చాకిరి పోస్టు | no salary hike for gramin postal employees | Sakshi
Sakshi News home page

చాకిరి పోస్టు

Published Sun, Jan 21 2018 11:28 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

no salary hike for gramin postal employees - Sakshi

‘‘అందరికీ నువ్వు ఆప్త బంధువు. అందరికీ నువ్వు వార్తనందిస్తావు. నీ కథనం మాత్రం నీటిలోనే మథనం. ఇన్ని ఇళ్లు తిరిగినా నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపా లేదు.’’ అంటూ అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలో పోస్టుమన్‌ దీనస్థితిని తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన అర శతాబ్దం కిందటే కవిత రూపంలో వివరించారు. అయితే.. ఇప్పటికీ తపాలా ఉద్యోగుల జీవితాల్లో వెలుగు లేదు. చాలీచాలని వేతనాలతో అవస్థ పడుతున్నారు.


కర్నూలు (ఓల్డ్‌సిటీ): గ్రామీణ తపాలా ఉద్యోగులను గ్రామీణ డాక్‌ సేవక్స్‌  (జీడీఎస్‌లు) అని కూడా పిలుస్తారు. వీరు ఏళ్ల తరబడి అనేక అవస్థలు పడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరాలు, పార్శిళ్ల బట్వాడా, పొదుపు సభ్యులను చేర్పించడం, డిపాజిట్ల పెంపు, బీమా పాలసీలు చేయించడం వంటి పనులు చేస్తున్నారు. అయినా వీరికి వేతన భరోసా లేదు. పోస్టుమాస్టర్‌ స్థాయి ఉద్యోగికి కూడా నెలకు రూ.10 వేల వేతనం మించడం లేదు. జీడీఎస్‌లు రోజుకు మూడు నుంచి ఐదు గంటలు మాత్రమే సేవలు అందిస్తారని భావించిన ప్రభుత్వం.. గతంలో ఆ పని గంటలకు మాత్రమే వేతనం నిర్ణయించింది. నెలకు రూ. 2,265 వేతనంతో పాటు డీఏ రూ.6,000 అందజేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత పింఛన్‌ ఇవ్వడం లేదు. పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు వర్తించడం లేదు. ఈ ఉద్యోగుల విధి విధానాలు, వేతనాలు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో నియమించిన ఓ కమిటీ  ప్రతి ఐదేళ్లకొకసారి అధ్యయనం చేసి.. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అయితే..అందులోని అంశాలు అమలు కావడం లేదు.  

జిల్లాలో 902 మంది ఉద్యోగులు..
జిల్లాలో జీడీఎస్‌ పరిధిలో బ్రాంచ్‌ పోస్టుమాస్టర్లు 442 మంది ఉన్నారు. అలాగే మెయిల్‌ కొరియర్లు 170, మెయిల్‌ డెలివర్స్‌ 268, ఇతర విభాగాల్లో 22 మంది పనిచేస్తున్నారు. మొత్తం 902 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అదనపు పనికి అదనపు వేతనం వంటి నిబంధనలు అమలవుతున్నా.. తపాలా శాఖలో మాత్రం లేదు. పేమెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కూడా జీడీఎస్‌ల పాత్ర ఉంటుందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నా.. గ్రామీణ డాక్‌ సేవక్‌లను మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కంటే పనిగంటలు పెరిగాయి. అందుకు తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు.

అమలు కాని కమలేశ్‌ చంద్ర కమిటీ సిఫారసులు
దేశంలోని 2.70 లక్షల మంది జీడీఎస్‌ల వేతనాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేశ్‌ చంద్ర కమిటీ సిఫారసులు అమలుకావడం లేదు. కమిటీ నివేదిక వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు.

ప్రభుత్వాల నిర్లక్ష్యం:
గ్రామీణ డాక్‌ సేవక్‌ల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కమిటీలు చేసే సిఫారసులను కూడా అమలు చేయడంలేదు. 25 ఏళ్లుగా కటారుకొండలో ఉద్యోగం చేస్తున్నా. పని ఎక్కువైంది. ఎనిమిది గంటలు పనిచేస్తున్నప్పటికీ రూ.12 వేల వేతనం కూడా రావడం లేదు. కుటుంబ పోషణకు అవస్థ పడుతున్నా. -కాంతారెడ్డి, బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌

కనికరించని పాలకులు:
కమిటీలు చేసిన సిఫారసులను పాలకులు పట్టించుకోవడం లేదు. తపాలా వ్యవస్థ, ప్రభుత్వ పథకాల అమలు గ్రామీణ డాక్‌ సేవక్‌లపై ఆధారపడి ఉన్నాయి. నన్నూరు బీపీఎంగా ఉండి..శాఖా ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా. కనీసం మా జీవన స్థితిగతులను పాలకులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. - రాధ, గ్రామీణ డాక్‌ సేవక్‌

పేరుకే ఉద్యోగులం:
ముప్ఫై ఏళ్లుగా గ్రామీణ డాక్‌ సేవక్‌గా పనిచేస్తున్నా. ప్రస్తుతం నెలకు రూ.8 వేల వేతనం వస్తోంది. షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకసారి హార్ట్‌ స్ట్రోక్‌ కూడా వచ్చింది. ఇటీవలే పక్షవాతానికి గురయ్యా. ఇంగ్లిష్‌ వైద్యానికి డబ్బుల్లేక నంద్యాల సమీపంలో పసరు వైద్యం చేయించుకున్నా. మాకు వైద్యం కూడా ఉచితంగా అందని దుస్థితి. - ఎ.ఆల్‌ఫ్రెడ్, జీడీఎస్‌ ప్యాకర్‌

పేరుకే ఉద్యోగులం:
ముప్ఫై ఏళ్లుగా గ్రామీణ డాక్‌ సేవక్‌గా పనిచేస్తున్నా. ప్రస్తుతం నెలకు రూ.8 వేల వేతనం వస్తోంది. షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకసారి హార్ట్‌ స్ట్రోక్‌ కూడా వచ్చింది. ఇటీవలే పక్షవాతానికి గురయ్యా. ఇంగ్లిష్‌ వైద్యానికి డబ్బుల్లేక నంద్యాల సమీపంలో పసరు వైద్యం చేయించుకున్నా. మాకు వైద్యం కూడా ఉచితంగా అందని దుస్థితి.  - ఎ.ఆల్‌ఫ్రెడ్, జీడీఎస్‌ ప్యాకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement