‘ఆ సినిమాలకు’  తొలగిన అడ్డంకులు | Madras High court Green signal for Jayalalithaa biopic | Sakshi
Sakshi News home page

జయలలిత బయోపిక్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

Published Sat, Dec 14 2019 4:00 PM | Last Updated on Sat, Dec 14 2019 5:05 PM

Madras High court Green signal for Jayalalithaa biopic - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పలు చిత్రాల నిర్మాణాలకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయ్యాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ క్వీన్‌కు, నటి కంగనా రనౌత్‌ తలైవికి, నిత్యా మీనన్‌ ది ఐరన్‌ లేడీ చిత్రాలకు ఆటంకాలు తొలిగిపోయాయి. వీటి నిర్మాణాలను నిర్భయంగా జరుపుకోవచ్చు. అందుకు స్వయంగా మద్రాసు హైకోర్టునే పచ్చజెండా ఊపింది.  దర్శకుడు విజయ్‌... జయలలిత బయోపిక్‌ను తలైవి పేరుతో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం, అందులో జయలలిత పాత్రలో బాలీవుడ్‌ సంచలన నటి కంగనారనౌత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మహిళా దర్శకురాలు ప్రియదర్శిని దీ ఐరన్‌ లేడీ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనున్న సంగతి విదితమే. ఇకపోతే దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ జయలలిత జీవిత చరిత్రను నటి రమ్యకృష్ణ  టైటిల్‌ పాత్రలో క్వీన్‌ అనే వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు. కాగా వీటిని తన అనుమతి లేకుండా రూపొందించడాన్ని నిషేధించాలని జయలలిత సోదరుడి కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఒకసారి విచారణ జరిగింది. దీప పిటిషన్‌కు సమాధానం ఇస్తూ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు, విజయ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. 

గురువారం న్యాయమూర్తులు సెంథిల్‌కుమార్, రామమూర్తిల సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తులు జయలలిత బయోపిక్‌ను చిత్రాలుగా తెరకెక్కించడాన్ని నిషేధించలేం అని తీర్పునిచ్చారు. అయితే దర్శక నిర్మాతలు ఇది కల్పిత సన్నివేశాలతో రూపొందించినట్లు టైటిల్‌ కార్డులో ప్రకటించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే పూర్తి అయిన రమ్యకృష్ణ నటించిన వెబ్‌ సిరీస్‌ క్వీన్‌ శనివారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement