పుతిన్‌కు చైనా పురస్కారం Xi Jinping honors Vladimir Putin with China's first-ever Friendship Medal | Sakshi
Sakshi News home page

పుతిన్‌కు చైనా పురస్కారం

Published Sat, Jun 9 2018 1:12 AM | Last Updated on Sat, Jun 9 2018 8:22 AM

Xi Jinping honors Vladimir Putin with China's first-ever Friendship Medal - Sakshi

బీజింగ్‌ /క్వింగ్‌డావ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుక్రవారం బీజింగ్‌లోని గ్రేట్‌హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ భవనంలో రష్యా అధినేత పుతిన్‌కు చైనా అత్యున్నత పురస్కారమైన ‘ఫ్రెండ్‌షిప్‌ మెడల్‌’ను అందజేశారు. ఈ మెడల్‌ను చైనా ప్రదానం చేయడం ఇదే తొలిసారి. శాంతియుతమైన ప్రపంచం కోసం పుతిన్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.

చైనాలో పుతిన్‌కు అత్యంత గౌరవముందని వ్యాఖ్యానించారు. గతేడాది రష్యాలో పర్యటించిన జిన్‌పింగ్‌ను ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ’ పురస్కారంతో పుతిన్‌ గౌరవించారు. ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు పుతిన్‌ బీజింగ్‌కు వచ్చిన నేపథ్యంలో అమెరికా దూకుడును కట్టడి చేసేందుకు ఇరుదేశాధినేతలు ఈ సమావేశంలో ఓ అంగీకారానికి వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేటి నుంచి ఎన్‌సీవో సదస్సు ప్రారంభం
చైనాలోని క్వింగ్‌డావ్‌లో శనివారం ప్రారంభంకానున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సులో భారత్, చైనా, రష్యా సహా 8 దేశాల అధినేతలు హాజరై ఉగ్రవాదంపై పోరుతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. జూన్‌ 9 నుంచి రెండ్రోజుల పాటు ఎస్‌సీవో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శనివారం భేటీ కానున్నారు.

ఈ విషయమై ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ సదస్సులో వేర్వేరు దేశాధినేతలతో భేటీ అయి పలు అంశాలపై విస్తృతంగా చర్చింనున్నాం’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ప్రధాని పాక్‌ అధ్యక్షుడితో భేటీ అవుతారా? అన్న విషయమై స్పష్టత రాలేదు. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడంతో పాటు చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు, రష్యాపై యూరప్‌ దేశాలతో కలసి దౌత్యపరమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో జరగనున్న ఈ భేటీకి విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement