ఎంపీల అలవెన్సు పెంపునకు ఓకే | Cabinet Approves Anti-Human Trafficking Bill, Hike in MPs’ Salary | Sakshi
Sakshi News home page

ఎంపీల అలవెన్సు పెంపునకు ఓకే

Published Thu, Mar 1 2018 2:06 AM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM

Cabinet Approves Anti-Human Trafficking Bill, Hike in MPs’ Salary - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులకు అందజేస్తున్న అలవెన్సులను పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఎంపీలకు ప్రతినెల చెల్లించే నియోజకవర్గ అలవెన్సు రూ.45 వేల నుంచి రూ.70 వేలకు చేరుకోనుంది. అలాగే ఆఫీస్‌ ఖర్చుల కోసం అందిస్తున్న అలవెన్సు మొత్తం రూ.45 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోనుంది. వీటికి అదనంగా ఐదేళ్లకోసారి అందించే ఫర్నీచర్‌ అలవెన్సును రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అంతేకాకుండా ఎంపీల మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇవి వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  పార్లమెంటు సభ్యుడిపై ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ.2.70 లక్షల మేర ఖర్చుపెడుతోంది.


అక్రమరవాణా కేసులు ఎన్‌ఐఏకు: ఉగ్రవాద కేసుల్ని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు మనుషుల అక్రమరవాణా కేసుల్ని విచారించే బాధ్యతను కూడా కేంద్రం అప్పగించింది. ఈ మేరకు మనుషుల అక్రమ రవాణా(నిరోధం, రక్షణ , పునరావాసం) బిల్లు–2018కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం తరచూ మనుషుల్ని అక్రమంగా తరలించేవారికి యావజ్జీవశిక్ష కూడా విధించవచ్చు. ఎన్‌ఐఏలో ఏర్పాటుచేయనున్న ప్రత్యేక విభాగానికి నిర్భయ ఫండ్‌ నుంచి ఆర్థికసాయం అందిస్తారు.ప్రధానమంత్రి ఉద్యోగ కల్పనా కార్యక్రమం (పీఎంఈజీపీ) కాలపరిమితిని 2019–20 వరకూ పెంచుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.5,500 కోట్లను కేటాయించింది. దీంతో ఏటా 15 లక్షల చొప్పున మూడేళ్లలో 45 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది లక్ష్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement