ఇపుడిక.. బొంగులో కల్లు! | special Palm wine in jayashankar district | Sakshi
Sakshi News home page

కంక బొంగులో కల్లు!

Published Fri, Feb 9 2018 3:58 PM | Last Updated on Fri, Feb 9 2018 4:55 PM

special Palm wine in jayashankar district - Sakshi

ములుగు: ఇప్పటి వరకు బొంగు చికెన్‌ విషయం మాత్రమే మనకు తెలుసు. గొత్తికోయలు విన్నూత్నంగా కంక బొంగులో కల్లును సేకరిస్తున్నారు. విశాఖపట్టణం సమీపంలోని అరకు, భద్రాచలం సమీపంలోని పాపికొండల ప్రాంతాలలో ఆదివాసీలు ఈ విధానం ద్వారా కల్లు తీస్తారు. మేడారానికి వచ్చే దారి మధ్యలో గొత్తికోయలు తాటి చెట్లకు మట్టి కుండలకు బదులు వెదురు బొంగులను ఏర్పాటు చేసి కల్లును సేకరిస్తున్నారు. పర్యాటకులు ఈ కల్లును సరికొత్తగా ఆస్వాదిస్తున్నారు.      

రెట్టింపు ధర.. 
సాధారణంగా తాటి చెట్టు నుంచి సేకరించిన కల్లును గీత కార్మికులు రెండు లీటర్ల బాటిల్‌కు రూ.100 చొప్పున తీసుకుంటున్నారు. కాగా, మేడారానికి వెళ్లే దారి మధ్యలో వెంగళాపురం, మొట్లగూడెం, ప్రాజెక్టునగర్‌ మధ్యలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన గొత్తికోయలు వినూత్నంగా తాటిచెట్ల గొలలకు కంక బొంగులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టునగర్‌ సమీపంలోని సుమారు 20 కుటుంబాలకు చెందిన ఏడుగురు గొత్తికోయలు సమీపంలోని 50 తాటి చెట్లకు వెదురు బొంగులను ఏర్పాటు చేసి 20 రోజులుగా కల్లును సేకరిస్తున్నారు.   

కల్లు కోసం క్యూ..
పట్టణాల నుంచి ఏజెన్సీలోని పలు ప్రాంతాల సందర్శనకు వస్తున్న పర్యాటకులు బొంగు కల్లు కోసం క్యూ కడుతున్నారు. కంక బొంగు ద్వారా సేకరిస్తున్న రెండు లీటర్ల తాటి కల్లుకు రూ.200 ధర పలుకుతోంది. రెట్టింపు ధర డిమాండ్‌ చేస్తున్నా కల్లును కొనుగోలు చేస్తున్నారు. కంక బొంగులో సేకరించిన కల్లు సాఫ్ట్‌గా ఉంటుందని వారు చెబుతున్నారు.  

ఆస్వాదిస్తున్నారు.. 
15 సంవత్సరాల నుంచి మొట్లగూడెం సమీపంలో నివసిస్తున్నాం. స్థానికంగా ఉన్న తాటి చెట్లు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. ఈ విషయమై గ్రామస్తులను సంప్రదించి కల్లు గీయడానికి ఒప్పించాం. ప్రస్తుతం 20 కుటుంబాలకు చెందిన ఏడుగురం 50 తాటి చెట్లను కల్లు గీయడానికి ఒప్పదం కుదుర్చుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా ఎక్కువ పొడవు, లోతైన కంక బొంగులను తయారు చేసుకొని తాటి గొలలకు అమరుస్తున్నాం. కుండల ద్వారా సేకరించే కల్లుకు, మేము సేకరించే కంక బొంగు కల్లుకు వ్యత్యాసం ఉంది. రెండు లీటర్ల బాటిల్‌కు రూ.200 చొప్పున తీసుకుంటున్నాం. ప్రస్తుతం చెట్లన్నీ లేత దశలో ఉన్నాయి. మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో కల్లు అందుతుంది. ప్రజలు, పర్యాటకులు కంకబొంగు కల్లుపై ఆసక్తి చూపడంతో రోజుకు రూ.500 నుంచి 1000 మేర ఆదాయం వస్తోంది. 
మడక గంగయ్య, గొత్తికోయవాసి, మొట్లగూడెం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement