ప్రజారవాణా వాహనాల్లో సీసీ కెమెరాలు cc cameras in public transport service | Sakshi
Sakshi News home page

ప్రజారవాణా వాహనాల్లో సీసీ కెమెరాలు

Published Fri, Jan 3 2014 12:43 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

cc cameras in public transport service


 
 న్యూఢిల్లీ: మహిళల రక్షణ కోసం పలు చర్యలకు కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. ప్రజా రవాణా వ్యవస్థలో వారికి భద్రత కల్పించే దిశగా రూ.1,405 కోట్ల పథకానికి గురువారం ఆమోదముద్ర వేసింది. ఈ పథకంలో భాగంగా ప్రజారవాణా వాహనాల్లో జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఆధారిత వ్యవస్థ, క్లోజ్డ్ సర్క్యూట్) కెమెరాలు, అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందించేలా అలారం బటన్లను ఏర్పాటు చేస్తారు. వాహనాల ప్రయాణ మార్గాలను పర్యవేక్షిస్తారు.  పదిలక్షల జనాభా దాటిన 53 నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొదటిదశలో 32 నగరాల్లోని ప్రజా రవాణా వాహనాల్లో పై చర్యలు చేపడ్తారు. జాతీయ స్థాయిలో ‘నేషనల్ వెహికల్ సెక్యూరిటీ అండ్  ట్రాకింగ్ సిస్టమ్’గా, రాష్ట్ర స్థాయిలో ‘సిటీ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్’గా వ్యవస్థలను ఏర్పాటు చేసి, నిధులు సమకూర్చిన రెండు సంవత్సరాల్లోగా ఈ పథకం కార్యరూపం దాలుస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థికమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఈ వ్యవస్థ ఆధారంగా ప్రయాణాల సందర్భంగా ఆపదలో ఉన్న మహిళ ఉన్న ప్రాంతాన్ని అతి తక్కువ సమయంలో చేరుకుని, వారికి సాయం అందించడానికి వీలవుతుందన్నారు. మహిళల రక్షణ ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వ ఆమోదం పొందిన మొదటి పథకం ఇదే కావడం విశేషం. అన్ని మొబైల్ ఫోన్లలో తప్పకుండా ‘ప్యానిక్ బటన్(ప్రమాద సమయంలో పోలీసులు, ఇతర సంబంధీకులను అప్రమత్తం చేసే బటన్)’ ఉండాలన్న ప్రతిపాదనకు కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపామన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) దీనితో పాటు పలు ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. అవి..
 
     58 నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం: కేంద్ర ఆర్థిక సాయంతో రాష్ట్రాల్లో ఈ కాలేజీలను ఏర్పాటుచేస్తారు. ఇందులో భాగంగా పలు జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మారుస్తారు. వీటిలో ప్రతి కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన నిధుల్లో కేంద్రం వాటా రూ. 8,457 కోట్లు కాగా, రాష్ట్రాలు రూ. 2,513 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఒక్కో కాలేజీ ఏర్పాటుకు రూ. 189 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 381 మెడికల్ కాలేజీల్లో ఇప్పటివరకు దాదాపు 50 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ఈ నిర్ణయం కార్యరూపం దాల్చిన తరువాత ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
 
     ఐఎల్‌డీపీకి ఆమోదం: 12వ పంచవర్ష ప్రణాళిక కాలం(2012-17)లో దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 990 కోట్లతో ‘ఇండియన్ లెదర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్’ను అమలు చేస్తారు. ఈ పథకం కింద దాదాపు 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తారు.
 
     భారీ ఓడరేవులకు సంబంధించిన భూముల నిర్వహణకు సంబంధించిన విధాన మార్గదర్శకాలకు కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. వీటివల్ల వాటి అధీనంలో ఉన్న భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
 
     విద్యుత్ వ్యవస్థ అభివృద్ధి నిధిని వినియోగించే ఉద్దేశంతో విద్యుత్ శాఖ పేర్కొన్న పలు ప్రతిపాదనలకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా అంతర్రాష్ట్ర పంపిణీ వ్యవస్థలో లోపాలను అధిగమించేందుకు ఆ నిధులను వినియోగిస్తారు.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement