నం దురాచారానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బాల్ గోపాల్ మిత్ర మండలి వారు వృద్ధులైన తమ తల్లిదండ్రులను చూసుకోవాలని వారిని ఆశ్రమాలకు పంపకూడదని సూచిస్తున్నారు. పౌరాణిక పాత్రలైన శ్రావణ్ బాల్, రాముడు, భక్త పుండరీకుడు ఇంకా తదితరులనూ స్ఫూర్తిగా తీసుకోవాలిని తెలియజేస్తున్నారు. ఫైబర్‌తో తయారు చేసిన విగ్రహాల ద్వారా పెద్దలను ఎలా గౌరవించాలన్న అంశాన్ని చాటి చెబుతున్నారు.

 డోంబివలిలో .....
 ముంబై శివారు ప్రాంతమైన డోంబివలి పట్టణంలో గణపతి ఉత్సవాలు జోరందుకున్నాయి. పలు యువ సేవా మండళ్లు గణపయ్య విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి భక్తులకు కనువిందు కలిగిస్తున్నారు. ఒకటిన్నర రోజు, ఐదు రోజుల గణపతి నిమజ్జనం చేశారు. పట్టణంలోని మండళ్లలో ఏర్పాటు చేసిన స్వామివారి సందర్శనార్థం భక్తుల తరలివస్తున్నారు. డోంబివలిలోని సాయినాథ్ మిత్రమడల్, అచానక్ సార్వజనీక మిత్ర మండల్, ఆటో రిక్షా చాలక్ సంఘటన, యువ మిత్ర మండలి తదితర యువసేన మండళ్లు ప్రతి రోజు స్వామివారికి నిత్య పూజల నిర్వహిస్తున్నారు.

 సందర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని మండళ్లు భక్తి సంగీత భజనలు, నృత్య పోటీలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక అవతారాలతో కొలువుదీరిన గణపయ్యను కనులారా తిలకించి భక్తులు పులకించిపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement